జనగోస
దిగులు పడిన ఆకాశం
శోకధారలా ఉంది వాన
చినుకై నేలను ముంచేసింది
ఎటుచూసినా నీటి బీభత్సమే
ఎక్కడయ్యా భానుడా
నీకోసం జగతి
ఎదురుచూపుల
అమ్మలా మారి
బిడ్డా నువ్వెక్కడంటోంది
ఉగ్రరూపమై ఏరులు
రుద్రమ్మలై నీటిఖడ్గాలను దూస్తుంటే
పోటెత్తుతూ నదులు
జనజీవనంపై జలప్రళయంతో
విలయతాండవమాడుతున్నాయి
వానొచ్చినా దుఃఖమే
రాకున్నా దుఃఖమే రైతుకు
అన్న నానుడి లిఖించాడేమో విధాత
అన్నదాతకు ఆరనిమంటైందీ వాన
సూరీడా..మారేడా..
నువ్వలిగితే గుండె పగిలేనిక్కడ
నిక్కమైన సత్యమే నీవు
దయచూపి వెలుగివ్వు
జనగోస వినవయ్య
భానుడా..రావయ్య మా దేవుడా..
– సి. యస్. రాంబాబు