తీరం చేరని అల
ఆలోచనల్లా కదిలే మేఘాలు
ఎక్కడో వర్షించి భారాన్ని దింపుకుంటాయి
బాధ్యత లేని ఆలోచనల
భారమే మనిషిని కలవరపెడుతుంటుంది
వర్షించే మేఘం
ఆహ్లాదమూ కావచ్చు
ఆవేశమై రావొచ్చు
వర్షించే కళ్ళకు బాధొక్కటే తెలుసు
దిగులు కప్పుకున్న ఆకాశం
వానతో తెరిపిన పడుతుంది
దిగులు నిండిన మనసేమో
మాటరాని మౌనమై మిగులుతుంది
మేఘాల దిగులంతా తాత్కాలికం
మళ్ళీ చెంగుమంటూ కదిలిపోతాయి
దిగులు మనిషి మాత్రం
తీరం చేరని అలలా మిగిలిపోతాడు
– సి.యస్.రాంబాబు