భయం
అనిశ్చితి గంటలా
ఆకాశ యానం
అప్పుడప్పుడు భయపెడుతుంటుంది
శూన్యంలో బరువును
కోల్పోయి భారరహితమైనట్టు
ఆలోచనల సంద్రం ఎగసిపడటం
ఆపేస్తుంది
జ్ఞాపకాలను ఆరబెడతాము
సంక్షోభ సందేహల స్నానంతో
మనసు ఊగిసలాడటం
ఆపేస్తుంది
ఎడతెగక సాగే ఎగిరే మబ్బులు
ఏ అర్థాలు బోధిస్తాయో కానీ
జీవితం చిన్నదని గాలిలో తేలే
లోహవిహంగం నేర్పుతుంది
వైరాగ్య క్షణాల ఉక్కిరిబిక్కిరి మధ్య
లాండింగ్ అనౌన్స్మెంట్
లాగి చెంపమీదొకటిచ్చినట్టు
నిన్ను లోకంలో పడేస్తుంది
రింగయ్యే ఫోన్
సమస్యల వాకిలిని తెరుస్తుంది
మెరుపులు మరకలు మళ్లీ తొలకరి వానలా పలకరిస్తుంటే దేహం
పులకరిస్తుంది
– సి. యస్.రాంబాబు