యోధ ఎపిసోడ్ 7
ఆ రోజు బుధవారం. చడీ చప్పుడు లేకుండానే పార్ధుకి మెళుకువ వచ్చింది. అలా మెలుకువ వచ్చిన కాసేపటికే, గడియారం గంట తొమ్మిది గంటలు కొట్టింది. అంటే అప్పటికే తెల్లారి దాదాపు ఉదయం తొమ్మిది గంటలవుతుందన్న మాట! పార్ధుకి అంతకుముందు రోజు జరిగిందంతా ఒక్కొక్కటిగా గుర్తుకువస్తున్నాయి.
”నైట్ స్పృహ కోల్పోయి పడిపోయింది కారిడార్ లో కదా, మరి బెడ్ మీదకి ఎలా వచ్చాను..?” అంటూ తనలో తాను అనుకుంటూ… వెంటనే తన బెడ్ పై నుండి లేచి, రూం డోర్ తీసుకుంటూ పరుగు పరుగున ప్రియ రూం కి వెళ్ళాడు. అప్పటికే ప్రియ రూం డోర్ కూడా తెరిచే ఉంది. దాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళిన పార్ధు కి ప్రియ బెడ్ కాళిగా కనిపిస్తుంది. దాంతో
”ప్రియ… ప్రియ…” అంటూ ఆ రూం అంతా వెతుకుతాడు పార్ధు. కానీ, ఉపయోగం ఉండదు.
”అదేంటి..! నిన్న ప్రియని ఇక్కడే గా పడుకోబెట్టింది. ఏమైంది తను ..?” అని తనలో తానే అనుకుంటూ బయటకి రాబోతుంటే, పార్ధు అరుపులకి లేచిన గోపాల్, విశాల్ అప్పటికే కొంచెం కంగారు కంగారుగా ఆ రూం దగ్గరకి వచ్చారు. పార్ధు అంత టెన్షన్ గా ఉండడానికి గల కారణం వారికి ఇట్టే అర్థమైంది. వాళ్లు కూడా ఆ రూం లో ప్రియ… ప్రియ అంటూ వెతకసాగారు.
పార్ధు మాత్రం అవేశ్ రూం వైపు పరుగులు తీశాడు. ఆ రూం లో ఎంత వెతికినా కూడా ప్రియ జాడ కనిపించలేదు. ఈ లోపే మరింత కంగారు పడుతూ కృతి, గౌతమి కూడా తమ తమ రూమ్స్ నుండి గోపాల్, విశాల్ తో పాటు అవేశ్ రూంకి వచ్చారు. అప్పటికే అక్కడున్న పార్ధు మరింత టెన్షన్ పడుతూ ఆ గది నుండి బయటకి వస్తూ బాల్కనీ వైపు పరుగులు తీశాడు.
దాంతో ప్రియ ఆ రూంలో కూడా లేదన్న విషయం మిగిలిన వారందరికీ కూడా అర్ధమయ్యి, పార్ధు తో పాటు బాల్కనీ వైపు పరుగులు తీసారు. అలా బాల్కనీ లో నుండి స్మశానం వైపు చూస్తున్న వాళ్ళకి, పార్ధు ఊహించనట్టే చితి కాలుతున్న దృశ్యం ఒకటి కనిపిస్తుంది.
దాంతో పార్ధు, ”ఓ మై గాడ్…! షిట్..!!” అంటూ తన రెండు కళ్లను మూసుకుని, కుడి చేత్తో తన తలను పట్టుకుంటాడు నిరాశగా. పక్కనేవున్న విశాల్ కి సీన్ అర్ధమయ్యి,
”అంటే ప్రియ కూడా…” అనేలోపు అవునన్నట్టు తలాడిస్తాడు పార్ధు. అప్పటికే చెమర్చిన కళ్ళతో గోపాల్ భయంతో వణికిపోతాడు. గౌతమి, కృతిలకు దుఖం పొంగుకొస్తుంది. ఆ దుఖం ఆపుకోలేని గౌతమి ఉన్నపాటుగ బోరున విలపిస్తూ…
”ప్రియా… ప్రియా..” అంటూ తన చేతిని ఆ కాలుతున్న చితి వైపు చూపుతూ గట్టిగా ఏడుస్తూ మరింత బిగ్గరగా అరుస్తుంది. అది చూస్తున్న మిగిలిన వారి హృదయాలు కూడా కలిచివేస్తున్నాయి. ఒకపక్క ఒక్కొక్కరిగా తమ స్నేహితులను పోగొట్టుకుంటున్నామనే బాధ, మరొక పక్క తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే భయం వారిని ఒక్కొక్కటిగా వెంటాడుతున్నాయి.
ఆ బాధ, భయంతోనే, ”ఇక్కడి నుండి మనం ఎలాగైనా బయట పడాలి. ఛాలెంజ్, పరువు గురించి దేవుడెరుగు, ముందు మన ప్రాణాలు నిలుపుకోవాలి” అంటూ గోపాల్ అంటాడు. ఇంతలోనే లోపలినుండి యేదో
“ట్రింగ్… ట్రింగ్… ట్రింగ్… ” అంటూ టెలిఫోన్ రింగ్ అవుతున్న శబ్ధం వాళ్ళకి వినిపిస్తుంది. ఒక్కసారిగా గౌతమి ఏడుపు మాయమవుతుంది. తనతో పాటు అందరి మొహాల్లో భయంతో కలగలిసిన ఆశ్చర్యం కొట్టోచ్చినట్టు కనిపిస్తుంది.
అలా లోపలి కారిడార్ వైపు వెళ్లారు వారంతా… (అసలు అక్కడికి సిగ్నల్స్ రావడం లేదు కదా! పైగా అక్కడ ఇప్పటివరకూ టెలిఫోన్ అంటూ ఒకటున్నదన్న విషయం కూడా ఎవరికి తెలీదు. మరి ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది. అదే వాళ్ల భయంతో కలగలిసిన ఆశ్చర్యానికి గల కారణం) అలా కారిడార్ లోకి వెళ్ళిన వారు, ఆ శబ్దం కింద ఫ్లోర్ నుండి రావడం గమనించారు, ఆ కారిడార్ కున్న రైలింగ్ నీ ఆనుకుని.
పార్ధు మెల్లగా స్టెప్స్ దిగుతున్నాడు. అది చూస్తున్న గోపాల్… భయంగా ….
”నిన్న నైట్ ఏ కదా.. అక్కడ హాల్లో దే… దే… దెయ్యం..!” అంటుండగా… మధ్యలో విశాల్,
”ష్…” అంటూ తన నోరు మూయించడంతో పాటు, చప్పుడు చేయకుండా తమతో రావాలన్నట్టు సైగ చేస్తాడు. అలా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కరిగా ఆ స్టైర్ కేజ్ కున్న రైలింగ్ ని పట్టుకుని, అటూ ఇటూ బిత్తర చూపులు చూసుకుంటూ మెల్లగా కిందికి దిగుతారు. అలా కిందికి దిగిన పార్ధు మరియు వాళ్ల స్నేహితులు… ఆ టెలిఫోన్ శబ్ధం హాల్లోనే లక్ష్మి, వీరయ్య గది దగ్గరనున్న ఒక మూలన నుండి వస్తుందని గమనించారు.
చూస్తుంటే ఆ టెలిఫోన్ కి ఎలాంటి వైర్ కనెక్షన్ లేదు. పక్క ఎలాంటి స్విచ్ బోర్డ్స్ లేవు. ఒక చిన్న టేబుల్ మీద ఒక కొత్త గుడ్డని కప్పి, చాలా నీట్ గా అప్పుడే కొన్న ఒక కొత్త ఫోన్ లా ఉంది ఆ ఫోన్ చూస్తుంటే. అనుమానాస్పదంగా ఉన్న ఆ ఫోన్ దగ్గరకెళ్ళి, ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, ఇలా అంటాడు పార్ధు..
”హలో.. ఎవరూ..?”
”నేనెవరో మీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పల్ రా?, ఇక్కడి నుండి బయట పడాలన్న ఆలోచన మానుకోమని, మీ ప్రాణాల మీద ఆశ వదులుకోమని” అంటూ గాంభీర్యమైన స్వరంతో పెద్దగా అరుస్తూ పార్దుకీ బదులిచ్చింది ఓ ఆడ స్వరం ఆ ఫోన్ ద్వారా…
అది పార్ధు కి మాత్రమే కాదు, మిగిలిన వారందరికీ వినిపించే అంత గట్టిగా, మరింత పెద్దగా ఉంది ఆ వాయిస్. చూస్తుండగానే, పార్ధు చేతిలోనున్న ఫోన్, ”డబ్” మంటూ పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయి, అది కాస్తా ముక్కలైంది. దాంతో అందరూ భయంతో వణికిపోతూ ఒకచోటకి చేరుకున్నారు. సరిగా అప్పుడే,
”డభేల్.. డభేల్…” మంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పైనున్న వాళ్ల రూం డోర్స్ ఒకటే కొట్టుకుంటున్నాయి. అసలే భయంతో భిక్కు భిక్కు మంటున్న వాళ్లు, ఆ ఘటనతో మరింత బెదిరిపోయారు. పార్ధు కొంచెం ధైర్యం కూడా గట్టుకుని, పైకి పరుగెత్తాడు… పార్థుని అనుసరిస్తూ విశాల్… వాళ్ళని అనుసరిస్తూ గోపాల్… వీళ్ళందరినీ అనుసరిస్తూ కృతి. ఒకరి వెంట మరొకరు వరుసగా పరిగెత్తారు.
అలా పైకి వెళ్ళిన వాళ్ళందరికీ, బయట నుండి ఎప్పటి లాగానే నక్కల అరుపులు, ఆ తీతువు పిట్టల కూతలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఏవేవో వింత వింత శబ్దాలు చేస్తూ కూతలు వినిపిస్తున్నాయి. డోర్ తలుపులు మాత్రం అలానే కొట్టుకుంటున్నాయి. బయట నుండి ఈ సారి కూడా ఎలాంటి గాలి రావడం లేదు అవి అలా కొట్టుకోవడానికి.
ఆ డోర్స్ కి దగ్గరకి క్లోజ్ చేద్దామని అక్కడికి వెళ్ళిన పార్ధు కి, మళ్ళీ ఆ రూంలో అనేకమైన వెరైటీలతో విందు భోజనాలు తినడానికి సిద్దంగా ఉన్నాయి. తన ఒక్కడి రూం లోనే కాదు అలా అందరి రూమ్స్ లో ఉన్నాయి. ఒక్క అవేశ్ మరియు ప్రియ రూమ్స్ లో తప్ప. అలా వాళ్ల రూమ్స్ లో లేకపోవడం వాళ్ళు బ్రతికి లేరని అర్థమేమో మరి!
సరిగ్గా ఒంటిగంట అయినట్టు, గోడ గడియారం గంట కొడుతూ శబ్ధం చేస్తూంది. ఆ గంట శబ్దానికి ఉలిక్కి పడి… బయటకి కారిడార్ లోకి వచ్చి కిందకి చూస్తున్న పార్ధు, గౌతమి పైకి రాకుండా ఇంకా కిందే, అక్కడే ఒక స్తంభానికేసి తీక్షణంగా చూస్తుండడం గమనించాడు. పార్థుతో పాటు మిగిలిన వారు కూడా అది గమనించారు. పార్ధు,
”గౌతమి.. గౌతమి…” అని పిలుస్తున్నా తన(గౌతమి)లో ఏమాత్రం చలనం లేదు. ఆశ్చర్యం, బాధ నిండిన మొహంతో ఇంకా అలాగే ఆ స్తంబానికేసి చూస్తుంది. పార్ధు తో పాటు తక్కిన వారు కూడా గౌతమిని పిలుస్తున్నా తనలో ఏ మాత్రం చలనం లేదు.
తను అలా వింతగా ప్రవర్తించడం చూసి, వాళ్లంతా ఒక్కసారిగా కిందకి రాబోతున్నారు. అప్పటికే, ఆ స్థంభాన్ని చూస్తూ దానివైపు మెల్లగా అడుగులు వేస్తూ సాగింది గౌతమి. అంతలోనే గౌతమి దగ్గరకి చేరుకున్న వారు, తనని పట్టుకుని
”గౌతమి …. గౌతమి ….” అంటూ గధమాయించారు. దాంతో కొంచెం తెరుకున్నట్టు కనిపించిన గౌతమి
”పి… ప్రి… ప్రియ..” అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ, తడబడుతున్న స్వరంతో తన చూపుడు వేలుని ఆ స్థంభం వైపు చూపించింది. అందరూ ఆ స్థంభం వైపు తిరిగారు. కానీ, అక్కడ వాళ్ళెవ్వరికీ ఏం కనిపించలేదు ఆ స్థంభం తప్ప!
”అసలేవరున్నారక్కడ?” అంటూ అడిగాడు గోపాల్ వాళ్ళలా చూస్తుండగానే, వాళ్లందరినీ విడిపించుకుని గౌతమి.. ఆ స్థంభం వద్దకు పరుగు పరుగున వెళ్ళ
”ప్రియ… ప్రియ…” అంటూ మరింత పెద్దగా అరుస్తూ ఆ స్థంభాన్ని గట్టిగా కౌగలించుకుని ఒకటే ఏడవసాగింది. అసలక్కడేం జరుగుతుందో అంతుపట్టని వాళ్ళందరూ షాక్ తిన్నారు. ఆ షాక్ నుండి తేరుకున్న పార్ధు, విశాల్… గౌతమిని వెనకకు లాగసాగారు
”గౌతమి… అక్కడెవరూ లేరు..” అంటూ విశాల్,
”గౌతమి ఏంటిది..? “ఎందుకిలా పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నావ్ ?” అంటూ పార్ధు. తనని అక్కడి నుండి వెనకకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అయినా గౌతమి వినకుండా… ”ప్రియ … మన ప్రియ విశాల్… మన ప్రియ… మన ప్రియ కృతి”
అంటూ ఆ స్థంభాన్ని పట్టుకుని అక్కడే కూలబడి మరింత గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. పార్ధు, విశాల్ కి అక్కడున్న మిగిలిన వాళ్ళు కూడా తోడయ్యి, చివరికి ఎలాగోలా గౌతమిని అక్కడ నుండి లాగి, పైకి తన బెడ్ రూం లోకి తీసుకొచ్చేసారు. అప్పటికే బాగా నీరసపడిపోయిన గౌతమి, స్పృహ కోల్పోయి బెడ్ మీద పడిపోయింది. గౌతమి దగ్గర గోపాల్ని, కృతిని వదిలేసి…
పార్ధు, విశాల్ బెడ్ రూం బయటకి వచ్చి అంతా తడిమి తడిమి చూస్తున్నారు. కిందకు వెళ్లి ఆ స్థంభం దగ్గర ఏమైనా ఒక చిన్న ఆధారమైనా దొరుకుంతుందని ఆశగా అక్కడే వెతకాసాగారు. కానీ, ఒక చిన్న క్లూ కూడా వాళ్ళకి ఏమీ కనిపించలేదు.
”మనేవరికి కనిపించని ప్రియ.., గౌతమికి ఎలా కనిపించింది. అసలు ఇక్కడే తనకెందుకు కనిపించినట్లు…?” అంటూ విశాల్ తనలో ఉన్న సందేహాలను చిన్నగా ప్రశ్నల రూపంలో పార్ధు దగ్గర సంధించాడు.
”అదేం లేదు, జరుగుతున్న పరిణామాలు… అవేశ్, ప్రియ సడెన్గా అలా మాయమవడంతో (చనిపోవడం) తను బాగా మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అయ్యి, డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటుంది. అందుకే, తను లేనివి కూడా ఇంకా మధ్యనే ఉన్నట్టు అలా ఊహించుకుంటుంది.” అంటూ విశాల్ కి సర్ది చెప్పాడు పార్ధు.
ఆదమరుపుగా లక్ష్మి-వీరయ్య గది వైపు తిరిగిన వాళ్ళకి, అంతకముందు అక్కడ టెలిఫోన్ పగిలినట్టు దాఖలాలు ఏవి కనిపించలేదు. చాలా క్లీన్ గా, అసలక్కడ అంతకముందు ఏమీ లేనట్టుగానే ఉంది. దాంతో అక్కడకు వెళ్లి ఆ పరిసరాలంతా నిశితంగా గమనించారు వారు. అక్కడ కూడా వాళ్ళకి నిరాశే ఎదురయ్యింది.
”గౌతమి డిప్రెషన్ లోకి వెళ్ళడం కాదు… మనమే సమస్యల్లో పడ్డాం… ఇక్కడేదో నిజంగానే ఉంది. అది మనల్ని ఎవర్ని విడిచిపెట్టదు. ఇక్కడి నుండి బయట పడకపోతే, మనం కూడా అవేశ్, ప్రియ లాగానే…” అంటూ విశాల్ పార్ధును హెచ్చరించాడు.
దాంతో ఇద్దరూ కలిసి మళ్ళీ అక్కడి నుండి బయట పడే మార్గం కోసం అన్వేషించారు. ఆ ముఖ ద్వారం తెరవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ, వేరే మార్గమేదైనా ఉందేమోనని వెతకని చోటంటూ లేదు. కానీ, అంతా నిరాశే.
ఒక వైపు గౌతమి కి తోడుగా కృతి నీ పెట్టీ, వాళ్ళకి సాయం చేయడానికి గోపాల్ వద్దాం అంటే, అప్పటికే కృతి కూడా జరుగుతున్న వాటికి భయంతో బెంబేలెత్తిపోతుంది. అప్పటికే చీకటి పడుతుంది. ఇక ఇద్దరూ చేసేదేమీ లేక పైకి వచ్చి గౌతమి రూంలోకి వెళ్లి కూర్చున్నారు.. కృతి, గోపాల్ తో కలిసి. వాళ్ల మధ్య మాటా మంతీ లేదు. జరుగుతున్న వాటి గురించి ఎవరికీ వాళ్ళు అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
ఇంతలో గౌతమికి మెళుకువ వచ్చింది. కృతి తనని
”గౌతమి … గౌతమి..” అంటూ పిలుస్తున్నా తను ఏమాత్రం పట్టించుకోకుండా తన బెడ్ పై నుండి లేచి నేరుగా వాష్ రూం వైపు వెళ్తుంది. (ఇంకా తను ఆ షాక్ నుండీ తేరుకున్నట్టు లేదని భావించి, మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు.) కాసేపటికి, వాష్ రూం డోర్ మెల్లగా తెరుచుకుంటున్న శబ్ధం.
అందరి చూపులు ఆ వాష్ రూం వైపు పడ్డాయి. రూం డోర్ తెరుచుకున్నా, లోపలికి వెళ్ళిన గౌతమి ఇంకా రావడం లేదు. గౌతమికి ఏం జరిగిందోననే కంగారుతో కృతి అటువైపు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే, ఈ లోపే మెల్లగా నడుచుకుంటూ బయటకి వచ్చింది గౌతమి…
తన ఇంకా ఆ షాక్ లోనే ఉన్నట్టు నడుచుకుంటూ వస్తుంది. ఈ సారి తను వాళ్ల దగ్గరకి కానీ, తను బెడ్ దగ్గరికి కానీ రావడం లేదు.. తిన్నగా రూం మెయిన్ డోర్ గుండా బయటకి వెళ్తుంది వాల్లేవరినీ పట్టించుకోకుండా… తను ప్రవర్తించడం చూసి విస్తుపోయిన వాళ్ళు…
”గౌతమి… గౌతమి…” అంటూ ఒక్కటే పిలుస్తున్నారు. లేదు లేదు అరుస్తున్నారు. కానీ, తనకవేం వినిపించనట్లు తన దారిలో తాను అలాగే వెళ్తూ ఆ రూం దాటి బయటకి వెళ్లిపోయింది. వాళ్ళందరూ తనని అనుసరిస్తూ బయటకి కదిలారు… గోపాల్… గౌతమినీ పట్టుకుని
”హేయ్… గౌతమి… నీకేమైనా మెంటల్ ఆ? పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావ్.. ఎక్కడికి..? అంటూ గట్టిగా నిలదీస్తుంటే
”నీకెందుకు రా..?” అంటూ తన కళ్ళు పెద్దవి చేసి గోపాల్ వంక చూస్తూ గట్టిగా తన పై అరిచింది… ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. (గోపాల్ తో పాటు మిగిలిన వారు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు)
”నీకెందుకు చెప్పాలి…? నేనేమైనా నీ పెళ్ళాన్నా..?” అంటూ తనని పట్టుకున్న గోపాల్ ని మరింత గట్టిగా విదిలించుకుంటూ గౌతమి ముందుకు సాగిపోతుంది.
గోపాల్ తో పాటు, మిగిలిన వారందరూ తనని భయంతో అలా చూస్తుండిపోయారు. గౌతమి, మెట్లు దిగి కిందికి వెళ్లి, సరిగ్గా అంతకుముందు రోజు వచ్చిన ఆత్మ ఎక్కడైతే కూర్చుందో, అక్కడే చతికిల బడి కూర్చుంది రెండు కాళ్ళు ముడుచుకుని!
వీళ్లంతా తనేం చేస్తుందోనని తనని అలాగే చూస్తున్నారు. ఏవో మంత్రాలు చదువుతుంది. గదంతా చీకటిగా ఉంది. ఆ మంత్రాల శబ్ధం తప్ప వాళ్ళకి ఏం వినిపించడం లేదు. తనకి ఒక చిన్న క్లిష్టమైన పదం ఇస్తే, అది సరిగా పలకడం కూడా చేతకాదు తనకి, అలాంటిది ఏదో మంత్రగాడిలా మంత్రాలు తడుముకోకుండా చదువుతుండడంతో ఆశ్చర్యపోయారు వారంతా… వాళ్ళకి అర్ధమవుతుంది గౌతమి లో ఏదో ఆత్మ ప్రవేశించిందని. ఎంత సేపటికీ తన నుండి ఆ ఆత్మ బయట పడకుండా అలాగే కూర్చుని మంత్రాలు చదువుతుండడంతో…
“హేయ్… ఎవరే నువ్వు..? ఎందుకు తననలా పట్టుకున్నావే..? తనని విడిచిపెట్టు..?” అంటూ గోపాల్ గదమడంతో
”హా.. హాహ్హ…హాహ్హహ్హ… (విరగబడి నవ్వుతూ) అది చెప్పడానికి నువ్వేవడివిరా ..?” అంటూ గభీరమైన స్వరంతో ఒక్కసారిగా తన తలను పైకెత్తి వాళ్ల వంక చూసింది.
ఒక్కసారిగా ఆఫ్ అయిన పవర్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ ఆత్మ, గౌతమి దేహాన్ని విడిచి అక్కడినుండి మాయమైంది. గౌతమి కూలబడింది. వాళ్ళందరూ మెట్ల వెంబడి కిందికి వెళ్లబోయే లోపు, వచ్చిన పవర్ కాస్తా… ఏదో బయట తుఫాను గాలి దాటికి పగిలిపోయినట్టు లైట్స్ అన్ని పెళ్… పెళ్… అని పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పగిలిపోయాయి. మళ్ళీ అంతా అంధకారం అయ్యింది. జరుగుతున్న అనూహ్య పరిణామాలకు, కంగారుకి లోనై ఒకరి వెంబడి ఒకరు ఆ మెట్ల నుండి జారీ కిందపడ్డారు. దాంతో అందరూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు.
అసలు గౌతమి లోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది..?
అంతముందుకు వరకూ కనిపించకుండా, ఆ తర్వాత కనిపించి కనిపించకుండా.. ఆపై కనిపిస్తూ… ఇప్పుడు వాళ్ళల్లోనే కలిసిపోయి మరింత భయ బ్రాంతులకు గురిచేస్తున్న ఆ అత్మల కథేమిటి..?
నెక్ట్స్ టార్గెట్ ఎవరు..?
అందులో నుండి కనీసం ఒకరైనా బయటపడతారా?
తర్వాతి భాగాలలో చూద్దాం ఏం జరగబోతుందో యోధ (ఓ ఆత్మ ఘోష) ఇంకా వుంది. తర్వాతి భాగం ”యోధ (ఓ ఆత్మ ఘోష) -8″ తో మీ ముందుకు వస్తా…
- భరద్వాజ్