నువ్వు
కష్టాలు ఎవరూ తీర్చరు
అలలై ఎగసిపడుతుంటే
అడ్డుకునే నేర్పు లేకపోతే
తప్పుకునే చొరవుండాలి
మిత్రులను ఎవరూ చూపెట్టరు
మంచి మిత్రుడు ఎన్నడూ కానరాడు
అన్వేషణొక్కటే మార్గం
పున్నమి చంద్రుడు దొరకాలంటే
లక్ష్యాలను ఎవరూ నిర్దేశించరు
నువ్వేమిటో శోధిస్తేనే
లక్ష్యసాధన చేరువవుతుంది
ఓపిక తోడుంటే
కాలం మాయాజాలంలో
కొట్టుకుపోతున్నానని భయపడకు
కాలం వినియోగంలో ఐన్ స్టీన్ వి కా
వికారాల ప్రపంచానికి దూరంగా జరుగుతావు
రేపేమిటన్న సందేహంలోకి జారకు
భయాలను ఫత్వా లా జారీచేస్తుంది
నేడంటే నేరేడు పండు
పుల్లగా వగరుగా ఉన్నా జీవితపు రుచిని ఆస్వాదించడం నేర్పుతుంది
-సి.యస్.రాంబాబు