వేకప్ కాల్
పున్నమి వెన్నెల సావాసం చేసినట్టు
పురివిప్పింది వేకువ
నిద్ర కన్నుల నీకూ నాకూ
లోకువేమో కానీ
లోకానికది మెళకువ
కువకువలాడే పిట్టలకది పనిగంట మోగినట్టు
వర్షం మంగళస్నానంతో
పరవశించే పచ్చదనం
వికసించిన పూలను
అలంకరణ చేసి
హాయిగా నవ్వుకుంటుంది
చదును చేసినట్లు
రాత్రి జ్ఞాపకాలన్నీ తనలోకి ఇంకిపోతుంటే
మనిషి దురాశను మోయడానికి మళ్లీ సిద్దపడే నేలను
జాలిగా చూస్తున్న భానుమూర్తి
గంట మోగినట్టు
చుర్రుమంటూ చిరుబురులాడుతూ
ఎగబాకుతున్నాడు
స్వార్థం గుర్రాన్నెక్కి ప్రపంచాన్ని స్వారీచేయాలని
కలల కనే కార్పొరేట్ ప్రపంచమింకా నిద్ర కళ్ళు తెరవలేదు
తన్నేం చేస్తారో అని భానుడు కూడా
అప్పుడప్పుడు మాయమవుతుంటే
నిద్ర కన్నుల నువ్వు, నేనూ
మధ్య తరగతి మందహాసమై ఉలిక్కిపడి సిగ్గుపడుతుంటాం చూడు
అదే wake-up call
– సి. యస్. రాంబాబు