మెరిసే నక్షత్రం
గాలికి ఊగే చిగురాకులు
హృదయ కోవెల చిరుగంటలయితే
స్నేహంగా కోయిల
కోటితలపుల రాగమయ్యింది!
పల్చటి పొగమంచు తెర
రాత్రి జ్ఞాపకాలను ఉడ్చేస్తోంది
నిద్రలేమి నగరం ఆవులిస్తుంటే
అగరుధూపం నడుమ వేడి చాయ్
ఉదయాన్ని వెలిగిస్తోంది!
దూరంగా బైరాగి పాట
బతుకు అర్థాన్ని మెతుకులా అందిస్తోంది
మెరిసే నక్షత్రమై మనసు
అక్షరమాలలల్లుతోంది
– సి.యస్.రాంబాబు