స్వేచ్చ
అనంతానంత విశ్వం లో ఎందరో మహానుభావులు వారి అనుభవసారాన్ని గ్రంధాలలో నిక్షిప్తం చేసి, మరి మనకు అందించారు. వారి అంతరంగం లో ఎన్ని ఆలోచనలు ఉండేవో, వారు అంత ముందుగా ఎలా ఆలోచించారో, ఎంతలా ముందుకు వెళ్ళారో కదా అనిపిస్తుంది, అదే టెక్నాలజీ విషయం లో చైనా, సింగపూర్ వారు కనిపెట్టినవన్ని మనవాళ్ళు ముందుగానే కనిపెట్టారు. అందుకు సాక్ష్యమే కరోనా గురించి బ్రహ్మం గారు రాయడం, ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి.
వారి అంతరంగం అలా ఎలా ఆలోచించగలిగింది అంటే కారణం వారిలో స్వార్ధం, అసూయా, అనుమానాలు,ద్వేషాలు లాంటివేవి వారికి కలిగి ఉండక పోవడమే కావచ్చు, అందువల్లే మా ముందు తరాలకు ఇవన్ని తెలియాలి అనే వారు గ్రంధాలలో నిక్షిప్తం చేసారు, అప్పుడు వారి జీవిన విధానం, వారి ఆహార వ్యవహారాలు, మిగిలినవన్నీ వేరేగా ఉన్నాయి, ప్రకృతి మాత ఇచ్చినవి తిన్నారు, తాగారు,సహజంగా పండే వాటిని ఆరగించారు. సొంతంగా పనులు చేసుకున్నారు, కష్టపడ్డారు. పూర్వం నుంచి భవిష్యత్తు వరకు ఆలోచించగలిగారు ,అంటే వారి అంతరంగం అంత స్వచ్చంగా ఉందని అర్ధం.
మరి ఇప్పుడు స్వార్ధం, అసూయా, ద్వేషాలతో,ఆవేశాలతో మిగిలిన మనుషులను, తోటి మనుషులను చంపడానికి శత్రువులుగా తయారు చేస్తూ మరో దేశాన్ని కబళించాలని చూస్తూ, రకరకాలుగా పన్నాగాలు పన్నుతూ చంపడానికి ఆయుధాలను తయారు చేస్తూ, రహస్యంగా పంపుతూ కత్తులు దుస్తున్నారు. మనుషుల్లో స్వార్ధం పెరిగింది, డబ్బుల కోసం హత్యలు చేస్తున్నారు, ఎందరో మహానుభావులు రాజ్యాలు ఏలిన సమయం లో చెప్పిన మాటలన్నీ ఇప్పుడే నిజమవుతూ కలియుగం మునిగిపోతుంది ఇలా అవడం జరుగుతుందని ముందే గ్రహించారు, చెప్పారు, అలా చెప్పినప్పుడు అయినా ఆ మాటలు చిన్నప్పటి నుంచి విన్న వారు అయినా ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి కదా, కానీ అలా జరగడం లేదు.
ఎందుకు మరి ఇలా మనం ,మన పూర్వికులు ఆలోచించినట్టు వేరే దేశాల పూర్వులు ఆలోచించలేదా , అలాంటి ఆలోచనలు రాలేదా, వారు మన పెద్దాళ్ళ లాగా ఆలోచించలేదా , వారికీ పూర్వం నుండి పెగాలు, ప్రతీకారాలు తీర్చుకోవాలనే నేర్పించారా, అసూయా,ద్వేషాలనే నూరి పోశారా, ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్తారు, మనం వెళ్లి వాళ్ళను అడుగుదామా, అడిగితే , అడిగే దాకా చంపకుండా ఆగుతారా, అసలు సమాధానం ఉందా ?
ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు రాస్తున్నాను, [ మీకు జోక్ గుర్తుకు వస్తే మంచిదే} నా అంతరంగం ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసా , నా సిరియల్లు, నాలోపల ఉన్న ఇoకొన్ని ఆలోచనలు ఎలా రాయాలి? సినిమా కథ ఎలా రాయాలి, నా జీవితం ఏమిటి ? నా లక్ష్యం ఏమిటి? నా అక్షర లిపి ని నేనెంత వరకు కాపాడగలను ,ఎప్పటికైనా నా అక్షర లిపి కి గుర్తింపు వస్తుందా? నా జీవితం ఎలా ఉంటుంది ఇవేనా ఆలోచనల అంతరంగం, అవునా ? కాదా ? ఎవరికైనా ఇవే ఆలోచనలు ఉంటాయి.
రేపటికి కూర ఏం చేయాలో అర్ధరాత్రి ఆలోచిస్తుంది అతివ, ఆమె అంతరంగాన్ని మనం ఉహించగలమా ? సమాధానం లేని ప్రశ్నలకు మనమే సమాధానం వెతకాలి, ఎలాగూ దేశాన్ని ఉద్దరిoచలేము,కనీసం మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకుని మనల్ని మనమే ఉద్దరించుకుందాం.
-భవ్యచారు