సర్దుబాటు
ముందు కథలో అమృత విలాస్ ఆహారపు అలవాట్లను చూసి ఇంకా ముందు ముందు తన వాళ్ళ ముందు తను చులకన అవుతానని భావించి అతనితో విడాకులు తీసుకోవాలని అనుకుంది. అయితే పైన చెప్పిన కథలో విడాకులు తీసుకుంది అని చెప్పాను కానీ ఇప్పుడు విడాకులు తీసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈ సర్దుబాటు అనే కథలో తెలుసుకుందాం.
నేను ఒక నాలుగు రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తానండి అంది అమృత. అమ్మో నాలుగు రోజులా మరి నేనేం తినాలి అన్నాడు విలాస్ నాలుగు రోజులకు ఏమి కాదులేండి ఏదైనా హోటల్లో తినేసేయండి. నేను మా అమ్మ వాళ్ళని చూడక చాలా రోజులైంది కాబట్టి ఒక రెండు రోజులు ఉండి వస్తాను అంది అమృత.
సరే నువ్వు ఫిక్స్ అయ్యాక ఇక అనేదేముంది వెళ్లిరా అంటూ బస్ స్టాప్ లో డ్రాప్ చేశాడు విలాస్.. అమృత తన పుట్టింటికి చేరింది. పెళ్లయిన తర్వాత మొదటిసారి కూతురు ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. కానీ అల్లుడు కనిపించకపోవడంతో ఏంటమ్మా అల్లుడుగారు రాలేదా అంటూ ఆరాలు తీశారు.
ఏంటి మీ కూతురు మీకు బరువైందా? అల్లుడు అంటూ అతని గురించి అడుగుతున్నారు కానీ ఏమ్మా నువ్వు ఎలా ఉన్నావ్ అని అడగడం లేదు అంటూ కోపంగా తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది అమృత. తల్లిదండ్రులు ఏదో జరిగి ఉంటుంది ఇద్దరి మధ్య కొత్త సంసారం కాబట్టి ఈ అలకలు మామూలే అని నవ్వుకున్నారు. తర్వాత తనే చెప్తుంది ఏం జరిగిందో అని అనుకుంటూ సరే అమృత ఫ్రెష్ అయ్యి రా నీకు వేడివేడిగా అన్నం వడ్డిస్తాను అంది తల్లి.
ఆ వస్తున్నా అమ్మా అంటూ అప్పటివరకు ఉన్న కోపాన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యి నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అమ్మా ఈరోజు ఏమి స్పెషల్ చేశావు అంటూ అడిగింది. ఏముందమ్మా మీ నాన్నగారికి ఇష్టమైందే వంకాయ కూర, ముద్దపప్పు అంటూ చెప్పింది తల్లి.. అబ్బా ఎప్పుడు ఇవేనా మీకు బోర్ కొట్టదా నాన్న అంటూ అడిగింది తండ్రిని అమృత.
మనకు నచ్చిన ఆహారం ఎంత తిన్నా ఇష్టంగా తింటే ఏది బోర్ కొట్టదురా అన్నారు తండ్రి.. అమ్మ నీకు కూడా రోజూ చేయాలంటే విసుగు రాదా అయినా తనతో పాటు నువ్వు కూడా అవే తినాలి కదా అని నీకోసం అంటూ ప్రత్యేకంగా కూరేమి చేసుకోవు అంటూ ఆరాలు తీసింది అమృత తల్లిని. చూడమ్మా అమృతా పెళ్లయినంతవరకు మన ఇష్టాలు మనసు ఉంటాయి ఒకసారి పెళ్లయిన తర్వాత భర్త ఇష్టాలే మన ఇష్టాలుగా మార్చుకోవాలి. అలా అయితేనే ఆ బంధం గట్టిగా నూరేళ్లు ఉండగలుగుతుంది. ఇప్పుడు మీ నాన్నగారికి ముద్దపప్పు వంకాయ నేను చేయను అన్నాను అనుకో అప్పుడు ఏం జరుగుతుంది నువ్వే చెప్పు అంది తల్లి.
ఏం జరుగుతుంది తనకు నచ్చిన కూర చేయలేదని నాన్నగారు నీ మీద కోప్పడతారు. అంతే కదా అంది సింపుల్గా అమృత. అదేనమ్మా ఆ కోపం కూడా మనం మనపై ఎందుకు చూపించాలి నాకు నచ్చే కదా నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీ నాన్నగారికి నచ్చినవి, నేను చేసి పెట్టే బాధ్యత నాది కాబట్టే చేసి పెడుతున్నాను.
ఇలాంటి చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విడిపోవాలనుకుంటే చాలా సంసారాలు వీధిన పడతాయి కాబట్టి ఆయనకు నచ్చినట్టు నేను చేస్తాను. మీ నాన్నగారు కూడా ఏం తక్కువ కాదు. నాకు ఆమ్లెట్ అంటే ఇష్టం అని నేను తినే సమయంలో ముద్దపప్పు వంకాయతో పాటు ప్రతిరోజ్ప్ప్ ఒక ఆమ్లెట్ వేసి తనే తీసుకొచ్చి ఇస్తారు ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావా అంది తల్లి అమృతతో.
ఏమోనమ్మా నేను ఇన్ని రోజులు కాలేజీలో చదువుకున్నాను కాబట్టి మీరు తినే సమయంలో నేను ఉండలేదు కదా ఎప్పుడూ… రాత్రిళ్ళు కూడా నేను తిన్న తర్వాత మీరు ఇద్దరు తినేవారు కాబట్టి నాకు అంతగా గుర్తులేదు అంది అమృత. మీ నాన్నగారు నాకు ఆమ్లెట్ వేసి చేయడమే కాదు నాకు నచ్చిన హల్వా కూడా చేస్తారు అలాగే వారంలో ఒకరోజు నాకు ఇష్టమైన వంటలు చేయమని అంటారు.
అలా వారంలో ఒకరోజు నాకు ఇష్టమైన వంటలు తనకి ఇష్టమైన వంటలు కాకుండా ఇద్దరం కలిసి చేసుకుని తింటాం. మీ నాన్నగారు వేసిన ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం ఆమ్లెట్ తో మొత్తం అన్నం కూడా తినొచ్చు అంత బాగా చేస్తారు ఆయన అంది తల్లి సిగ్గుపడుతూ….
అవునమ్మా ప్రతిరోజు నాకు వంకాయ ముద్దపప్పు చేసి పెడుతున్న తనకు ఇష్టాలు కూడా ఉంటాయి కదా తన ఇష్టాలను కూడా నేను గౌరవించాలి కాబట్టి వారంలో ఒకరోజు తనకు నచ్చిన వంటలు చేయమని అంటాను తనకి నేను సహాయం చేస్తాను కాబట్టి వారంలో ఒకరోజు ఏదైనా మన ఇంట్లో స్పెషల్ గా ఉంటుంది నువ్వు అప్పుడప్పుడు కాలేజీ నుంచి వచ్చి అడిగే దానివి కదా ఏంటి ఇన్ని స్పెషల్స్ చేశారు ఈరోజు అని అది అలా జరిగిందే అన్నాడు తండ్రి కూడా నవ్వుతూ….
అయితే మీకు ఇద్దరికీ ఎప్పుడు గొడవలు రాలేదన్నమాట అంది అమృత మళ్లీ అనుమానంగా…. లేదమ్మా ఎందుకు గొడవలు మన ఇష్టాలను పంచుకునే వారే మనవారు మనకేం కావాలో తెలిసి మసులుకునే వారినే భార్యాభర్తల బంధం అంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఆ వివాహ బంధానికి విలువ లేదు అన్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి.
ఆలోచనలో పడిన అమృతం చూస్తూ ఏంటమ్మా ఆలోచన తిను ముందు అంటూ అమృతకి ఇష్టమైన దొండకాయ ఫ్రై కంచంలో వేసింది తల్లి. వావ్ నాకిష్టమైన దొండకాయ ఫ్రై నీకు ఇంకా గుర్తుందా అమ్మా అంటూ అడిగింది… పిచ్చిదానా పిల్లల ఇష్టం తెలుసుకోకపోతే ఆమె తల్లి ఎందుకు అవుతుంది అన్నాడు తండ్రి. అలా మాటలతో భోజనాలు ముగిసిన తర్వాత, తండ్రి చాటుగా తల్లిని పిలిచి ఏం జరిగిందో కనుక్కో తను ఎందుకు వచ్చిందో మెల్లిగా మాటల్లో తెలుసుకో అంటూ చెప్పాడు నాకు తెలుసులెండి మీరు అంతగా చెప్పాలా మీరు టాబ్లెట్స్ వేసుకొని పడుకోండి నేను తన రూమ్లో పడుకుంటాను అంది తల్లి.
తలుపులన్నీ వేసి వంటిల్లంతా సర్ది నీళ్లు తీసుకొని అమృత రూమ్ లోకి వచ్చింది తల్లి ఏంటమ్మా ఇంకా నిద్ర పోలేదా అంటూ అడిగింది పుస్తకం చదువుతున్న అమృతతో లేదమ్మా నిద్ర పట్టలేదు రా పడుకుందాం ఇద్దరం అంటూ పిలిచింది తల్లితో, అవును పెళ్లయి ఇన్నాళ్లయింది మీరిద్దరూ బాగున్నారా, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా చెడు అలవాట్లు ఏమీ లేవు కదా అంటూ ఆరాలు తీసింది తల్లి.
లేదమ్మా ఏమి గొడవలు లేవు ఆయన చాలా మంచివారు ఎలాంటి చెడు అలవాటు కూడా లేవు ఇల్లు, ఆఫీసు తప్పితే ఇంకెక్కడికి వెళ్లరు నన్ను షాపింగ్స్ కి సినిమాలకి కూడా తీసుకువెళ్తున్నారు అంటూ మురిపంగా చెప్పింది అమృత తల్లితో. ఓ అయితే బాగానే ఉన్నారు అన్నమాట ఇంతకీ అసలు సంగతి ఏమిటమ్మా అంది తల్లి. అదేంటమ్మా అలా అడుగుతున్నావ్ అసలు సంగతి ఏముంది ఏమీ లేదు అంతా బాగానే ఉంది అని చెప్తున్నా కదా అంది అమృత..
చూడు అమృత నేను నీ తల్లిని నీ మనసులో ఏముందో నేను పసిగట్టగలను అక్కడ ఏదో జరిగింది అందుకే నువ్వు ఒక్కదానివి ఒంటరిగా వచ్చావు లేదంటే ఇద్దరూ జంటగా చిలకా గోరింకల్లాగా నవ్వుతూ వచ్చేవాళ్ళు కదా ఇంతకీ ఏం జరిగిందో చెప్పమ్మా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ఏదైనా పెద్ద సమస్యా? అంటూ అడిగింది తల్లి.
అదీ…. అమ్మా…. అంటూ నసుగుతున్న అమృతతో తల్లి నువ్వు నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావురా ఉన్నదేదో చెప్పు మంచైనా చెడైనా కూర్చొని మాట్లాడుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అంటూ అడిగింది ఇంకాస్త దగ్గరికి వచ్చి తనని దగ్గరికి తీసుకుంటూ. అదేం లేదమ్మా చాలా చిన్న సమస్య అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే అంది అమృత.
అవునా ఏంటమ్మా సమస్య అంటూ అడిగింది. అమ్మ అతను అన్నిట్లో బాగానే ఉన్నాడు కానీ తిండి విషయం ఒక్కదాంట్లోనే నా కాస్త వింతగా, విచిత్రంగా ఉంది అదే నాకు నచ్చడం లేదు అంది అమృత. ఏంటమ్మా ఏం చేస్తున్నారు తిండి విషయంలో నీ వంటలు నచ్చడం లేదన్నారా అంది తల్లి. లేదమ్మా నేను చేసిన ప్రతి వంట లొట్టలు వేసుకొని మరీ తింటారు కానీ కాకపోతే ఏ కూర చేసినా అందులో పెరుగు కలుపుకుని తింటారు. ఆ ఒక్క విషయమే నాకు నచ్చడం లేదు. మామూలు కూరలలో పెరుగు వేసుకొని తినడం ఏంటమ్మా మరి విడ్డూరం కాకపోతే అంది విసుగ్గా అమృత..
ఓ అందుకేనా ఇంతసేపు నాతో నాన్న గారితో చర్చించావు. అసలు అది ఒక పెద్ద విషయమే కాదు కొందరికి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు ఉంటాయి అవి పెద్ద అయినాక కూడా మార్చుకోవడం చాలా కష్టం. మీ నాన్నగారిని చూడు ఆయనకి ప్రతిరోజు ముద్దపప్పు వంకాయ చేస్తా అంటేనే తింటారు లేకపోతే ఆరోజు పస్తులే ఇంక….
ఇది చాలా చిన్న విషయం నీకు నచ్చలేదని చెప్పి చూడు ఏమంటారు? అంది తల్లి సలహా ఇస్తూ, ఇంతలోనే ఫోన్లో మెసేజ్ సౌండ్ వచ్చింది. సేఫ్ గా ఇంటికి చేరుకున్నావా అమృత అంటూ విలాస్ నుంచి మేసేజ్. హా బాగానే ఉన్నాను అంటూ తను కూడా టైప్ చేసింది తల్లి నిద్రకి ఉపక్రమిస్తూ నువ్వు మీ ఆయనతో చాటింగ్ చేసుకో నాకు నిద్ర వస్తుంది అంటూ అటు తిరిగి పడుకుంది..
ఇక చాటింగ్ మొదలైంది. నువ్వు వెళ్లినప్పటి నుంచి నాకేం తోచడం లేదు అమ్ము అంటూ విలాస్ మెసేజ్ పెట్టాడు. అలా చాటింగ్ చేస్తూ అమృతకు తల్లి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది దాంతో నేను మీకు ఒక విషయం చెప్పాలండి అంటూ తను మెసేజ్ పెట్టింది విలాస్ కి. ఏంటమ్మా చెప్పు అంటూ అక్కడి నుంచి రిప్లై రాగానే, మీరు నేను చేస్తున్న వంటలన్నీ ఇష్టంగానే తింటున్నారు కానీ ప్రతిదాంట్లో పెరుగు కలుపుకోవడం అనేది నాకు నచ్చలేదు. మీరు దాన్ని మార్చుకోగలరా అంటూ మెసేజ్ పెట్టి రిప్లై ఏం వస్తుందా అని టెన్షన్ పడసాగింది.
ఓస్ అంతేనా చిన్నప్పుడు మా బామ్మ నాకు పెరుగు అలవాటు చేసింది. అన్నం మొత్తం తిన్న తర్వాత పెరుగుతో తింటే తొందరగా జీర్ణం అవుతుంది అని చెప్పడంతో అప్పటినుంచి నేను పెరుగు అలవాటు చేసుకున్నాను. అది కాస్త అన్ని కూరల్లో కలిపి తినడం అలవాటుగా మారింది. నీకు నచ్చకపోతే నా అలవాటును మార్చుకుంటాను అమ్ము. ఇది అడిగడానికి ఇంకా నా పర్మిషన్ కావాలా నువ్వు ఆర్డర్ వెయ్యి అంతే నేను చేసి చూపిస్తాను ఇకనుంచి నేను కూరల్లో పెరుగు వేసుకోను అంటూ విలాస్ రిప్లై ఇచ్చాడు.
అది చూసిన అమృత మనసు దూదిలా మారిపోయింది. నాకు విలువిస్తూ నా మాటను గౌరవించే వ్యక్తి నాకు భర్తగా లభించడం నా అదృష్టం నా తల్లిదండ్రులు నాకు మంచి భర్తనే సెలెక్ట్ చేశారు అంటూ థాంక్యూ అండి నా మాటను మన్నించినందుకు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటూ మెసేజ్ పెట్టింది.
నువ్వు లేకుండా నాకు ఎలా నిద్ర పడుతుంది అమ్ము, పైగా స్వీట్ డ్రీమ్స్ అంట అంటూ కొంచెం కోపంగా మెసేజ్ పెట్టాడు విలాస్. సరే రేపే వచ్చేస్తాను లేండి అంది అమ్ము… పర్లేదులే ఒక రెండు రోజులు ఉండేరా ఈలోపు నేను పెరుగు మానేయడానికి నా ప్రయత్నం చేస్తాను రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించకు హాయిగా నిద్రపో అన్నాడు విలాస్.
సరే అండి ఇక మీరు కూడా పడుకోండి గుడ్ నైట్ అంటూ మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పెట్టి, తన ఆలోచనలకు తానే నవ్వుకొని విడాకుల వరకు ఎలా ఆలోచించింది ఎంతలా మదనపడింది గుర్తొచ్చి ఒక చిన్న మాటతో సమస్య ఇలా తీరిపోతుందని అనుకొని అమృత సమస్య చాలా తేలికగా తీరిపోవడంతో హాయిగా నిద్రపోయింది.
భార్యాభర్తల బంధం అంటేనే సర్దుబాటు. కొన్ని ఏళ్లు ఒక ఇంట్లో కొన్ని నియమాల ప్రకారంగా నడుచుకున్న అమ్మాయి వేరే ఇంటికి కొత్తగా వెళ్లినప్పుడు అక్కడ కొన్ని విషయాలకు సర్దుకోక తప్పదు. చాలా చిన్న విషయాలనే పెద్దదిగా చేసి రాద్ధాంతాలు చేసి విడాకుల వరకు వెళ్లే వారు అనేక మంది ఉన్నారు. అలా కాకుండా ఇన్ని రోజులు నేనున్న ఇల్లు నాది కాదు పరాయిది ఇప్పుడు ఉంటున్న ఇల్లు నాది కాబట్టి నేను ఇక్కడ సర్దుకోవాలి అన్నిటికీ అని అమ్మాయి గాని అబ్బాయి గాని అనుకుంటే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే వచ్చిన అమ్మాయి ఇస్తారని కూడా అబ్బాయి తరఫు వాళ్లు కూడా గౌరవించి చూస్తే ఆ ఇల్లు స్వర్గసీమే కదా…. ఏమంటారు?
– భవ్య చారు