సోమరితనం
ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు.
ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుఱ్ఱం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నాడు..
“ఏమైంది నీకు! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు! అన్నాడు.
“మీకేమిటీ! మహారాజులు! మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు! మీరు చక్కగా మహారాజు అయిపోయారు…. నా ఖర్మ ఇలా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు.. చూడండి.. దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు..
మహారాజు చిరునవ్వు నవ్వాడు, “అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు!! చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా!” అన్నాడు.
“నిజం చెప్పారు మాహరాజా!” అన్నాడు బిచ్చగాడు.
“సరే అయితే! నీకు పది వేల వరహాలు ఇస్తాను. నీ అరచేయి కోసి ఇస్తావా! అన్నాడు రాజుగారు.
“భలేవారే ! అర చేయి లేకపోతే ఎలా!” అన్నాడు ఆ బిచ్చగాడు.
“సరే! నీ కుడి కాలు మోకాలి వరకు కోసుకుంటాను… ఒక లక్ష వరహాలు ఇస్తాను.. ఇస్తావా!” అన్నాడు రాజుగారు.
“ఎంత మాట! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో! ఇవ్వను!” అన్నాడు బిచ్చగాడు.
“అన్నింటినీ కాదంటున్నావు……. ఆఖరిగా అడుగుతున్నా…… పది లక్షల వరహాలు ఇస్తాను… నీ నాలుక కోసి ఇస్తావా! అన్నాడు రాజుగారు.
“అమ్మో! మీరు నా జీవితాన్ని ఆడిగేస్తున్నారు. ఇవి లేకపోతే నేను ఎలా జీవించను?? అన్నాడు బిచ్చగాడు.
“ఓహో! అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట!! నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి, లక్ష రూపాయిల కన్నా విలువైన కాళ్ళు, పది లక్షల కన్నా విలువైన నాలుక …… ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా ……??
మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా!! ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో! అందరూ అదే చేస్తున్నారు… ఫో ఇక్కడనుండి! అన్నారు రాజుగారు.
సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు. ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి. మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కస్టపడడానికి సిగ్గు పడితే జీవితం నాశనం అవుతుంది.
సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది… జీవితంలొ గొప్ప వ్యక్తి గా ఎదగడానికి కృషి చేయాలి
– సేకరణ