ఎవరు ఫైనల్ పార్ట్
లక్ష్మిగారు బలంగా ఉపిరి పీల్చుకుని, చిన్నగా “నేనే” అని సమాధానం ఇచ్చారు.
నాకు ఏమీ అర్ధం కాలేదు. అలీ వైపు చూసాను, అలీ నవ్వుతూ కనిపించాడు. “అంటే అది చేసింది దర్శన్ గారు కాదా?”
అలీ “కత్తి కొన్నది వారే, కానీ వాడింది మేము.”
“అర్థం కాలేదు”
అలీ “అసలు ముక్తానంద భూపతి ఎలా చనిపోయారు? ఎక్కడా దొరకని ఆ వింత రసాయనం(డ్రగ్) దర్శన్ గారికి ఎక్కడిది? విగ్రహం భూపతి రాజు గారి దగ్గర ఉంది అని దర్శన్ చిత్రపాటికి ఎలా తెలుసు? ఇవన్ని కనుమూరి కేసు ఫైల్ లో ప్రశ్నలుగానే మిగిలిపోయిన అనుమానాలు.”
*********
అలీ కొనసాగిస్తూ “ఎప్పుడైతే నేను కేసు సొంతగా సాల్వ్ చేయాలి అనుకున్నానో అప్పుడు ఈ ఊరికి బయలుదేరాను. కానీ నేను వచ్చిన రోజే భూపతి రాజుగారు మరణించారు. ఆ రోజు భూపతి రాజుగారు మృత దేహాన్ని చూడటానికి వచ్చిన అడివి జాతి వారి ప్రవర్తన చూసి అందరూ అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ నేను అక్కడే ఉండి చుట్టూ పరిసరాలను గమనించాను, అక్కడ వివరాలు ఏమీ దొరకపోవటంతో లోయలోకి దిగి కారులో చూసాను. అక్కడ నాకు ఈ లేఖ, విగ్రహం కనిపించాయి.”
“మరి విగ్రహం అడివి జాతి వారికీ దొరికింది అని వచ్చిన కబురు?”
అలీ “అబద్ధం..”
అలీ “అవి దొరకగానే ఈ కేసుకు, వింటున్న పుకార్లకి ఎటువంటి సంబంధం లేదు అని అర్ధం అయ్యింది. విచారణ మొదలు పెట్టాను. విచారణలో లక్ష్మి తాతగారు అయిన నారాయణ భూపతిగారు చనిపోయింది మాత్రమే ఆక్సిడెంట్ లాగా అనిపించింది. వారి కుమారులు ముక్తానంద భూపతి, భూపతి రాజు మరణాల వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానం మొదలయింది.
ముక్తానంద భూపతి, భూపతి రాజుల మరణానికి ముందు, తరువాత ఈ ఊరికి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అన్న వివరాలు సేకరించాను. ఆ ప్రక్రియ వల్ల నాకు తెలిసింది, మహేష్ భూపతిగారు, ముక్తానంద భూపతి చనిపోవటానికి రెండు రోజులు ముందు ఈ ఊరు వచ్చారు. భూపతి రాజు చనిపోవటానికి ముందు రోజు కూడా ఆయనకు భూపతి రాజుగారి నుండి కబురు వెళ్ళింది.
సహజంగా మహేష్ గారి గురించి విచారణ మొదలు పెట్టాను. మహేష్ గారి దగ్గర పని చేసిన పాత మేనేజర్ ఒక అతను మహేష్ గారి గురించి ఎవరికీ తెలియని మరో కోణం గురించి చెప్పారు. లక్ష్మిగారి సహాయంతో మహేష్ గారి స్నేహితులు, వారి బిజినెస్ అండ్ పర్సనల్ ఫ్రెండ్స్ అందర్నీ విచారించాను. సమాచారం అంతా కలగలిపితే తెల్సిన నిజం ఏమిటి అంటే….
మహేష్ గారు ఒక కెమిస్ట్. కెమికల్ వెపనరీ లో ఉన్న అతి తక్కువ నిపుణులలో మహేష్ గారు ఒకరు. అతనికి మేథస్సుతో పాటు అహంకారం, గర్వం కూడా ఎక్కువే. పరువు, డబ్బు మీద కూడా మక్కువ ఎక్కువ. ముక్తానంద భూపతిగారికి పెళ్లి కాకపోవటం వల్ల, భూపతి వంశానికి తాను ఒక్కడే వారసుడు అనే ధీమాలో ఉండేవారు.
కానీ నారాయణ భూపతి చనిపోయాక, ముక్తానంద భూపతీ తన ఆస్తి వాటా దానధర్మాలు చేస్తున్నారు అని తన ప్రేయసి అలౌక్యగారి ద్వారా తెలిసి, మహేష్ గారు ముక్తానంద భూపతిని కలవటానికి వచ్చారు. కానీ ముక్తానంద భూపతి తన వాటా ఆస్తికి మహేష్ గారు వారసులు కాదు అని నిక్కచ్చిగా చెప్పారు. ఎప్పడైతే దర్శన్ చిత్రపాటి ఊరిలో శాపము, పుకారు గురించి మహేష్ గారికి చెప్పారో, మహేష్ గారు అప్పుడే ముక్తానంద గారిని చంపటానికి పథకం వేసారు. తాను తయారు చేసిన రసాయనాన్ని దర్శన్ గారికి ఇచ్చి, ఆయన చేతే ముక్తానందగారిని చంపించారు.”
“మహేష్ గారా!! నేను నమ్మలేకపోతున్నాను. ఆస్తి కోసం ముక్తానంద భూపతిగారిని చంపి ఉండచ్చు, కానీ భూపతి రాజుగారిని చంపాల్సిన అవసరం ఏమిటి?”
అలీ “అది ఆస్తి కోసం కాదు. తరువాత వారసులుగా వచ్చిన భూపతి రాజుగారికి విగ్రహం గురించి పోతన చెప్పాడు. అది తీసుకురావటం వల్ల తన తండ్రి, అన్న చనిపోయారు అని ఆయన బలంగా నమ్మారు. అది వెతికి పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా ఆయనకు విగ్రహం భవంతిలోనే దొరికింది. భూపతి రాజుకి తన కుమారుడు గురించి తెలియక ఆ కబురు మహేష్ గారికి పంపించారు.
అంత విలువైన విగ్రహం ఆ అడివి జాతి వారికీ ఇచ్చేయాలి అని భూపతి రాజు తీస్కున్న నిర్ణయం మహేష్ గారికి నచ్చలేదు. మహేష్ గారు అది వారికి అప్పుడే ఇవ్వద్దు అని, తాను వస్తున్నాను అని తిరిగి కబురు పంపారు. రాత్రి పూట వచ్చే ముసుగు మనుషులు అదే భూపతి సైన్యం, భూపతి రాజుగారి కంట పడ్డారు. వారికి భయపడి ఆ విగ్రహం తీస్కుని దర్శన్ చిత్రపాటి ఇంటికి బయల్దేరారు.
దర్శన్ గారు మహేష్ మాటగా విగ్రహం ఆ అడివి జాతి వారికి ఇవ్వద్దు అని ఒప్పించేందుకు ప్రయ్నతించారు. కానీ భూపతి రాజు అందుకు ఒప్పుకోలేదు. అక్కడే ఉంటె దర్శన్ చిత్రపాటి, విగ్రహం తనతో పాటు తీసుకొచ్చాను అని కనిపెట్టి బలవంతగా అయినా లాక్కుంటాడేమో అని భయపడి, అర్థరాత్రి అని కూడా చూడకుండా భూపతి రాజుగారు చిత్రపాటి ఇంటి నుండి బయల్దేరారు.
సులువుగా తప్పు చేసి తపించుకున్న వారు కాబట్టి, వారి మాట వినకపోతే భూపతి రాజు గారిని చంపేయాలి అని ముందే నిర్ణయించుకున్నారు. ముక్తానంద భూపతి గారిని చంపిన విధంగానే భూపతి రాజు గారికి కూడా వెళ్లే ముందు డ్రగ్ ఇచ్చారు. కానీ వారికి తెలియంది విగ్రహం కారులోనే ఉంది అని, కారుతో సహా లోయలో పడిపోయిందని.”
“మరి మహేష్ గారు??”
అలీ “లక్ష్మిగారు జరిగింది తెలుసుకున్నాక చాల దిగ్బ్రాంతికి గురయ్యారు. సొంత అన్నే తన నాన్నగారిని, తాను అమితంగా ప్రేమించే, తనను పెంచిన పెదనాన్నను చంపారు అని తెలిసి నమ్మలేకపోయారు. ఆమెకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. నేను పోలీసులకి ఇది అంతా చెప్పి వెళ్లిపోవాలి అనుకున్నాను. మహేష్ గారు లక్ష్మికి నువ్వు చేరువ అవటం చూసి కృప ద్వారా నిన్ను కూడా చంపాలి అనే నిర్ణయం తీస్కున్నారు.
కృప లక్ష్మిగారి శ్రేయోభిలాషి కావటంతో ఆ విషయం మాకు తెలిసింది. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళ అన్నయ్య, దర్శన్ ఉండకూడదు అని లక్ష్మిగారు నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఉన్న భూపతి పలుకబడికి మహేష్ గారిని ఎవరూ ఏమీ చేయలేరు అని, నాకు నచ్చకపోయినా నన్ను కూడా ఒప్పించారు. ఎలాగైతే మహేష్ గారు అందరిని చంపారో అలానే ఆయన చావు కూడా అని నిర్ధారించాము.
ఆ రోజు పార్టీలో దర్శన్ గారు డ్రగ్ కలిపిన డ్రింక్ ని నీకు ఇమ్మని కృపకి ఇచ్చారు. కానీ అది మేము మహేష్ గారికి ఇచ్చాము. ఎంతసేపు అయినా మహేష్ గారి నుండి స్పందన లేకపోయే సరికి అది పనిచేయట్లేదేమో అని అనుమానం వచ్చి లక్ష్మిగారు చూడటానికి వెళ్లారు. అప్పుడే లక్ష్మిగారిని నువ్వు చూసావు.”
“మరి దర్శన్ గారు, మహేష్ గారు గొడవ పడ్డారు అని కృపగారు కనుమూరికి చెప్పింది?”
“అబద్ధం”
“లక్ష్మి మీద దర్శన్ చిత్రపాటి దాడి చేయటం?”
అలీ “అబద్ధం”
అలీ “అంతా అబద్ధమే… లక్ష్మిగారి మీద దాడి చేయటానికి మనుషులు పెట్టింది మేమే, ప్లాన్ చేసి కనుమూరి గారు దర్శన్ చిత్రపాటిని కాల్చేలా చేసింది మేమే. ఆ దాడి చేసిన మనుషులు కోసం, కృప డబ్బులు తీస్కుంటుండగా నువ్వు చూసావు”
లక్ష్మి “కనుమూరిని దగ్గర ఉండి కేసులో దారి మళ్ళించాము. కావాలనే దర్శన్ గారి ఇంట్లో సీసా దొరికింది అని ఆయనకు ఇచ్చాము. అప్పటి నుండి ఆయన తనకు తెలీయకుండానే మాకు వశం అయ్యారు. దానిలో భాగంగానే దర్శన్ ని ఆధారాల కోసం కలవటం… ఇదంతా.”
“దర్శన్ చిత్రపాటి మీ మాట ఎందుకు వినాలి?”
లక్ష్మి “మాట వినకపోవటానికి మేము బుజ్జగించలేదు, బెదిరించాము.”
అలీ “దర్శన్ చిత్రపాటిని, తాను చేసింది అంతా పోలీసులకు చెప్పేస్తాము అని బెదిరించి అక్కడికి రప్పించాము. నిజానికి లక్ష్మి గారికి తుపాకి పెట్టింది కృప. ప్రణాళిక ప్రకారం మనలని అడివిలోకి మళ్ళించి, మనం దగ్గరికి వచ్చాక తాను తప్పుకుని, దర్శన్ చిత్రపాటికి తుపాకీ ఇచ్చాడు.”
“అతను కాల్చేసి ఉంటే?”
అలీ నవ్వుతూ “కాల్చటానికి అందులో గుళ్ళు లేవు, కాల్చే విధానము దర్శన్ కు తెలియదు. అతను, మహేష్ చేసిన పొరపాటు, కృప వారి మనిషి అనుకోవటమే.”
“కానీ కృప గారి పరిశోధనశాలలో నాకు దొరికిన, మహేష్ గారు సంతకం చేసిన ఖాళీ దస్తావేజులు మాట ఏంటి?”
“అవి మేమే సేకరించాము, ఒకవేళ మేము అనుకున్న దానిలో పొరపాట్లు జరిగితే, కనుమూరి లాంటి వారికి మరో కథ చెప్పాలి కదా”
“నాటక రచయిత అని చేప్పిన మాట నిజం చేసుకున్నావు కదా. కానీ ఇది అంతా నాకు ఎందుకు చెబుతున్నారు.” అలీ లక్ష్మిగారి వైపు చూసాడు. ఆమె ఏమి మాట్లాడలేదు.
అలీ “లక్ష్మిగారికి నిన్ను మోసం చేయటం ఇష్టం లేదు కాబట్టి.”
అంతలో ఆ అడివి జాతి వారు వచ్చారు. వారి నాయకుడు కారుకి ఎదురుగా నిలబడ్డాడు. లక్ష్మిగారు కారులో నుండి అమ్మవారి విగ్రహం బయటకు తీశారు. ఆ విగ్రహంలో ఉండే తేజస్సు చూసి నాకు తెలీయకుండానే నా చేతులు ప్రణామం చేశాయి. అది తీస్కుని వారు లక్ష్మిగారికి నమస్కరించి వెళ్లిపోయారు.
అలీ “లక్ష్మిగారు, ఇంక నేను కూడా వెళ్లి వస్తాను.”
లక్ష్మి గారు “మేము స్టేషన్ వరకు వస్తాము.”
అలీ నా వైపు చూసి “మీరు మాట్లాడుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. నేను వెళ్తాను. ఏదో ఒక బండి దొరుకుతుంది” అని చెప్పి అలీ నా దగ్గరకు వచ్చాడు.
అలీ “ధర్మం వైపు నిలబడి దారిలో ఒంటరిగా మిగిలిపోయింది ఆమె. అందర్ని కోల్పోయి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి తోడుగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను.”
వారికి సమాధానం “అవును, ఉంటాను” అని చెప్పలేకపోయాను. ఇన్నాళ్లు మిత్రుడుగా భావించిన వారు వెళ్లి పోతుంటే కష్టంగా అనిపించింది. “మీరు వృత్తిలో పెద్ద వారు, నేను నా మిత్రుడు అనుకుని తప్పుగా ప్రవర్తిస్తే క్షమించాలి.”
అలీ “భాయ్, అనుకునేది ఏంటి, నువ్వు నా మిత్రుడివే” అని నన్ను హత్తుకున్నారు. “నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను ఉన్నాను అని మర్చిపోకు.”
అలీ వెళ్తుండగా లక్ష్మిగారు “మమ్మల్ని మర్చిపోకండి”
అలీ వెనక్కి తిరిగి నవ్వుతూ “నా చేత తప్పు చేయించారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను.”
లక్ష్మిగారు “తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు. మీ వృత్తి న్యాయం చేయటం, అదే చేసారు.”
అంతలో ఒక ఎద్దుల బండి వచ్చింది. అది ఎక్కి అలీ వెళ్లిపోయారు.
నేను కారులో నుండి నా సంచి తీస్కుని బయల్దేరాను. లక్ష్మిగారు “లక్ష్మి భూపతిగా నా ధర్మం నేను నిర్వర్తించాను. నేను చేసింది తప్పా?”
మంచో చెడో, తప్పో ఒప్పో నిర్ణయించటానికి నేను దేవుడిని కాదు కదా అనిపించింది. కానీ వెనక్కి తిరగలేదు. సమాధానము చెప్పలేదు. నాకు తోడుగా ఒంటరి తనమే కావాలి అనిపించింది. లక్ష్మి మళ్ళీ నన్ను పిలిస్తే నేను వెళ్ళ లేను, అందుకే ఆమె వైపు చూడకుండా మెల్లగా నడవటం మొదలు పెట్టాను. వెళ్తున్న నాకు వెనుక నుండి గజ్జలు శబ్దం వినిపించింది. పరుగెత్తుకుంటూ లక్ష్మిగారు వచ్చి నన్ను వెనక నుండి హత్తుకున్నారు.
– సమాప్తం –
– భరద్వాజ్ ( Bj writings)