ఆడవారు ఆలిగితే
ఒక్క పని కూడా సరిగ్గా చేయవు అలా చేసినట్టు బిల్డప్పులు ఇస్తావు కూరలో ఉప్పు ఉండదు కారం ఉండదు. ఇంట్లోనే ఉంటావు కదా చేయొచ్చు కదా అన్ని సరిగ్గా…. ఏం చేస్తావో పొద్దంతా అన్నాడు రవి సంజన తో ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు పొద్దంతా ఏం చేస్తానా? ఒక్కరోజు ఉప్పు కారం సరిగా లేకపోతే ఇన్ని మాటలు అంటారా నన్ను రోజంతా ఏం చేస్తాను మీరు చేసి చూడండి. మీకు అర్థం అవుతుంది అంది సంజన కోపంగా.
అబ్బో పెద్ద చెప్పొచ్చావు మహా అయితే అన్నం, కూర ఉడికిస్తే చాలు అర్ధగంటలో అయ్యే పని రోజంతా చేస్తూనే ఉంటారా ఏంటి అర్థగంటలో అన్నం కూడా చేసి పక్కన పడేసి టీవీ చూస్తూ కూర్చుంటారు అంతే తప్ప మీకు ఇంకేం చేతకాదు అన్నాడు రవి అంతే వెటకారంగా. ఆహా అవునా సరే మంచిది రేపటి నుంచి మీరే చేసుకోండి ఇక నావల్ల కాదు నేను అలిగాను అంటూ మూతి తిప్పి అటు తిరిగి పడుకుంది సంజన. ఆ బోడి వంట చేసుకుంటాం మాకేం చేతకాదా అంటూ రవి కూడా ఇటు తిరిగి పడుకున్నాడు.
వారికి పెళ్లి అయ్య సంవత్సరంనర అవుతుంది. మొదట్లో చాలా బాగానే చూసుకున్నాడు రవి సంజనను కాస్త మోజు తీరగానే లోపాలన్నీ బయటపడడం మొదలయ్యాయి. కూర బాలేదని అన్నం సరిగా వండలేదని రవి వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. దాని పర్యవసానమే తెల్లవారి ఏడవుతున్నా సంజన ఇంకా పడకమించి లేవలేదు.
ఆరు గంటలకే కాఫీతో నిద్ర లేపేసి సంజనా ఇంకా లేవకపోతే కళ్ళు తెరిచిన రవికి రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చి ఓహో అలక మొదలు పెట్టావా అయితే సరే దాందేముంది నేను చేసుకోలేనా ఆ మాత్రం టీ అంటూ గబగబా వంటింట్లోకి వెళ్లి ఫ్రిజ్ లోంచి పాల గిన్నె తీసి పొయ్యి మీద పెట్టాడు. పాలు ఎంత సేపు అవుతున్నా పొంగకపోవడంతో ఏంటి పాలు పొంగట్లేదు అంటూ చూసేసరికి అది పాలు కాదు ఇడ్లీ పిండి.
కొంచెం మాడు వాసన కూడా రావడంతో చటుక్కున దించేసి, చేతులు ఉఫ్ అంటూ ఊప్పుకొంటూ ఇది దోశ పిండి అయితే మరి పాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటూ ఫ్రిజ్ అంతా వెతికాడు ప్యాకెట్ లో కనిపించాయి కానీ గిన్నెలో కనిపించలేదు. అబ్బా ఇప్పుడు మళ్లీ వీటిని వేడి చేయాలా అని అనుకుంటూ సమయం చూసేసరికి 8 అయింది అమ్మో ఎనిమిది అవుతుంది ఆఫీస్ కి వెళ్ళాలి అనుకున్నాడు.
కానీ కనీసం కాఫీ తాగకుండా టిఫిన్ చేయకుండా లంచ్ బాక్స్ లేకుండా ఆఫీస్ కి ఎలా వెళ్లాలి అని అనుకుంటూ పోనీ ఒక్కరోజు సెలవు పెట్టేద్దాం అనుకుంటూ ఫోన్ తీసి తన సహ ఉద్యోగికి నేను ఈరోజు రావడం లేదు కాస్త జ్వరంగా ఉంది అంటూ చెప్పాడు బాస్ కు చెప్పమని మెసేజ్ చేసాడు. అతను సరే అన్నాడు దాంతో ఫోన్ పెట్టేసి, పాల గిన్నె ఎక్కడ ఉందా అని చూసుకొని పాలు కాగ పెట్టడం మొదలుపెట్టాడు.
