యోధ ఎపిసోడ్ 6

యోధ ఎపిసోడ్ 6

రాత్రి ఏడు గంటలవుతున్నా…

ప్రియను తన గదికి తీసుకెళ్లిన గౌతమి, కృతి ఇద్దరూ ప్రియ కోలుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలమైన షాక్ తిన్న ప్రియ మాత్రం దాని నుండి కోలుకోలేకపోయింది. అప్పటికే ఆ ముఖ ద్వారం తెరవడానికి, మరియు ఆ అజ్ఞాత స్వరం కలిగిన వ్యక్తిని పట్టుకోవడంలో విఫలయత్నం చెంది విసిగిపోయిన పార్ధు, గోపాల్, విశాల్ ఓపిక నశించి… వాళ్లు కూడా చేసేదేమీ లేక ప్రియ గదికి వచ్చారు.

ఒక పక్క ప్రియ స్పృహలో లేకపోవడం… మరొక పక్క అవేశ్ ఆచూకీ లభించకపోవడం (దాదాపు తను చనిపోయినట్టు భావిస్తున్నారు అంతా), దానికి తోడు అక్కడ జరుగుతున్న అనూహ్య పరిణామాలు… వాళ్ళందరి మొహాల్లో విచారాన్ని తెలుపకనే తెలుపుతున్నాయి.

గౌతమికి దుఃఖం పొంగుకొస్తుంది. తన దుఖం ఆపుకోలేక ఏడుస్తుంది. తనతో పాటు అప్పటివరకూ ఎంతో కొంత దైర్యంగానున్న కృతి కూడా గౌతమికి జతవుతుంది. వాళ్ళని ఓదార్చే పనిలో ఉంటారు గోపాల్ మరియు విశాల్.

“అసలెందుకు వచ్చామో ఇక్కడికి..? ఇంకా ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాలో..?” అంటూ గౌతమి (ఏడుస్తూ)

“ఇప్పుడు అవేశ్ గురించి వాళ్ల పేరెంట్స్ అడిగితే ఏం చెప్పాలి..?” అని విశాల్

“ఇక్కడనుండి మనల్ని ఎవరూ రక్షించలేరేమో…? ఇప్పుడు మనల్ని కాపాడగలిగేది… ఆ విక్కి ఒక్కడే..!” అంటూ గోపాల్

“అందరి మొబైల్స్ సిగ్నల్స్ కట్ అయ్యి, మనం ఎక్కడున్నామో కూడా ఎవరికి తెలీదు..? ఇక మనం బయటపడలేమేమో..?” అంటూ కృతి (తను కూడా ఏడుస్తూనే)

ఒకరి తర్వాత మరొకరు తమలో ఉన్న అనుమానాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. అవన్నీ వింటున్న పార్ధు మాత్రం అసలు చలనం లేకుండా…

“ఎక్కడో బయట ఉన్నవాళ్ళ గురించి కాదు, ముందు ఇక్కడినుండి బయట పడే మార్గం ఆలోచిద్దాం..?” అంటూ కొంచెం కరుగ్గా వాళ్లకున్న భయాలను, అనుమానాలను తిప్పికొడతూ వాళ్ళకి సమధానమిస్తాడు. దాంతో విస్తుపోయిన గోపాల్ కోపంగా…

“అసలిదంతా నీవల్లే వచ్చింది. ముందూ వెనకా ఏం ఆలోచించకుండా ఛాలెంజ్ చేసేసావ్.. ఇప్పుడు చూడు, ఎంతమంది బలవ్వాల్సివస్తుందో..? అయినా నిన్నని ఏం లాభం … నిన్ను నమ్మి నీతో వచ్చాము చూడు, మాకసలు బుద్ధి లేదు.” అంటూ పార్థుతో వారించాడు. పక్కనే ఉన్న విశాల్ కలుగజేసుకుని,

“ప్చ్.. మనలో మనకి గొడవలెందుకు, పైగా ఇలాంటి సమయాల్లో కలిసికట్టుగా ఉండాల్సింది పోయి మనలో మనం కొట్టుకుంటుంటే సమస్య పరిష్కారం అవుతుందా..? కాసేపు అన్నీ పక్కన పెట్టి, పార్ధు చెప్పినట్టు ముందు బయట పడే మార్గం వెతుకుదాం…” అంటూ వాళ్ళ మధ్యనొచ్చిన ఆ కోప తాపాలను కాస్తా చల్లార్చి వాళ్ళకి సర్ది చెప్తుండగా…

“ఎక్కడికి రా పోయేది…! ఇక్కడికి రావడం వరకే మీ పని..! ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించేది మేము..!! హా.. హాహ్హ…హాహ్హహ్హ…” అంటూ మగ స్వరంతో ఒక భీకరమైన శబ్ధం ఒకటి వాళ్ళకి వినిపిస్తుంది.

దాంతో ఖంగుతిన్న వాళ్లు, ఒక్క ఉదుటున ప్రియ గది నుండి బయటకి వచ్చి చుట్టూ చూస్తారు. సడెన్ గా లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి, ఏదో పవర్ కట్ అయ్యినట్టు. అందరి గది తలుపులు డబ.. డబ.. మని ఒక్కటే గట్టిగా కొట్టుకుంటున్నాయి. పోనీ, గాలి కూడా ఏం వీయడం లేదు, అవి అలా కొట్టుకోవడానికి…

“నన్నేం చెయ్యొద్దు… నన్నేం చెయ్యొద్దు…” అంటూ ఒక లేడీ వాయిస్ తో…

“ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి..! ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి..!!” అంటూ ఒక మగ గొంతుకతో వాళ్ళకి పక్కనే ఉన్న స్మశానం నుండి ఆ శబ్దాలు రెండూ కలగలిసి వింత వింతగా వినిపిస్తున్నాయి. దానికి తోడు నక్కల అరుపులు… ఏదో కీడు జరగబోతున్నట్టు తీతువు పిట్టల అరుపులు.

ఆ శబ్దాలు వస్తున్న వైపుగా బాల్కనీలోకి పరుగులు తీశారు వారంతా … మళ్ళీ ఏదో చితి కాలుతున్న దృశ్యం వాళ్ల కంట పడింది. వాళ్ల గ్రూపులో ఎవరైనా మిస్ అయ్యారా అన్నట్టు అందరినీ పట్టి పట్టి చూసాడు పార్ధు… పార్ధు తో పాటు మిగిలిన అందరూ కూడా… అందులో ప్రియ కనిపించడం లేదు. (వాళ్ళతో పాటు మనకి తెలుసు, ప్రియ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో తనని తన రూం లోనే వదిలేసి వచ్చారు వాళ్లంతా)

ఇంతలో ఆ చితి నుండి ఒక ఆత్మ పైకి లేచి, అది వీళ్లున్న బాల్కనీ వైపుగా వస్తుంది. అది చూసి భయానికి లోనయ్యిన వీళ్లంతా లోపలికి పరుగులు తీసారు. చూస్తున్న కొద్దీ ఆ ఆత్మ వీళ్ళవైపు, అంటే ఆ భవంతిలోకి వస్తుంది. మరింత భీతిల్లిన వాళ్లంతా ఉన్నపాటుగా ఒక మూలకు చేరి అక్కడే భయంతో దాక్కున్నారు. ఆ ఆత్మ మాత్రం అలాగే లోపలకి వచ్చి, పై ఫ్లోర్ నుండి కిందికి దిగుతుంది… 

