ఇంకెందాక?
చుట్టూ కమ్ముకున్న
నీడల మాటన వెలుతురే
నోచుకోని విత్తును నేను!
అనంతమంతా విస్తరించాలని
ఆశగా ఉన్నా దుర్భేద్యమైన
ఆధిపత్య కట్టడాల మాటున
ఆత్మ న్యూనతతో
కుంచించుకుపోతూ
మారాకు వేయని మొక్కలా
మగ్గిపోతోంది నా మనోరథం!
అష్టదిక్పాలకుల్లా మొహరించి
ఉన్న కట్టుదిట్టమైన
పర్యవేక్షణలో పంచభూతాలే
నాకు పరమనేస్తాలు!
వసివాడని పసిడి
ఆశలే ఆధరువులు!
కాంక్షగా ప్రశ్నిస్తున్నాయి
నా కళ్ళు కనికరం లేని కాలాన్ని!
గుండె గాయాల సలపరాలను
సహిస్తూ అంతూదరీలేని
పయనం ఇంకెందాక అని?
-మామిడాల శైలజ