పొగచూరిన బతుకులు
మావిని ఛేదించుకొని మానవిగా మర్త్యలోకం లోకి అడుగు పెట్టాను..
పురిటి నుంచి మొదలుపెట్టి మెట్టింట్లో అడుగు పెట్టే వరకు పటిష్టమైన శిక్షణను పొంది.
సుశిక్షితురాలైన ఇల్లాలుగా మారి పెళ్లి పేరుతో వంటింటి సామ్రాజ్యానికి రారాణిగా మారాను.
ఒకప్పుడు తడికట్టెలతో పొగ చూరిన వంటింటితో.
గిన్నెలు కడుగుతూ,
పప్పులు రుబ్బుతూ,
వడ్లను దంచుతూ,
వండుతూ వారుస్తూ,
ఎంగిలి విస్తర్లు ఎత్తుతూ,
నిరంతరం వచ్చి పోయే అతిధులకు
చవులూరించేలా అరిసెలు,
గారెలు, మినుపుండలు, మిఠాయిలు వండి పెడుతూ ఎదురులేని మహారాణిగా వెలుగొందాను..
ఇక ఇప్పుడు మానవ మేధస్సు మహోన్నతంగా వెలుగుతున్న
అత్యాధునిక సాంకేతిక యుగంలో..
నా పాదం పైకి ఎత్తాను..
వంటగది గడపను ఇకనైనా దాటాలని..
అయితే నా శ్రమను, నా ఆశలను, కోరికలను గమనించారేమో..
పొగ చూరిన వంటిల్లు స్థానంలో అందమైన టైల్స్ తో అపురూపమనిపించే..
ఇంటీరియల్ పనితనంతో కూడిన వంటింట్లో చిటికలో వెలిగే
గ్యాస్ స్టవ్ తో గ్రైండర్,
మిక్సీ, కట్టర్స్, ఓవెన్ లలో పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఫుడ్డింగులు, చవులూరించేలా
చేసే అత్యాధునిక సామాజిక మాధ్యమాలను అందించి అందమైన కనువిందు చేసే వంటింట్లో ..
శాశ్వతంగా భూస్థాపితం చేశారు..
ఎంత అభ్యుదయ సమాజం ఇది..!
స్త్రీలకు ఎంత సమానత్వమో కదా..!
– మామిడాల శైలజ
పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ దుర్మార్గాన్ని దుర్లక్షణాలను మీ అత్యద్భుత కవిత ద్వారా ఎండగట్టారు. మీకు అభినందనలు శైలజ గారు