స్టేటస్ ప్రపంచం
ఆలోచనల అద్దంలో
ఎప్పుడైనా చూసుకున్నామా
స్టేటస్ శిఖరాలు ఎక్కాలని
ఎన్ని ఎత్తులు వేస్తుంటాం
కునుకు రానివ్వకుండా కళ్ళనిండా వినిమయ ప్రపంచం తారట్లాడుతుంది
కపటం రెక్కలపై ఎగిరే విహంగమై
ఆడంబరాల ఆకాశాన్నందుకోవాలని తపిస్తాం
రంగుల ప్రపంచం మాయతెర చాటున
క్రూరత్వం ప్రదర్శనలో పోటీ పడతాం
కూలి పోతున్న బంధాలు
పెరిగిపోతూ వ్యాపార సంబంధాలు
మనిషిప్పుడు కుళ్ళిపోతున్న విలువల కూడలి
వానకి వణికిపోయే చిగురుటాకులా
వడలిపోతున్న మానవత్వానిదో మౌనరోదన
ఆలోచనల అద్దంలో ఎన్ని ముఖాలు
ఎన్ని ముసుగులు
గుసగుసలాడుతుంటాయి
అందుకే ఆలోచనల అద్దంలో చూసుకోవాలనుకోకు
మనసు ప్రవచించే మాటలు
బీడుభూములయిన వ్యక్తిత్వాలపై
తొలకరి చినుకులు కావు
నవ్వు మాస్క్ వేసుకున్నా
నీ ఆనందాన్నెప్పుడో తస్కరించింది
స్టేటస్ ప్రపంచం
– సి. యస్. రాంబాబు