ప్లాసిబో

ప్లాసిబో

ప్రకృతికి దూరంగా జరుగుతూ కృత్రిమమైన జీవనశైలికి అలవాటుపడిన మానవుడు రకరకాల రోగాల బారిన పడుతూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా విషపూరితమైన రసాయనాలతో కూడినటువంటి ఔషధాలను ఉపయోగిస్తూ వందేళ్ళ జీవితాన్ని క్రమక్రమంగా కుంచింపచేసుకుంటున్నాడు.

పంచభూతాల సమాహారమైన ఈ దేహంలో తలెత్తిన సమస్యలకు వీలైనంతవరకూ ప్రకృతిపరంగానే పరిష్కరించుకోవడం మేలు.. మూడు దశాబ్దాల కిందట జరిగిన ఓ యదార్థ సంఘటన గురించి ఈ సందర్భంగా చెప్పుకోవడం సముచితం.

అమెరికాలోని  ఓహయోలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక మహిళ క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటోంది. ఎన్ని రకాల డ్రగ్స్, అల్ట్రా చికిత్సలు ప్రయోగించినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు చివరి ఘడియలు సమీపించినట్లేనని డాక్టర్లు నిర్ధారించారు.. ఇంతలో డాక్టర్ల బృందంలోని ఓ యువ డాక్టర్ కు ఒక ఐడియా వచ్చింది. దానిని మిగతా డాక్టర్లందరితో చర్చించి అందరి ఆమోదం పొందాక ఆ క్యాన్సర్ పేషెంట్ ని పిలిపించారు.

“అమ్మా.. మీరు అర్థం చేసుకోగలరు అనే నమ్మకంతో ఒక కఠినమైన వాస్తవాన్ని మీకు చెబుతున్నాను. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందులు, ట్రీట్మెంట్ మీకు పని చేయడం లేదు. మీకు జబ్బు తక్కువ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఒక చిన్న ఆశ మాత్రం కనిపిస్తోంది.

క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త మందుకు నిన్ననే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాని ఫలితాలు ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. మీరు గనక ఒప్పుకుంటే ఆ మందును మీ మీద ప్రయోగించాలి అనుకుంటున్నాం. ఎన్ని మందులకు లొంగని మీ జబ్బు ఈ కొత్త మందు వల్ల నయం కావచ్చునేమో చూద్దాం.”

ఆమె ఈ మందును తన మీద ప్రయోగించడానికి ఒప్పుకొంది. క్రమ క్రమంగా ఆమె ఆరోగ్యం పుంజుకొని రెండేళ్లలో క్యాన్సర్ పూర్తిగా నయమయిపోయింది.. ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి హాయిగా రొటీన్ జీవితంలో పడిపోయింది ఆమె. కొంతకాలం తర్వాత తమ దగ్గర బంధువు ఒకాయనకు క్యాన్సర్ సూచనలు కనిపించడంతో గతంలో తాను వాడిన అద్భుత ఔషదాన్ని గురించి ఆయనకి చెప్పింది.

ఆ మందు బిల్లలను తీసుకొని తన వైద్యులు దగ్గరికి వెళ్లిన ఆ వ్యాధిగ్రస్తుడికి డాక్టరు చీవాట్లు పెట్టి పంచదార గుళికలు తీసుకొచ్చి కొత్తగా వచ్చిన క్యాన్సర్ మందు అంటావా అన్నాడు. ఇది విని మొదటి మాజీ క్యాన్సర్ పేషెంట్ ఆశ్చర్యపోయింది. అప్పట్లో తనకు వైద్యం చేసిన ఆ కుర్ర డాక్టర్ ను వెతికిపట్టుకొని తన అనుభవాన్ని వివరించింది.

అప్పుడు ఆ డాక్టర్ “నిజమే అది పంచదార గులిక తప్ప ఎటువంటి మందు బిల్లా కాదు. అది ఒక కొత్త క్యాన్సర్ మందు అనే భావం మీలో నూతన ఉత్సాహం నింపి మీ అంతర్గత శక్తులను చురుగ్గా పని చేయించింది. మీలోని సర్వశక్తులు ఏకతాటి మీద నిలబడటం వల్ల క్యాన్సర్ ను జయించే సత్తా మీ శరీరానికి వచ్చింది. వైద్య పరిభాషలో దీనిని “ప్లాసిబో ఎఫెక్ట్ “అంటారు అని ఆ డాక్టర్ వివరించాడు.

ఒక వ్యాధినీ పూర్తిగా నయం చేసే మందులు అందుబాటులో వచ్చేంతవరకు ప్లాసిబో ఎఫెక్ట్ సరైన వైద్యం అనే అభిప్రాయాన్ని ఈరోజు వైద్యులు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ప్రస్తుత విషయానికి వస్తే శరీరంలో తలెత్తిన అన్ని రకాల అవస్థలకు వీలైనంతవరకూ ప్రకృతిసిద్ధంగా పరిష్కరించుకుంటూ రసాయన పూరితమైన ఔషధాలకు దూరంగా ఉండడం ఉత్తమం…

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *