డీకోడింగ్
నిజాలు దాచుకున్నట్టున్న నల్లమబ్బులు
నిశీధి నీడల దుఃఖాశ్రువులను
రాలుస్తుంటాయని
జీవితం వర్తమానం పంపుతోంది
తన మాట వింటున్నానో లేదో అని!
భుజంతాకిన బిందువును
స్పర్శించాను
ఎన్నో జ్ఞాపకాల వలయాలు
విలయాలను గుర్తుచేస్తుంటే
గతం గాయాలన్నీ ఉప్పొంగుతుంటే
గుర్తొచ్చానా అంటూ జీవితం నవ్వింది!
అర్థమయ్యి అవ్వక
జీవితం తికమకపెడుతూ
చలిగాలిలా
ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది
ఆలోచనల నిప్పు రాజేసి
జీవితాన్ని చలిమంట చేసేశాను
తప్పించుకోవటానికి!
ఆకాశంలో పక్షుల గిరికీలు
నేలపై మనుషుల సాముగరిడీలు
ఒకరిది ఆనందం
ఒకరిది ప్రదర్శన
మళ్లీ జీవితమే ఏదో చెప్పాలని ప్రయత్నంలో ఉంది!
అనంతమై ఆలోచనల పరుగులో
నల్లమబ్బై జీవితం నాపై ఒరిగింది
కాలం కడలిలో జారిపోవటమే ప్రకృతి ధర్మమైనవేళ
అధర్మబాటలో నడిచేమి ప్రయోజనం
నన్ను నిష్ప్రయోజకురాలను చేయకంది
తన దుఃఖాశ్రువులను డీకోడ్ చేయగలిగాను!
– సి. యస్.రాంబాబు