న్యాయ సమీక్ష
ధర్మదేవత కన్నులు కప్పిన దేశంలో
చట్టాలు చుట్టాలుగా మారిన సమాజంలో
డబ్బుకు అమ్ముడు పోతున్న స్వరాజ్యంలో
స్వార్ధం రాజ్యమేలుతున్న ప్రజాస్వామ్యంలో
కన్నులున్న గ్రుడ్డిది కాదా న్యాయవ్యవస్థ
అనేక ఉదంతాలు కనులముందున్నా కానక
సాక్ష్యాలు తప్పొప్పుల పరిశీలన జరగక
డబ్బుకులోకం దాసోహమన్న క్షణాన
అన్యాయమే విజయం పొంది అట్టహాసం చేస్తుంటే
బక్కచిక్కిన న్యాయానికి మనుగడెక్కడ
నిజమని మొత్తుకున్నా వినలేని ధర్మదేవత
అడ్డదారిలో పయనించే న్యాయవ్యవస్థ
ధర్మమెరుగని స్వార్ధపరత్వములో
అణగారిపోయిన బలహీనుడి మొరవినేదెవరని
కాసులవర్షంలో కనకాభిషేకాలలో
పార్టీల పబ్బుల సుఖాల సహచర్యంలో
స్వర్ధమే రాజ్యమేలుతూ అడుగంటిన మానవత్వంలో
న్యాయమని గొంతు పెగల్చినా కానరాదు కదా..!
నీ ఉనికిని కోల్పోయి మనుగడ సాగిస్తూ…
చూడలేక కనులున్న గుడ్డిదానవై…
వినలేక చెవులున్న చెవిటిదానవై..
అన్యాయం కోరలకి చిక్కి శల్యమైన న్యాయమా…
నీ ఉనికిని కాపాడుకుని జనులని కాపాడేదెపుడమ్మా….
అన్యాయమని అరచినవారి గోడు వినేదేనాడమ్మా…
– ఉమామహేశ్వరి యాళ్ళ