అక్కడే హల్ మధ్యలో ఏదో దీక్ష చేస్తున్నట్టుగా రెండు కాళ్ళు ముడుచుకుని కూర్చుంది. హాల్ అంతా చీకటే, కానీ ఆ ఆత్మ చుట్టూ మాత్రం ఏదో వెలుగు నిండుకుంది. అయినా పైన తల నుండి ముసుగేసి ఉండడం వల్ల దాని మొహం కనిపించడం లేదు. ఇదంతా పైన కారిడార్ రైలింగ్ కి ఆనుకుని చూస్తున్న పార్ధు మరియు వాళ్ల స్నేహితులందరికీ, జరుగుతున్నది కలో లేక నిజమో అర్థం కావడం లేదు. అందరి చేతులు, కాళ్ళు ఒక్కటే వణుకుతున్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. వాళ్ళందరి మొహాల్లో భయం తార స్థాయికి చేరుకుంది. వాళ్ల అలా చూస్తుండగానే, ఆ ఆత్మ మరింత గట్టిగా నవ్వుతూ…

“నేనెవరో తెలుసుకోవాలని ప్రయత్నించకండి రా..! అది మీ వల్ల కాదు. నన్ను చూడాలనుకుంటే అది మీ మరణానికి ముందే, చెప్పా కదరా..! ఇక్కడకి రావడమే మీ ఇష్టం..! పోవడం చాలా కష్టం” అని గట్టిగా ఆ మగ స్వరంతో అరుస్తూ… మరింత బిగ్గరగా నవ్వుతూ తన పైనున్న ముసుగు తీసేస్తుంది ఆ ఆత్మ. ఇంతలో ఓ పెద్ద పొగ ఆ హల్ తో పాటు పైన అంతా ఆవహించింది. ఆ పొగలో పార్ధు మరియు వాళ్ల స్నేహితులు సొమ్మ సిల్లి పడిపోయారు.

***********

అలా కొంతసేపు గడిసింది.

“టిక్… టిక్… టిక్…” అంటూ గడియారం చేసే చిన్న శబ్దంతో ఉలిక్కి పడి లేచింది ప్రియ తన బెడ్ మీద నుండి. (మధ్యాహ్నమే స్పృహ కోల్పోయిన తను, ఇప్పుడు స్పృహ వచ్చింది అన్న మాట)

అప్పటికే, ఆ రూం అంతా చీకటి అలుముకుంది. తనకి ఏం కనిపించకపోయినా, ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందా అన్నట్టు ఆ గదంతా చూస్తుంది. నిజానికి తన గదిలో గడియారం లేదు. మరి ఆ శబ్దం ఎక్కడినుండి వస్తుందన్నదే తనకి అంతుచిక్కని విషయం. తను అలా చూస్తుండగానే… ఆ శబ్దం ఆగి, గోడ గడియారం చేసే గంట శబ్ధం వినిపిస్తుంది. అంతకుముందు మధ్యాహ్న సమయంలో వినిపించినట్లుగా… చుట్టూ చీకటి ఆవరించి ఉండడంతో, తను ఎటూ కదలలేని పరిస్థితి. జరుగుతున్న సంఘటనలతో, భయంతో బిక్కు బిక్కు మంటూ భీతిల్లుతుంది ప్రియ.

“పార్ధు… గౌతమి… గోపాల్… విశాల్… కృతి … ఎక్కడున్నారు… ప్లీజ్ నాకు భయం వేస్తుంది. ” అంటూ పెద్ద పెద్ద గా అరుస్తూ తన స్నేహితులందరినీ పిలుస్తుంది. కానీ, వాళ్ల నుండి కనీస రెస్పాన్స్ కూడా లేదు.

“హా… హాహ్హ… హాహ్హహ్హ… (పెద్దగా నవ్వుతూ) నువ్వెంత అరిచి ఘీ పెట్టుకున్నా… ఇక్కడికి ఎవరూ రారు..!” అంటూ ఒక మగ స్వరం ప్రియకి వినిపిస్తుంది ఆ చీకట్లోనే, తనకి దాదాపు ఒక ఇరవై అడుగుల దూరం నుండి ఆ స్వరం వినిపిస్తుంది..

“ఎ… ఎ… ఎవరు నువ్వు..!” (భీతిల్లిన స్వరంతో) అంటూ మళ్ళీ 

పార్ధు… గౌతమి… గోపాల్… విశాల్… కృతి … ఎక్కడున్నారంతా ..” అంటూ వాళ్ళని మళ్ళీ పిలవసాగింది.

” హేయ్…! ఎవరూ రారని చెప్పానా..? నిన్ను నా నుండి ఎవరూ రక్షించలేరు..?” అంటూ ఆజ్ఞతా మగ స్వరం ప్రియని మళ్ళీ హెచ్చరించింది.

“అసలేవర్ నువ్వు..! నీకేం కావాలి..? మాతో ఎందుకు ఆడుకుంటున్నవ్..!” భయపడుతూ తనపై ప్రశ్నలను సంధించింది ప్రియ.

“నేనెవరో చెప్పాలా..? నాకేం కావాలో నీకు తెలుసుకోవాలని ఉందా..? మీతొ ఎందుకు ఆడుకుంటున్నానో కారణం చెప్పాలా..?” అన్నింటికీ సమాధానం దొరుకుతుంది బుజ్జి… అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి అంటుండగా… ఒక్కసారిగా తనని అలా పిలవడం చూసి ఖంగుతిన్నది ప్రియ.

“నా పేరు బుజ్జి అని ఎవరు చెప్పారు నీకు..? అసలు నువ్వు ఎవరు..?” అంటూ తిరిగి మళ్ళీ ప్రశ్నించింది ప్రియ. (ప్రియ పైకి గంభీరంగా అలా అన్నా, తనని ఒకప్పుడు వాళ్ల ఇంటి దగ్గర, కాలేజిలో ముద్దుగా పిలిచే పేరదన్న విషయం తనకి కూడా తెలుసు)

“నేనెవరా… నేనెవరా…?” 

అంటూ ఆ అజ్ఞాత స్వరం ఒకటే రంకెలు వేస్తూ ఒక్కసారిగా తనపై తానే వెలుగును ప్రసరింప చేసుకుంది. అంతటి వెలుగును చూసి, ప్రియ కళ్ళు బైర్లుకమ్మాయి. కొంచెం కొంచెం గా తన కళ్ళను తెరుస్తూ… ఆ అజ్ఞాత వ్యక్తిని మళ్ళీ చూస్తుంది ప్రియ. కింద పాదాల దగ్గర నుండి పైకి చూసుకుంటూ వస్తున్న ప్రియ కి

ఆ వ్యక్తి.. నల్లటి ఛాయ కలిగి, కండలు తిరిగిన దేహంతో… వంటి మీద తన రహస్య ప్రదేశాన్ని కప్పే ఒక్క చిన్న డ్రాయర్ తప్ప ఇంకేం లేదు. పైకి వెళ్ళే కొద్దీ తన శరీరం మరింత పుష్టిగా కనిపిస్తుంది. ఓ మల్ల యోధుడిలా అతను ప్రియకి కనిపిస్తున్నాడు… తనని రూపం వైపు, ప్రియ చూపులు అలాగే కదులుతున్నాయి. మాసిన గెడ్డం, విరబూసిన జుట్టు కురులు తన మొహాన్ని కప్పెస్తున్నాయి.

అలా తను చూస్తుండగానే, ఒక్క ఉదుటున ఆ వ్యక్తి ప్రియ పడుకున్న బెడ్ మీద, తన పై అడ్డంగా కూర్చున్నాడు. ప్రియ మొహంలో మొహం పెట్టి,

చూడు…! చూడు…!! అంటూ తన కురులును పక్కకి నెడుతూ తన రూపాన్ని ప్రియకి చూపించాడు. ఆ రూపాన్ని చూస్తూ…

“నువ్వు.. నువ్వూ…” అంటూ ప్రియ అంటుండగా

“హా ఎవరో గుర్తుపట్టావా… నేనే… నేనే… నీ వాసుని” అంటూ మరింత పెద్దగా అరిచాడు ఆ వ్యక్తి.

“ను… ను… నువు…” ఇంకా బ్రతికేవున్నావా..?” అంటూ ప్రియ తడబడుతున్న స్వరంతో ఆ వ్యక్తిని ప్రశ్నించింది.

“హా… (తన కళ్ళు మరింత పెద్దవి చేస్తూ.., తన మొహాన్ని మరికాస్త ప్రియ దగ్గరకి తెస్తూ)

“ఏంటి..? నేనా….?? ఇంకా బ్రతికున్నానా..?” నువు చేసిన మోసానికి ఇంకా నేను బ్రతికున్నానని నువ్వెలా అనుకున్నావే?” అంటూ ఈసారి కోపంగా బదులిస్తాడు ఆ ఆత్మ (వాసు).

“నేనా… నే.. నే… నేనా… నిన్నెం మోసం చేశాను…” అంటూ మళ్ళీ అదే తడబడుతున్న స్వరంతో అడుగుతుంది ప్రియ అతన్ని.

“పద.. పదా… గతాన్ని ఒక్కసారి తవ్విచూద్దాం” అంటూ ప్రియ జుట్టుని ఒక చేత్తో పట్టుకుని, ఇంకో చేతి బ్రోటన వేలితో ప్రియ నుదుటిపై గట్టిగా నొక్కుతూ గంభీరమైన స్వరముతో వాసు ప్రియని గతంలోకి తీసుకెళ్తాడు.

************

అది ప్రియ (బుజ్జి), శ్రీనివాస్ (వాసు) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు. 

పేదింటి నుండి వచ్చిన వాసు చాలా తెలివైన వాడు. చాలా మంచివాడు మరియు చురుకైనవాడు. క్లాస్ అందరిలో తనే టాపర్ కూడా… ఐపీఎస్ అవ్వాల్లన్నది తన లక్ష్యం. అప్పటికే, ఫస్ట్ యియర్ లో మంచి మంచి మార్కులు తెచ్చుకుని, సెకండ్ ఇయర్ లో అంతే మంచి మార్కులు తెచ్చుకోవాలని లక్ష్యంతో ఉన్నాడు. దానికి తోడు ఐపిఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు తనకి దొరికిన కాలి సమయాల్లో… అప్పటికే, ప్రేమ గీమ అంటూ తన వెనుక ఎంతమంది పడ్డా… ఎవర్ని యాక్సెప్ట్ చేయలేదు. సరికదా తను కాదన్న కూడా… వారు పదే పదే వెనుక పడ్డా… వారికి తగిన బుద్ధి చెప్పేవాడు. ఆ కోవలో ప్రియ (బుజ్జి) కూడా ఉంది.

ప్రియ. ఒక ఉన్నత మధ్య తరగతి కుటుంబం నుండే వచ్చింది. తను ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి, వాసు అంటే అమితమైన ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ప్రేమగా మారింది. అలా ఒక రోజు వాసుకి తను ప్రపోజ్ చేస్తే, అందరి లాగానే వాసు, ప్రియ ప్రేమని ఒప్పుకోలేదు. తన ఇంట్లో పరిస్థితుల గురించి, తన లక్ష్యాల గురించి వివరించి చెప్పాడు. అయినా ప్రియ పట్టిందే పట్టుగా తన వెంట పడేది. ప్రియ మహా మొండిది కూడా.

ఇలాంటివి వద్దని వాసు ఎంత చెప్తున్నా, ప్రియకి అర్థమయ్యేది కాదు. తనని ప్రేమ పేరుతో పదే పదే విసిగించేది. తన లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయని, ఇంతటితో ఇవన్నీ పక్కన పెట్టేసి, మనం మంచి స్నేహితుల్లా ఉందామని వాసు తనకెంత నచ్చ చెప్తున్నా ప్రియ వినేది కాదు. అలా ఒకరోజు, తన ప్రేమను ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అప్పటికే, తన ధ్యాసంతా పక్కదారి పట్టి, విస్తుపోయిన వాసు….

“తనని క్లాస్ అందరి ముందూ చెంప చెల్లిమనిపించి, నీ పొగరు, పట్టుదల చదువులో చూపించు, నిన్ను ఇంతటి దాన్ని చేసిన నీ తల్లి తండ్రులకు తల వంపులు తీసుకురాకు. ఇలా పదే.. పదే… నా వెంట పడి నన్ను ఇక విసిగించకు” అంటూ తనని ఇష్టం వచ్చినట్లు తిడతాడు.

అదంతా తనకి క్లాస్ అందరి ముందు జరిగిన అవమానంగా భావించిన ప్రియ, అప్పటివరకూ వాసు మీదున్న ప్రేమను కాస్తా… ద్వేషంగా మార్చుకుంటుంది. ఇదంతా గమనిస్తున్న.. వాళ్ల క్లాస్మేట్ విక్రమ్ కూడా ప్రియకి మద్దతు తెలుపుతాడు. 

విక్రమ్. ఒక గొప్పింటి అబ్బాయి. తను ప్రియని ఎలాగైన లోబార్చుకుందామని, అప్పటికే చాలా కుయుక్తులు పన్నుతాడు. కానీ, మధ్యలో ఈ వాసు అడ్డుగా ఉన్నాడని తెలిసి, సైలెంట్ గా ఉంటాడు. కానీ, ఇప్పుడు వాసుకి ప్రియ దూరమవడం చూసి, విక్రమ్ సీన్లోకి ఎంటర్ అవుతాడు. అప్పటికే, వాసు మీద కోపంతో రగిలిపోతున్న ప్రియకి తను ఒక తోడుగా ఉన్నట్టు నటిస్తూ… తనకి ప్రేమ అనే గేలం వేసి తనని ముగ్గులోకి దింపే ప్రయత్నం చేస్తాడు విక్రమ్.

వాసు చేసిన అవమానానికి కోపంతో, ద్వేషంతో రగిలిపోతున్న ప్రియ, వాసు మీద పగ తీర్చుకునే క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. సరిగా అప్పుడే ఆ ఇయర్, ఫేర్వెల్ పార్టీ వచ్చింది. అప్పటికే ప్రియకి మాయ మాటలు చెప్పి, తను అనుకున్నట్టుగా ప్రియని ప్రేమలోకి దింపుతాడు విక్రమ్…

అలా ఆరోజు నైట్ పార్టీ అంతా అయ్యాక, ప్రియ మరియు విక్రమ్ ఇంటిమేట్ అవుతారు. ప్రియ దానికి కొంచెం నిరాకరించినా… విక్రమ్ బలవంత పెట్టి తన కామ దాహాన్ని తీర్చుకుంటాడు. తప్పు చేసినవాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరు కదా! అదంతా కాలేజ్ లోనున్న సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది. మరునాడు అది కాలేజ్ యాజమాన్యానికి తెలియడంతో కాలేజ్ యాజమాన్యం ప్రియని పిలిచి గట్టిగా మందలిస్తుంది.

విక్రమ్ చాలా తెలివిగా, తను ఎవరో అందులో తెలియకుండా ముఖానికి ఫేస్ మాస్క్ కప్పుకోడం వల్ల ఈజీ గా బయటపడతాడు. కానీ, ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రియ రూపం మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అందులో తనతో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ గట్టిగా నిలదీస్తాడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్. అప్పటికే అందులో ఉన్నది తను కాదని ఎంత భుఖాయించిన వాళ్ళు ఒప్పుకోరు.

“సరే మీ అమ్మ నాన్నలను పిలుద్ధాం వాళ్ళే అన్ని విషయాలు చూసుకుంటారు” అంటూ వాళ్లు మరింత బెదిరిస్తారు ప్రియని. దాంతో ప్రియకి ఏమనాలో తెలియక మౌనంగా ఉండేసరికి,

“నిజం చెప్తావా..? చెప్పవా…? నీతో ఎలా చెల్లించాలో నాకు తెలుసు..!” అంటూ ఆ ప్రిన్సిపాల్ వల్ల తల్లిదండ్రులకి కాల్ చేయబోతుంటాడు. దాంతో టెన్షన్ పడుతున్న ప్రియ…

“అది.. అది… నీళ్ళు నములుతూ “వాసు” అంటూ అబద్ధం చెప్తుంది. 

(విక్రమ్ బాగా డబ్బున్న అబ్బాయి, తన పేరు చెప్తే తన కెరీర్ నాశనం అవ్వడంతో పాటు నన్ను మళ్ళీ దగ్గరకి కూడా రానివ్వడు. ఒకవేళ తన పలుకుబడి ఉపయోగించి, దీన్ని నుండి తప్పించుకున్నా తప్పించుకోగలడు. అప్పుడు నా పై ద్వేషం పెంచుకుంటాడెమో? దాంతో ఏది జరిగినా నా భవిష్యత్ సర్వ నాశనం అయ్యేది. అలా స్వార్థంతో ఆలోచిస్తుంది. దానికి తోడు వాసు మీద పగతో రగిలిపోతూ తను ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఆలోచిస్తున్న స్వార్థపూరితరాలైన ప్రియ అలా వాసు పేరు చెప్పింది.)

దీంతో చెయ్యని తప్పుకి ఇరుక్కున్న వాసుని, తన పేరెంట్స్ నీ పిలిపించి ఆ కాలేజ్ యాజమాన్యం తనని కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తారు. ఒకపక్క తన అలాంటి వాడిని కాదని, ఈ నింద వల్ల తను భవిష్యత్ నాశనం అవుతుందని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. రెండేళ్లుగా వాళ్ళకి తెలుసు వాసు ఎలాంటి వాడో… కానీ, ఆ సమయంలో వాళ్లు ఒక అమ్మాయిగా ప్రియ చెప్పింది నమ్మక తప్పలేదు. దాన్ని తప్పుపట్టడానికి కూడా ఆస్కారం లేదు.

అసలే వాసుది పల్లెటూరు కావడంతో ఆ నోటా..! ఈ నోటా ..! పాకి ఊరంతా వెల్లడైంది. దాంతో వాసు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లినా వాళ్ళకి నిందలు తప్పేవి కాదు. అంత కష్టపడి చదివించిన తమ కొడుకు అలాంటి వాడు, ఇలాంటి వాడంటూ ఊళ్ళో అంతా నిందలు వేయడం, తమను పదే పదే దూషించడం, దూరం పెట్టడంతో సహించలేని వాసు తల్లిదండ్రులు అవమాన భారంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అప్పటికే, చెయ్యని తప్పుకి తన భవిష్యత్ ని కోల్పోయిన వాసు, చివరికి ఆసరాగా ఉండే తల్లిదండ్రులను కూడా కోల్పోవడంతో అనాధగా మరింత కృంగిపోయి తను కూడా ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు.”

ఇది జరిగింది.

*************

గతం నుండి బయటకి వచ్చిన ప్రియతో వాసు..

“ఇప్పుడర్థమైందా నువ్వెంత పెద్ద తప్పు చేసావో..? నువ్వాడిన ఒక అబద్ధం ఖరీదు.. ఐ పి ఎస్ అవ్వలనుకున్న నా లక్ష్యాన్ని తుంచడం పాటు, మూడు నిండు ప్రాణాలను బలితీసుకోవడం. ఇదంతా తెలిసిన నువ్వు, కనీస పశ్చాతాపం లేకుండా ఆ కాలేజ్ నుండి బయటకి ఎక్కడికో సిటీకి వెళ్లి స్థిరపడడం.”

దాంతో ప్రియ… “అవును..! నేను చేసింది తప్పే…! దానికి నాకు తగిన శాస్తి జరిగింది. మీరు చనిపోయాక, విక్రమ్ ని పెళ్లి చేసుకోవాలని అడిగితే, వెళ్లి చనిపోయిన నీ ప్రియుడిని అడుగు..!” అంటూ మొహం చాటేశాడు. “తనని ఎంత బ్రతిమాలినా, మరెంత బెదిరించిన పోయేది నా పరువే అన్నది నాకు తర్వాత అర్థమైంది. అందుకే, ఇక అక్కడ ఉండలేక సిటీ లో అమ్మమ్మగారింటికి వచ్చేశా… అంతే ” అంటూ తన తప్పుని కప్పిబుచ్చుకునే ప్రయత్నం చేయబోతుంటే, దాంతో పగల బడి నవ్వుతున్న వాసు ఆత్మ…

“పోనీ, ఇక్కడికి వచ్చి నువ్వేమైనా పద్ధతిగా ఉన్నావా..? ప్రతి ఆరు నెలలకొకసారి… ఒక్కొక్కరిని మారుస్తూ నువ్వొక వేశ్య లా తయారయ్యావు నీ అవసరాల కోసం. ఆఖరికి ఇక్కడ కూడా అవేశ్ తో… ఛ…! ఛ..!! నిన్ను ఆ వేశ్యలతో పోలిస్తే, వాళ్ళకే సిగ్గు చేటు… అసలు చదువుకుని మంచి ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు మిమల్ని కష్టపడి పంపిస్తుంటే, మీలాంటి కొందరు చేసేవి ఇవా..? మీ వల్ల అమాయకులైన కొందరి ఆడపిల్లలని చదివించడానికే భయపడుతున్నారు వాళ్ల తల్లిదండ్రులు. అసలు మీలాంటి వాళ్ళనీ ఇలా జాలిపడి వదలకూడదే.. “మరణమే..!” మీలాంటోల్లందరికి… ఈ యోగి… యోగేంద్ర విధించే శిక్ష. (అంటూ తన రూపాన్ని వేరొక రూపంలోకి మార్చుకుంరంటాడు వాసు)

షాక్ తిన్న ప్రియ… ఒక పక్క ప్రాణ భయంతో 

“వద్దూ … వద్దూ… నన్నేం చెయ్యొద్దు” అంటూ ఎంత అరిచి మొత్తుకున్నా, మరెంతగా తన నుండి తప్పించుకుందామనుకున్నా తన వల్ల కాలేదు. ఇంతలో ప్రియ నుదుటి పై పెట్టిన తన బ్రోటన వేలిని మెల్లగా కిందికి దించితూ… దాన్ని ప్రియ కంఠం దగ్గరకి తీసుకొచ్చి… పెద్దగా ఉన్న ఆ చేతి గోటితో ప్రియ పీకను అడ్డంగా కోసేస్తాడు వాసు. కాదు.. కాదు… వాసు నుండి రూపం మార్చుకున్న యోగి.

అసలు యోగి ఎవరూ..? 

యోధ ఏమైంది..?

యోగికి, యోధకి సంబంధమేమిటి…?

గతంలో వీళ్ళ వల్ల బలైన వాళ్ళకి, యోగి, యోధ కి సంబంధమేమిటి?

లక్ష్మి, వీరయ్య జాడ దొరుకుతుందా?

వారిలో ఇంకెంతమందిని ఆ అజ్ఞాత ఆత్మ బలితీసుకోబోతుంది?

అసలు వీళ్ళలో ఎంతమంది బయట పడతారు..?

లాంటి వాటికి సమాధానాలు తర్వాతి భాగమైన “యోధ (ఓ ఆత్మ ఘోష) – 7” లో తెలుసుకుందాం.

భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *