డిజిటల్ ధర్మం – కథానిక

డిజిటల్ ధర్మం – కథానిక

“సర్, బిల్లు నూటఏభై రూపాయలయింది కార్డా, క్యాషిస్తారా” కౌంటర్ కుర్రాడడిగాడు.

“ఫోన్ పే చెయ్యొచ్చా” అడిగాను.

మాట్లాడకుండా స్కానర్ ముందుకు తోశాడు. స్కాన్ తిరుగుతోంది. రెండు నిముషాలు దాటిపోయింది. మనీ డిడక్ట్ అవలేదు.

“సార్, నేను రిజెక్ట్ ఆప్షన్ పెట్టాను. ఇక ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్. మీరు క్యాష్ పే చేయండి” నా ఫోన్ నంబర్ ను బిల్ తో జతచేసి చేతిలో పెట్టాడు.

“ఒకవేళ తరవాత మనీ డిడక్టయితేనో” నా అనుమానాన్ని వ్యక్తపరచాను.

“అవ్వదు సార్” తడుముకోని సమాధానం మొహాన్ని తాకింది. అనుమానంగానే ఐదొందలు చేతిలో పెట్టాను. చిల్లరతోపాటు మందుల కవర్ ముందుకు తోశాడు.
ఈ మియాపూర్ లో అంతా మాయే అనుకున్నాను.

ఆ మెడికల్ షాప్ ఒక బ్రాండెడ్ చెయిన్ ది. అందుకేనేమో జనం కూడా గొడవ చేయకుండా క్యూలో నిలబడ్డారు. నేనెక్కువ సేపు టైం తీసుకోవటంతో నెమ్మదిగా రుసరుసలు మొదలయ్యాయి.

అక్కడనుండి బయటపడి ఇంటికి చేరుకున్నానో లేదో ఫోన్ పే ట్రాన్సాక్షన్ సౌండ్ వినిపించింది. అనుమానంగా యాప్ ఓపెన్ చేసి చూశాను. డబ్బులు ఆ చైన్ మెడికల్ షాపుకు బదలాయించబడ్డాయి. అంటే క్యాష్ తో పాటు యుపిఐతో కూడా.. అంటే రెండుసార్లు పేమెంట్ చేశాను.

ఈ సంగతి చెప్పగానే పుత్రరత్నాలిద్దరూ ఎగాదిగా చూశారు. ఒక్క పని సరిగ్గా చేయవుకదా అన్న డీకోడింగ్ ఉంది దాంట్లో.

వాళ్ల చూపుల భారం మోయలేక మళ్లీ ఆ షాపుకు బయల్దేరాను. మళ్లీ దైవదర్శనం టికెట్లలాంటి ఆ క్యూలో నిలబడక తప్పలేదు. నా కథంతా వివరంగా చెప్పకా తప్పలేదు.

వెంటనే POS మెషీన్ లోంచి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అన్న రిసీట్ చేతిలో పెట్టి, తోసిపారేసినట్టు నెక్స్ట్ వీక్ రండి సర్ అనగానే కడుపు మండిపోయినా బాధని కడుపులో దాచి బయటకొచ్చాను.

కోపాన్ని పిల్లలముందు విసిరికొట్టాను. “కూల్ నాన్నగారు” అంటూ నా ఆవేశాన్ని కూలగొట్టి వాళ్ల గొడవలో పడిపోయారు. జానకీ కత్తెక్కడ అని రెబల్ స్టార్ లా లేచాను కానీ మా ఆవిడ చురకత్తి చూపులకు బలవటం ఇష్టం లేక బల్లిలా కుర్చీకతుక్కుపోయాను.

డిజిటల్ ట్రాన్సాక్షన్ లో డబ్బులు పోగొట్టుకున్న బాధ వెంటాడుతుంటే ఆ మెడికల్ చెయిన్ కస్టమర్ కేర్ మెయిల్ కష్టపడి సంపాదించి వివరంగా రాశాను, ఎలా ఒకే బిల్లు కు రెండుసార్లు డబ్బులు చెల్లించానో.

రెండు రోజులకి థాంక్స్ రిప్లై మెయిల్(అందులో పదే పదే కస్టమర్ లు తమకెందుకు ముఖ్యమో నొక్కి వక్కాణిస్తూ) మరో రెండురోజులకు ఫోనూ వచ్చాయి.

ఆ ఫోన్ లో కూడా అసలు విషయానికి రాకుండాపదే పదే ధన్యవాదాలు అంటూ ఊదరగొట్టడంలోనే పది నిముషాలు గడిచిపోగా భయపడి “నా సమస్య చూడండి.నన్ను ధన్యుడను చేయండి” అంటూ నాటకీయంగా బతిమాలగా వరాలిచ్చే దేవుడిలా సంతోషించిన సదరు ఎక్సిక్యూటివ్ “ఒక్కమాట సర్” అని ఆగాడు.

“మీ మనీ ఎక్కడికీ పోదు సర్. మీ కంప్లైంట్ త్వరలోనే కంప్లీట్ చేస్తాము. ఆ ఒక్క మనిషి పొద్దున్నించీ రాత్రి దాకా కస్టమర్ లకు అటెండ్ అవుతాడు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అతను విసుగ్గా మాట్లాడ్డం వెనక బోల్డంత అలసట ఉంటుంది. మీలాంటి పెద్దలు (చూస్తున్నట్టు ఎలా చెప్పాడో నాకర్థం కాలేదు మరి) కాస్త ఓపికతో ఎక్సక్యూజ్ చేయాలి.”

విషయం ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కాక జుట్టు పీక్కుందామనుకుంటే ఉన్న నాలుగూ ఊడిపోతాయోమోనని భయమేసి ఆగిపోయాను.

“ఇంతకీ రిఫండ్ ఇస్తారా లేదా”

“అయ్యో ఎంతమాట.మీ మనీ మీకు ట్రాన్ఫర్ చేస్తాం .ఇకనుంచి మీరు మా ప్రివిలెజ్డ్ కస్టమర్.కాల్ చేసినందుకు ధన్యవాదములు.” ఫోన్ కట్టయ్యింది. ఉన్న కాస్త ఆశ ఊపిరి వదిలింది అర్థమయిపోయింది.

డిజిటల్ వరల్డ్ లో మాటను నమ్ముకోవడం కన్నా మాటనమ్ముకోవటమే ఎక్కువై పోయిందని.ఇది డిజిటల్ యుగధర్మమని..ఇలా డిజిటల్ ధర్మాలూ ఉంటాయని..

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *