యోధ ఎపిసోడ్ 12

యోధ ఎపిసోడ్ 12

ఆ రోజు ఆదివారం. అప్పటికే తెల్లారడంతో, కిందపడి ఉన్న పార్దుకి మెలుకువ వచ్చింది. తన తల మీద ఎవరో కొట్టినట్లు, అంతా పట్టేసినట్లు దిమ్ముగా ఉంది. తనకి తానుగా అక్కడి నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎవరి సహయాన్ని ఐనా కోరదాం అంటే, తన నోట్లో నుండి సరిగా మాటలు కూడా రావడం లేదు. చుట్టూ చూస్తున్నాడు, ఎవరూ కనిపించడం లేదు.

తనలో తానే శక్తిని కూడగట్టుకుని మెల్లగా బెడ్ మీదకి చేరుకున్నాడు. అక్కడే పక్కనున్న వాటర్ త్రాగి, అసలు ఓపిక లేని పార్ధు, మంచం మీద పడుకుని, అంతకుముందు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ, పదే పదే తన స్నేహితులను తలుచుకుంటూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తున్నాడు. తన స్నేహితులను కోల్పోవడానికి, చివరికి తను అలా అక్కడ అనాధగా మిగిలిపోవడానికి కూడా కారణం తనేనన్న ఆలోచన తనని వేధిస్తుంది, మరింత బాధిస్తుంది.

“అవేశ్… ప్రియా… గోపాల్… గౌతమి… విశాల్… కృతి” అంటూ భోరున విలపిస్తున్నాడు. “మిమ్మల్ని అందరినీ నా చేతులారా నేనే చంపుకున్నాను!” అంటూ మరింత గట్టిగా శోకిస్తున్నాడు. కానీ, ఈ సారి అతని ఆర్తనాదాలు కానీ, గోడుని కానీ వినేవారు.. పట్టించుకునే వారు లేరు. టైం గడుస్తుంది, కొద్ది కొద్దిగా పోయిన ఒపికంతా తనకి తిరిగొస్తుంది.

ఇంతలోనే బయట నుండి ఏవేవో వింత వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి పార్థుకు. మూసి ఉన్న తన రూం డోర్ మినహా, మిగిలిన రూం డోర్స్ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కొట్టుకుంటున్నాయి… అదేదో భయంకరమైన గాలికి కొట్టుకుంటున్నట్లుగా… అంతకుముందు వరకూ భయపడుతూ బ్రతికిన పార్దుకు… అలా భయంతో బ్రతకడం కన్నా, ఒకేసారి ఆ పిశాచికి ఎదురెళ్లి చావడం మెలనుకున్నాడో ఏమో!

తన రూం డోర్ తీసుకుని బయటకి వెళ్లి చూసాడు. తన గది బయటంతా (గెస్ట్ హౌస్) పట్టపగలే చీకటి అలుముకుంది. ఆ గెస్ట్ హౌజ్ బయట వాతావరణం హోరున వీస్తున్న గాలితో, భీకరమైన వర్షం పడుతూ తుఫానుగా మారింది. బాల్కనీ నుండి ఆ స్మశానం వైపు చూడగా, అంతటి పెద్ద వర్షంలో కూడా ఆ చితి ఆరకుండా మరింత పెద్దగా మండుతుంది. ఆ వర్షపు ధారలే పెట్రోల్ లా ఆ చితి మీద పడితే, ఎలాగైతే ఆ చితి మంటలు ఎగేసేగిసి పడతాయో అలా ఉంది అక్కడ.

మరొక పక్క మిగిలిన అన్ని రూం డోర్స్ మాత్రం ఓపెన్ చేసి, బయట నుండి వీస్తున్న గాలి దాటికి నిజంగానే “డభేల్..!.. డభేల్..!!” మంటూ కొట్టుకుంటున్నాయి. అంతకుముందు వరకూ క్లోజ్ చేసున్న ఆ గదులన్ని అప్పటికప్పుడు తెరుచుకోవడంతో… వాటి లోపలేమైనా తన స్నేహితులకి సంబంధించిన క్లూ ఏదైనా దోరుకుంతుందని ఆశతో ఆ రూమ్స్ వైపు వెళ్ళాడు పార్ధు. ముందుగా ప్రియ రూం లోకి వెళ్ళాడు పార్ధు.

అలా తను ఆ రూం లోకి వెళ్ళగానే, ఒక్కసారిగా ఆ రూం డోర్స్ తో పాటు మిగిలిన అన్ని రూమ్స్ డోర్స్ కూడా శబ్దాలు చేయడం ఆగిపోయాయి. తను అలా రూం లోకి వెళ్తుంటే, అంతా నిశబ్ధ వాతావరణమే. పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. పార్ధు నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం తనకి తన అడుగుల శబ్ధం మాత్రమే వినిపిస్తుంది.

అలా తను వెళ్తూ… వెళ్తూ… ప్రియ బెడ్ పక్కన క్రింద పడున్న ఒక లాకెట్ తో కూడిన నెక్లెస్ లాంటిది తనకి దొరికింది. దాన్ని గుర్తుపట్టిన పార్ధు అది కచ్చితంగా ప్రియదే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. మోకాళ్ళ పై కిందికి కూర్చుని తన చేతుల్లోకి అది తీసుకోబోతుంటే, సరిగ్గా అప్పుడే, వెనుక నుండి ఎవరో వచ్చి తన భుజం మీద చేయ వేయబోతునట్టనిపించి, ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన పార్ధుకి అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ, భయంతో పార్థుకి సడెన్గా గుండె ఆగినంత పనైంది.

ఆ నెక్లేస్ ని తీసుకుని, ఇంకా ఏమైనా తన వస్తువులు దొరుకుతాయేమోనని ఆ గదంతా అలాగే వెతుకుతున్నాడు పార్ధు. కానీ, అది తప్ప మరేం దొరకలేదు అతనికి. ఇంతలోనే మళ్ళీ ఒక రూం డోర్స్ శబ్దాలు చేస్తూ కొట్టుకోవడం వినిపించింది పార్ధుకి… ప్రియ రూం నుండి బయటకి వచ్చిన పార్ధు, ఆ డోర్స్ కొట్టుకుంటున్న రూం వైపు చూస్తే అది అవేశ్ దని అర్థమైంది. ప్రియ రూం నుండి బయటకి రాగానే, ఆ రూం డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక్క అవేశ్ రూం డోర్స్ మాత్రమే తెరిచి ఉన్నాయి. అందులో కూడా పార్ధుకి ఏదో క్లూ దొరుకుతుంది వెళ్ళమన్నట్టుగా…

అలా వెళ్లిన పార్ధుకి, అక్కడ రూం లో… కింద ఫ్లోర్ మీద బ్రాస్లెట్ ఒకటి తన కంటికి కనిపించింది. అంతకుముందు సంఘటన గుర్తుకువచ్చి, వెనకకు… అంటే ఆ రూం మెయిన్ డోర్ వైపు తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. దీంతో దాన్ని కూడా కిందకి వంగి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇంతలో పైనుండి ఏదో తన మీద పడుతున్నట్టుగా అనిపించి తల పైకెత్తి చూసాడు.

అప్పటివరకూ ఆఫ్ లో ఉన్న ఆ రూం సీలింగ్ ఫ్యాన్ కాస్తా చాలా వేగంగా తిరగడం మొదలయ్యింది. ఆశ్చర్యానికి లోనయ్యిన పార్ధు, స్విచ్ బోర్డ్ వంక చూడగా, ఎవరో అప్పుడే ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి వెళ్లినట్టుగా ఉంది. ఖంగుతిన్న పార్ధు,

“ఎవరు..? ఎవరది..?” అంటూ లోలోపల భయం ఉన్నప్పటికీ, కొంచెం గంభీరమైన స్వరంతో అరుస్తున్నాడు.

ఈ సారి వేరొక రూం డోర్స్ శబ్ధం చేస్తూ వినిపించగా, పార్ధు ఆ రూం నుండి బయటకు రావడంతో అవేష్ రూం డోర్స్ కూడా క్లోజ్ అయ్యాయి. శబ్దాలు చేస్తున్న డోర్స్ కలిగిన రూం గోపాల్ ది. ఇప్పుడు అతని రూం డోర్స్ ఓపెన్ అయ్యాయి. బిక్కు బిక్కు మంటూ భయంతోనే, ఈ సారి కూడా ఆ రూంలోకి వెళ్ళాడు పార్ధు. అక్కడే కింద ఒక వాల్లెట్ చెల్లా చెదురుగా పడి ఉండడం, అందులో నుండి గోపాల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండడంతో, అది గోపాల్ దేనని కన్ఫర్మ్ చేసుకున్నాడు పార్ధు.

పైకి, వెనకకు చూస్తూ ఎవరూ లేరని కిందికి వంగి ఆ వాలెట్ కూడా తీసుకోబోతుంటే, అప్పటివరకూ బయట తుఫాన్ దాటికి సరిగా వెలుతురు లేకుండా ఉన్న ఆ గది వెలుతురు నిండుకుంది, అప్పుడే సడెన్గా ఎవరో లైట్స్ ఆన్ చేసినట్లుగా… పార్ధుకి భయం మరింత పెరుగుతుంది. అయినా కొంచెం దైర్యం చేసి,

“హేయ్…! ఎవరు నువ్వు…! నాతో ఎందుకు ఆటలాడుతున్నావ్..?” అంటూ ఆ అజ్ఞాత వ్యక్తిని గధమాయిస్తాడు.

ఇంతలోనే మళ్ళీ ఇంకో రూం డోర్స్ తెరుచుకుని, “డభేల్… డభేల్…” మంటూ శబ్దాలు చేయడం తో బయటకి వెళ్ళిన పార్ధు, అవి గౌతమి రూం నుండి వస్తున్నట్టు గమనించాడు. అలా తన రూం లోకి కూడా వెళ్ళిన పార్ధుకి అక్కడ గౌతమి హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. ముందూ, వెనుక.. పైనా కిందా అంతా చూసాడు. తనకెవరూ కనిపించలేదు. ఆ హ్యాండ్ బ్యాగ్ తన చేతుల్లోకి తీసుకోబోతుంటే, ఉన్నపాటుగా డోర్ క్లోజ్ అయ్యినట్టు పెద్ద శబ్ధం. ఒక్కసారిగా ఖంగుతిన్న పార్ధు, ఊపిరి గట్టిగా బిగబెట్టి 

వెనక్కి తిరిగి ఆ రూం మెయిన్ డోర్ వైపు చూశాడు. అది అలాగే తెరుచుకుని ఉంది. మరి ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చినట్టు..? మళ్ళీ డోర్ తెరుచుకుంటున్న శబ్ధం, జాగ్రత్తగా గమనించగా అది ఆ గది యొక్క వాష్ రూం నుండి వస్తున్నట్టు గ్రహించాడు పార్ధు. దాంతో ఊపిరి పీల్చుకున్నాడో లేదో! సరిగ్గా అప్పుడే మరింత పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ… బయట నుండి ఇంకో రూం డోర్స్ కొట్టుకోవటంతో ఆ హ్యాండ్ బ్యాగ్ ని కూడా తన చేతుల్లోకి తీసుకుని బయటకి వచ్చేశాడు పార్ధు.

ఈ సారి విశాల్ రూం తెరిచి ఉంది. ఆ రూం లోకి వెళ్ళిన పార్ధుకి, అక్కడ ఒక రింగ్ ఒకటి కనిపించింది. అది విశాల్ దే అని గుర్తించిన పార్ధు… దాన్ని తన చేతుల్లోకి తీసుకునే ముందు చుట్టు పక్కలా అంతా పదే పదే తడిమి చూస్తున్నాడు. ఎక్కడా ఎవరూ ఉన్నట్టు లేరు. కిందకి వంగి అది తన చేతుల్లోకి తీసుకోబోతుండగా… ఎవరో ఆ రూం డోర్ నాక్ చేస్తున్న శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు పార్ధు. కానీ, అక్కడ ఎవరూ లేరు.

“ఎవరది..? ఎవరు..! పిచ్చి పిచ్చిగా ఉందా ..!” అంటూ ఒకపక్క భయపడుతూనే, మరొకపక్క మరింత ధైర్యం కూడగట్టుకుని గంభీరమైన స్వరంతో పెద్ద పెద్దగా అరుస్తున్నాడు పార్ధు. కానీ, తన అరుపులకి సమాధానం లభించలేదు.

ఇంతలోనే కృతి రూం వైపు నుండి డోర్ కొట్టుకుంటున్న శబ్దాలు వినిపించడంతో అదే భయంతో ఆ రూంలోకి వెళ్ళాడు పార్ధు. అక్కడ కూడా అంతా నిశబ్ధమే, ఎంత నిశబ్దం అంటే చిన్న పిన్ పడినా వినపడేంత. అలా తను ఆ రూంలో నెమ్మదిగా… అంటే, ఈ సారి తన పాదాలు కూడా శబ్దాలు చేయనంత నెమ్మదిగా వెళ్తుంటే,

“టిక్.. టిక్..టిక్…” మంటూ శబ్ధం ఒకటి వినిపించింది తనకి. ఆ శబ్ధం వస్తున్న వైపు చూడగా కింద ఒక వాచ్ పడుంది. అది కృతిది. దాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుందామని కిందికి వంగగా… పక్కనే ఒక నీడ, నిలువెత్తుగా నిలుచున్నట్టు కనిపించింది.

అది తనది కాదని తనకి అర్థమైంది… మరి ఆ నీడ ఎవరిది? ఈ సారి తనకి నిజంగానే గుండె ఆగినట్టనిపించింది… భయంతో వెనక్కి తిరిగలేక, తిరగలేక… నెమ్మదిగా వెనక్కి తిరిగిన పార్ధుకి అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే పక్కకు చూడగ అక్కడ అంతకుముందున్న ఆ నీడ మాయమైంది.

పార్ధు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వేరొక రూం డోర్స్ కొట్టుకోవడం స్టార్ట్ చేయడంతో బయటకి వచ్చిన పార్ధు… అవి తన రూం డోర్స్ చేస్తున్న శబ్దాలేనని గ్రహించాడు. మిగిలిన అన్ని రూమ్స్ యొక్క డోర్స్ క్లోజ్ అయిపోయాయి. అలా తన రూం లోకి వెళ్ళిన పార్ధుకి, అక్కడ తనకోసమే అన్నట్టుగా భోజనం ఏర్పాటు చేసుంది. సరిగ్గా అప్పుడే బయట హల్ నుండి క్లాక్… మధ్యాహ్నం ఒంటిగంట అయినట్టు గంట కొడుతూ శబ్ధం చేస్తుంది. అలా ఆ భోజనాన్ని చూస్తున్న పార్ధుకి, అప్పటివరకూ ఎరగని తన ఆకలి తనకు తెలిసొస్తుంది. అప్పటికే కొంచెం నీరసంగా ఉన్న పార్ధు, క్షణం ఆలోచించకుండా ఆ భోజనాన్ని లాగించేసాడు.

చుట్టూ ఇన్ని మాయలు జరుగుతుంటే, పార్ధుకి ఏం అర్థం కావడం లేదు. అలా తన భోజనం పూర్తయ్యాకా… ఆ దొరికిన వస్తువుల గురించి విపరీతంగా ఆలోచించగా తనకి తెలిసిందేంటంటే, ఆ దొరికన వస్తువులు ఒకరికొకరు గిఫ్ట్స్ గా ఇచ్చుకున్నవి… అంటే, ప్రియ రూమ్లో దొరికిన నెక్లెస్… ప్రియకి అవేశ్ గిఫ్టుగా ఇచ్చింది, అవేశ్ రూంలో దొరికిన బ్రాస్లెట్… అవేశ్ కి ప్రియ గిఫ్ట్ గా ఇచ్చింది.

గౌతమి రూమ్లో దొరికిన హ్యాండ్ బ్యాగ్… గౌతమికి గోపాల్ గిఫ్టుగా ఇచ్చింది, గోపాల్ రూంలో దొరికిన వాలెట్… గోపాల్ కి గౌతమి గిఫ్ట్ గా ఇచ్చింది. కృతి రూమ్లో దొరికిన వాచ్.. కృతికి విశాల్ గిఫ్టుగా ఇచ్చింది, విశాల్ రూంలో దొరికిన రింగ్… విశాల్ కి కృతి గిఫ్ట్ గా ఇచ్చిందన్న మాట. అదంతా ఆలోచిస్తూ సేదతీరాడు పార్ధు. అలా కాస్త సమయం గడిచింది.

************

బయట నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉరుములు ఉరుముతున్నాయి, పైనుండి ఆకాశం విరిగిపడుతుందాన్నట్టు, పిడుగులన్నీ కలగలిసి ఆ గెస్ట్ హౌజ్ మీద పడుతున్నట్టు. వాటి ఘీంకారాలకి ఉలిక్కి పడి లేచిన పార్ధు, గది నుండి బయటకి వచ్చి చూసాడు. బాల్కనీ నుండి ఆకాశం వైపు చూస్తుంటే, మెరుపులు ఏకధాటిగా మెరుస్తూ తన కళ్ళను కమ్మెస్తున్నాయి. ఉరుములు, పిడుగులతో ఆకాశం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తన రెండు చెవులను కప్పేస్తుంది.

ఆ మెరుపుల యొక్క కాంతిని తన కళ్ళు, ఆ పిడుగుల యొక్క శబ్దాన్ని తన చెవులు అసలు భరించలేకుండా ఉన్నాయి. దాంతో తన గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. అప్పటివరకూ చీకటితో నిండి ఉన్న లోపలంతా, ఆ ఉరుముల కాంతి దాటికి వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశవంతంగా మారింది. బయట నుండి వచ్చే కాంతిని చూడలేక బాల్కనీ నుండి లోపలికి వచ్చేశాడు. ఆ ధ్వనిని భరించలేక, తన రెండు చెవులను తన రెండు చేతులతో గట్టిగా మూసుకున్నాడు.

ఇంతలో ఒక్కసారిగా ఆ శబ్దాలు, కాంతి రెండూ ఆగిపోయాయి. మళ్ళీ నిశబ్ద వాతావరణం, అంతా చీకటి చుట్టుముట్టాయి ఆ గెస్ట్ హౌజ్ లో. సరిగ్గా అప్పుడే, పై ఫ్లోర్ నుండి మెట్ల ద్వారా కింది ఫ్లోర్ కి ఏదో ఆకారం, తెల్లటి ముసుగు కప్పుకుని కిందకి దిగుతూ వెళ్ళడం గమనించాడు పార్ధు.

“ఎవరది..? హేయ్..ఆగు..? ఎవరు …నువ్వు…?” అంటూ ఆ వెళ్తున్న ఆజ్ఞాత ఆకారాన్ని గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు పార్ధు.

కానీ, అది మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తనదే అన్నట్టుగా అలానే కిందికి దిగుతుంది. ఒక పక్క పార్ధు.. భయపడుతూనే తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరెంత గట్టిగా దాన్ని పిలుస్తున్నా, దాని దగ్గర నుండి రెస్పాన్స్ లేదు. దాన్ని ఆలా అనుసరిస్తూ కిందకి దిగబోతున్న పార్ధు…

మొదటి మెట్టు మీద కాలు మోపగానే, కాలు జారీ ఆ మెట్ల పైనుండి దొర్లుకుంటూ కిందికి పడిపోయాడు. దాంతో తన నుదుటి మీద, చేతికి కాళ్ళకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ గాయలతోనే, వెంటనే తేరుకుని లేచి చూసినా పార్ధుకి ఆ ఆకారం కనిపించలేదు.

“ఎవరది..? ఎవరు…?” అంటూ ఆ వంట గది డోర్ తెరిచి ఉండడంతో, అది అటువైపుగా వెళ్లిందని భావించి, ఆ రూంలోకి వెళ్ళాడు దాన్ని వెతుక్కుంటూ..

అక్కడ ఆ అజ్ఞాత ఆకారం అయితే కనిపించలేదు కానీ, ఒక టార్చ్ లైట్ కనిపించడంతో, అది తీసుకుని దాని లైట్ ఉపయోగించుకుంటూ ఆ హల్ అంతా ఆ అజ్ఞాత ఆకారం కోసం వెతుకుతున్నాడు. అలా టార్చ్ లైట్ తీసుకుని ఆ హల్ అంతా తిప్పుతున్న పార్ధుకి… పైనుండి కింది వరకూ నల్లని వస్త్రాలు ధరించి, తలపై నుండి అదే నల్లటి గుడ్డతో ముసుగు తగిలించుకుని ఒక పొడవాటి ఆకారం కనిపించింది దాని వెలుగులో అకస్మాత్తుగా.

దాంతో షాక్ కి గురైన పార్ధు, తన ఊపిరి బిగబెట్టి, మరలా ఆ టర్చ్ ని అటువైపు తిప్పగా అక్కడ ఎలాంటి ఆకారం లేదు. అసలే భయంతో బిక్కు బిక్కు మంటూ పార్ధు అదంతా తన భ్రమగా భావించి, అక్కడ నుండి మెల్లగా నడుచుకుంటూ ముందుకు కదులుతున్నాడు. టార్చ్ పట్టుకుని ఆ హల్ అంతా తిరుగుతున్నాడే కానీ, ప్రాణ భయంతో తన ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. మరొక పక్క ఆ భయానికి ఆజ్యం పోస్తూ బయట మళ్ళీ ఉరుములు, పిడుగులు భీకరమైన శబ్దాలు చేయడం మళ్ళీ మొదలెట్టాయి.

కింద ఏం లేదని, మెట్ల ద్వారా టార్చ్ లైట్ వెలుగులో పైకి వెళ్లబోతుంటే, తనకి అడ్డంగా ఒక మరొక ఆకారం తెల్లటి వస్త్రాలు ధరించి, అదే తెల్లటి ముసుగుని తన తల పైనుండి కప్పుకుని మెదలడం గమనించి, భయంతో ఒక్కసారిగా వెనక్కి వెళ్ళబోతూ ఆ మెట్ల పై నుండి మళ్ళీ జారిపడ్డాడు పార్ధు. మరలా లేచి, ఆ టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడ కూడా ఎవరూ లేరు.

అప్పుడే పార్ధు కన్ఫర్మ్ చేసుకున్నాడు.. ఎప్పుడూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తనని భయబ్రాంతులకు గురిచేసే ఆ పిశాచి, ఈసారి నిశబ్ధంగా తనతో ఆటలాడుకుంటుందని, ఇంతలో పై ఫ్లోర్ నుండి వాళ్ల రూం తలుపులు కొట్టుకుంటున్న శబ్దాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అదే మెట్ల వెంబడి, టార్చ్ లైట్ సహాయంతో మెల్లగా ఏదోలా అలా పైకి చేరుకోగలిగాడు పార్ధు.

అలా తను పైకి చేరుకునేటప్పుటికి అక్కడ ఎలాంటి శబ్దాలు వినిపించకుండా చాలా నిశబ్ద వాతావరణం ఉంది. జరుగుతున్న సంఘటనలు పార్ధు మనసులో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. టార్చ్ లైట్ సహాయంతో ఒక్కొక్క రూం దగ్గరకి వెళ్లి చూస్తున్నాడు. అవన్నీ క్లోజ్డ్ గా ఉన్నాయి. అలా తను దాటి వచ్చిన వెనుకనున్న ఒక రూం డోర్ మెల్లగా తెరుచుకుంటుంది. దాని శబ్దానికి మెల్లగా వెనక్కు తిరిగి అటువైపు లైట్ వేసిన పార్ధు, ఆ డోర్ తెరుచుకుంటున్న రూం లో నుండి..

“పార్ధు…! పార్ధు…!” అంటూ ఒక ఆడ స్వరం ఒకటి తనకి వినిపిస్తుంది.

అప్పటికే భయంతో వణికిపోతున్న పార్ధు… దాంతో ఆ టార్చ్ పట్టుకున్న తన చేతులు మరింతగా వణికిపోతున్నాయి. 

“ఎ.. ఎ… ఎవరది…? నీకేం కావాలి..? నన్నెందుకు ఇలా వేధిస్తున్నావ్..?” అంటూ తడబడుతున్న స్వరంతో పార్ధు ఆ రూంలోకి వెళ్ళాడు.

కానీ, అందులో ఎవరు లేరు. తను ఆ రూంలో వుండగానే, ఇంతలోనే మళ్ళీ వేరొక రూం డోర్ తెరుచుకుంటున్న శబ్దంతో బయటకి వచ్చిన పార్థుకి అందులో నుండి కూడా

“పార్ధు…! పార్ధు…!” అంటూ ఈ సారి ఒక మగ స్వరంతో, మరొక వాయిస్ వినిపించింది.

“ఎవర్ నువ్వు…? నీకేం కావాలి..?” అంటూ పెద్ద పెద్ద గా అరుచుకుంటూ అందులోకి వెళ్ళినా… అక్కడ కూడా తనకి ఎవరూ కనిపించలేదు, తన ప్రశ్నకి బదులు రాలేదు.

ఈ సారి బయట మిగిలిన అన్ని రూమ్స్ డోర్స్ “డభేల్… డభేల్..” మంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. దాంతో బయటకి వచ్చిన పార్ధు కి, ఆ రూమ్స్ అన్నింటి నుండి “పార్ధు… పార్ధు…” అంటూ ఆడ మగ రెండు స్వరాలు కలగలిసి వినిపిస్తున్నాయి. వాటితో పాటు “హా.. హహ్హ…హహ్హహ్హ…” అంటూ పెద్ద పెద్ద నవ్వులు ఆ స్వరాలతో కలగలిసి, అసలే ఆ గెస్ట్ హౌజ్ క్లోజ్డ్ గా ఉండడంతో అవి గోడలకి తలిగి మరింత భయంకరంగా ప్రతిధ్వనిస్తున్నాయి.. లౌడ్ స్పీకర్ ను చెవి దగ్గర పెట్టీ అరిచినట్టుగా.

దానికి తోడు… బయట నుండి భయంకరంగా వస్తున్న పిడుగులు, ఉరుముల శబ్దాలు. వాటి మధ్య అదుపులేకుండా టెలిఫోన్ రింగ్ అవుతున్న శబ్ధం, అలుపు లేకుండా గోడ గడియారం గంటలు కొడుతున్న శబ్ధం… అవన్నీ కలగలిసి పార్ధు కర్ణభేరి తెగిపోయెంత దారుణంగా శబ్దాలు చేస్తున్నాయి. పైగా అంతా చిమ్మ చీకటి…

ఆ శబ్దాల దాటికి పార్ధు బుర్రంతా బరువెక్కి, తన తలలోని నరాలు తెగినంత బాధగా అనిపిస్తుంది. కళ్ళు కూడా తిరుగుతూ, అసలు ఆ క్షణం తనకి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఆ నొప్పిని భరించలేక, పిచ్చివాడిలా… తన రెండు చేతుల వేళ్ళతో, తన జుట్టుని పట్టుకుని గిర్రున తిరుగుతున్నాడు… ఇంతలోనే అతనికి భయంకరమైన వికృత రూపాలు దర్శనమివ్వడంతో అక్కడే, ఆ పై ఫ్లోర్ లో అతని రూం డోర్ దగ్గరే సొమ్మసిల్లి పడిపోయాడు పార్ధు.

ఇప్పటివరకూ చనిపోయిన వాళ్ళందరూ… ముందు అలా సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళే, అంటే పార్ధు కూడా చివరికి అంతమవబోతున్నాడా…?

ఇప్పటివరకూ మంచివాడిగా భావించిన తను కూడా ఎవరి జీవితాన్నైనా నాశనం చేశాడా…?

మంచోడు, చెడ్డోడు అనే దాంతో సంబంధం లేకుండా, ఆ పిశాచి పార్ధు ప్రాణాలు కూడా తీసుకుంటుందా…?

కనీసం పార్ధు ప్రాణాలైనా రక్షించడానికి ఎవరైనా వస్తారా..?

అసలు పార్ధు ఏమవబోతున్నాడు..?

అసలా పిశాచి కథేమిటి..?”

లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, మిగిలిన భాగాలు అసలు మిస్ కాకండి. “యోధ (ఓ ఆత్మ ఘోష)” ఇంకా కొనసాగుతోంది. తర్వాతి భాగం “యోధ (ఓ ఆత్మ ఘోష)-13” లో కొనసాగిస్తాను…

 భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *