అంతరాత్మ
విసుగనిపించిన ప్రతిసారి
లోలోపల సంచరిస్తుంటాను
జీవితం పొరలన్నీ చిక్కుముళ్ళయ్యాయేమోనని
అనుమానంతో చూస్తుంటాను
కారణంలేని అశాంతి పాములా
చుట్టుకునుంటుంది
కాలం అలిగి ఆగిపోయినట్టుంటుంది
జడలువిప్పుకున్న మర్రిమానులా
వంటరితనం వికటాట్టహాసం చేస్తుంటుంది
తప్పెక్కడుందో తెలీదు
కాల్చేద్దామంటే నిప్పెక్కడుందో తెలీదు
వ్యాధి, మనోవ్యాధి ఏకకాలంలో
ఏలికలై పీడిస్తుంటాయి
చికాకులను సానబెట్టి
అందరికీ దూరమవుతావు
జీవితాన్ని అలా నానబెట్టి
లోలోపల తనిఖీ అధికారిలా
సంచరించినా
సంయమనం లేని నువ్వు
ఏ ముళ్ళను తీయలేవు
చిక్కుముళ్ళను విప్పలేవు
అంతరాత్మ కోడై కూస్తుంటుంది
– సి.యస్.రాంబాబు