కానీ పాలన్నీ విరిగిపోయాయి అతను పెట్టిన గిన్నె చారు చేసేది ఆ విషయం తెలియక పాలు పోయడంతో పాలు విరిగిపోయాయి. ఆ పోయేదేముంది ఈ ఒక్క రాజుకు బ్లాక్ టీ తాగుదాం అనుకుంటూ కొన్ని నీళ్లు వేరే గిన్నెలో పోసి కొంచెం చక్కరి, చాపత్తా వేసి డికాషన్ చేసుకొని తాగాడు. అప్పటికి ఇంకా సంజన లేవనే లేదు. అది చూసి గబగబా సింక్లో ఉన్న అంట్లు తోమడం మొదలుపెట్టాడు.
అర్ధ గంట అయినా కూడా ఇంకా మిగిలి ఉన్న పాత్రలో చూసి ఉఫ్ అంటూ గట్టిగా నిద్ర విడిచి సరిగ్గా గంట నరలో గిన్నెలన్నీ కడగడం పూర్తిచేసాడు. ఆ లోపు సమయం 9 కడుపులో ఎలుకల గోకుతున్నాయి టిఫిన్ లేకపోవడంతో, ఇడ్లీ పిండిని పాత్రలో వేద్దామని చూసేసరికి అది గట్టిగా అయిపోయింది ముందే స్టవ్ మీద పెట్టాడు కాబట్టి ఇక ఏం చేయాలో తెలియక ఉప్మా చేద్దాం అనుకోని రవ్వ కోసం వెతికాడు రవ్వ తొందరగానే దొరికింది ఎందుకంటే డబ్బా మీద ఉప్మా రవ్వ అని ఉంది కాబట్టి.
ఉల్లిపాయలు కట్ చేయడంతో కలలోంచి నీళ్లు ముక్కులోంచి రావడం అలాగే పచ్చిమిర్చి కోసి కళ్ళలో పెట్టుకోవడంతో కళ్ళు ముక్కు రెండూ మంటలు పుట్టాయి అయినా పట్టుదలగా ఉప్మా చేయాలని ఉద్దేశంతో చేతులు కడుక్కొని వచ్చాడు కానీ ముందే పచ్చిమిర్చి కోసిన చేతులవడంతో మొహం అంతా మంటలు పుట్టాయి ఆ బాధ భరిస్తూనే గిన్నె పెట్టి నూనె వేశాడు.
పోపు గింజల కోసం వెతుక్కునే లోపు నూనె బాగా కాగిపోయింది దాంతో పోపు గింజలు వేయగానే మంట చటుక్కున వచ్చి చేయి మొత్తం మండిపోయింది. అమ్మో మంట అనుకుంటూ చేతిని నల్ల కింద పెట్టాడు. చేయి కాస్త చల్లబడగానే స్టవ్ చిన్నగా చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి, వేయించి అందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోసాడు. ఆ తర్వాత చారెడు ఉప్పు వేశాడు నాలుగు గ్లాసులు కాబట్టి సరిపోతుంది అనుకున్నాడు.
నీళ్లు మరుగుతున్నప్పుడు డబ్బాలోని రవ్వంతా ఆ ఎసేట్లో పోసాడు. ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు అలా నిలబడ్డాడు ఇంతలో ఏదో మాడుతున్న వాసన వచ్చింది అనుకుంటూ చూసేసరికి ఉప్మా గిన్నెలో వాసన మూత తీసి వాసన చూసేసరికి అది కాస్త మాడిపోతుంది. వెంటనే కిందకి దించి హమ్మయ్య మొత్తానికి సాధించాను అనుకున్నాడు. సరే ఇక తిందామనుకొని ప్లేట్ తెచ్చుకొని ఉప్మా గిన్నెలో గరిట పెట్టాడు బాగానే వచ్చింది అనుకుంటూ వేసుకున్నాడు.
సగం ఉడికి సగం ఉడకకుండా ఉన్న అదే ఉప్మాని ఎలాగోలా తిన్నాడు ఇంతలో స్నేహితుడు ఫోన్ చేశాడు ఏంట్రా ఆఫీస్ కి రాలేదు సిట్టింగేసావా ఏంటి అంటూ లేదురా కాస్త ఒంట్లో బాగాలేదు అనగానే అయితే సరే నేనూ ఈరోజు వెళ్లలేదు రారా సిట్టింగ్ వేద్దాం చాలా రోజులైంది అంటూ పిలిచాడు. ఒక క్షణం ఆలోచించాడు రవి.
అయితే తనే లేచి అన్ని పనులు చేస్తుంది అని అనుకుంటూ ఉప్మా గిన్నెని అక్కడే వదిలేసి ఇదిగో నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా తనకి ఒంట్లో బాలేదు అట చూసి వస్తాను అక్కడే తింటాను కూడా నువ్వు అడిగి పడుకుంటే నీకే కడుపు మాడుతుంది లేచి పనులు చేసుకో అంటూ గబా గబా డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
అతను అలా వెళ్ళగానే సంజన లేచి తన పనులన్నీ పూర్తి చేసుకొని స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తిని మళ్లీ ఎప్పట్లా పడుకుంది.
*********
రాత్రి 8:00 కాగానే రవి ఇంటికి చేరాడు కాస్త మందు పుచ్చుకున్నాడు కానీ స్టిఫ్ గానే ఉండడంతో సంజన లేచి వంట చేసి ఉంటుందని ఏమీ తినకుండానే ఇంటికి వచ్చాడు కానీ వంట చేసిన దాఖలాలు ఏమి కనిపించక వంటింట్లో తను వదిలేసిన ఉప్మా గిన్నె అలాగే ఉండడం చూసి బిత్తరపోయి ఆడదానికే అంతుంటే మగాడికి నాకెంత ఉండాలి అనుకుంటూ, తను కూడా సిగ్గిలో ఆర్డర్ పెట్టుకున్నాడు.
ఆర్డర్ రాగానే తిని పడుకున్నాడు. మళ్లీ ఎప్పటిలాగే తెల్లారింది కానీ సంజన మాత్రం తన అలకమానలేదు రవి ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటాడు తను తన ఆఫీసుకు వెళ్లిపోయాడు. శనివారం ఒక్కరోజు వెళ్లడంతో తెల్లారి ఆదివారమే కాబట్టి మెల్లిగా లేచి పనులన్నీ చేద్ధాం అనుకున్నాడు.
ఆదివారం పొద్దున్నే లేచి వంట రూమ్ లోకి వెళ్లి గిన్నెలన్నీ కడిగాడు ఉప్మా పాచిపోయింది వాసన భరించలేక దాన్ని పారేసి గిన్నెలన్నీ కడిగి స్టవ్ కూడా కడిగేసి కాస్త కాఫీ పెట్టుకునేసరికి టైం పది అయింది. కాఫీ కే పది గంటలు అయితే ఇంకా టిఫిన్ ఎప్పుడు చేయాలి అనుకుంటూ ఆదివారమే కదా డైరెక్ట్ గా లంచ్ చేద్దాం అని ఫ్రిజ్లో ఉన్న కూరగాయలు తీశాడు.
ఈ లోపు సంజన లేచింది మొహం కడుక్కొని వచ్చి తను కాఫీ చేసుకొని తాగి ఆ గిన్నెలు కడిగి పక్కన పెట్టి వెళ్లిపోయి మళ్లీ పడుకుంది. అబ్బో రాణి గారు అనుకుంటూ మనసులో కూరగాయలు తరగడం మొదలుపెట్టాడు. బెండకాయలన్నీ తిరిగి గిన్నెలో నీళ్లలో వేశాడు. పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అన్ని తరుక్కున్నాడు. ఎలాగోలా కూర అయితే చేశాడు అన్నం కుక్కర్ లోనే కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పోసి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి పెట్టుకున్నాడు.
టమాటా బెండకాయ కూర జిగురులా మెత్తగా అయ్యింది దానికి తోడు అన్నం కూడా ముద్దలాగా మారిపోయింది. గత మూడు రోజులుగా ఉతకకుండా ఉన్న బట్టలు గుర్తొచ్చాయి. వాషింగ్ మిషన్ లేకపోవడంతో ఆ బట్టలన్నీ తీసి ఒక్కొక్కటి ఉతికేసరికి సమయం రెండు అయింది. ఈలోపు కడుపులో పడ్డ కాఫీ కరిగిపోయి ఎలుకలు పరిగెత్తడం మొదలయ్యాయి.
దాంతో ఇక తప్పక తనే వండుకున్న వెంటనే ఎలాగోలా నీళ్లు పోసుకుని మింగడం మొదలుపెట్టాడు కానీ ఓ రుచిపచి లేని కూర కాబట్టి రెండు ముద్దుల కన్నా ఎక్కువ తినలేకపోయాడు. ఆ కంచం పక్కన పడేసి కూర అన్నం కూడా పారేసేసరికి ఇల్లు ఊడవడం సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. వెంటనే చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చి తుడిచాడు సమయం నాలుగు.
మామూలుగా ఆఫీస్ లో అయితే నాలుగు గంటలకి టీ వస్తుంది. ఆ అలవాటుగా టీ పెట్టుకోవాలని అనుకునేసరికి పాలు కనిపించలేదు తను ప్యాకెట్ పాలలో కాఫీ కలుపుకొని తాగాలా అని బిత్తర పోయాడు. ఇక రాత్రికి వంట చేయాలనుకునేసరికి పొద్దున విషయం అంతా గుర్తుకొచ్చి తన వెంట మీద తన బ్రతుకు మీద చిరాకేసి డాబా పైకి వెళ్లి ఆలోచిస్తూ కూర్చున్నాడు. సంజన కేవలం కాఫీ ఒకటే తాగి ఎలా ఉంది తనకు ఆకలి కావడం లేదా కనీసం లేచిన గుర్తులు కూడా లేవు.
ఆడవాళ్లు అలిగితే ఇలా ఉంటుందా అయినా పనిచేయడం కష్టమే అని ఈ రెండు రోజుల్లో తెలిసిపోయింది అనవసరంగా సంజనతో గొడవ పెట్టుకున్నా అంటూ ఆలోచనలో ఉన్న తనకి ఫోన్ రింగ్ అవ్వటంతో బయటకు వచ్చి ఫోన్ ఆన్ చేశాడు. రేయ్ రవి నేను రా చంద్రాన్ని మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది తనని తీసుకురావడానికి వెళ్తున్న రేపు ఆఫీసులో నా వంతు పనిని కూడా నువ్వే చేసి పెట్టు అన్నాడు.
రేయ్ నేనా నా పని చేయడమే గగనం అంటే ఇంక నీ పని కూడా చేసి పెట్టాలా ఓవైపు ఇంట్లో పని అంటూ నాలుక కొరుక్కున్నాడు రవి. ఏంట్రా ఏమంటున్నావ్? ఇంట్లో పనా ఏంటి మీ ఆవిడ కూడా అలిగిందా, అంటూ ఆరాలు తీసేసరికి చెప్పక తప్పలేదు రవికి. అంతా విన్న చంద్రం ఒరేయ్ రవి ముందు ఆవిడ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడు.
అలక మానేసి ముందు నీ కడుపు నింపమని బతిమిలాడుకో అంతే తప్ప వాళ్ళు అలిగితే బరించలేము గత వారం రోజుల క్రితం మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది పనులు చేసుకోలేక చచ్చాననుకో… అయినా ఆడవాళ్ళకి ఎంతో ఓపిక రా అన్నీ ఎంతో సహనంతో చేస్తారు అది మనం చూడక ఏదో ఆఫీసు ఒత్తిడిలో ఉండి వాళ్ళని కసిరించుకుంటాం అయినా అన్ని భరిస్తూ ఆఫీస్ నుంచి వచ్చేసరికి నవ్వుతూ ఎదురొస్తారు వాళ్ళు అలిగితే మాత్రం ప్రపంచం ఆగిపోతుంది రా బాబు…
నువ్వు నేను చేసినట్టే చెయ్ నేను ఇప్పుడు మా ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాను తనని కాళ్లు పట్టుకొని అయినా తెచ్చుకుంటాను నువ్వు కూడా నీ భార్య ను బ్రతిలాడు. కృష్ణుడు అంతటి వారికే తప్పలేదు రా ఇక మనమెంత అయినా ఈ రెండు రోజులు నువ్వు కూడా అవస్థలు పడ్డావు కదా, ఇకనైనా మగాడిని అనే బెట్టు మాని మీ ఆవిడను అలకమానిపించు లేదంటే మనకు కడుపులు మాడాల్సిందే జేబులు ఖాళీ అవ్వాల్సిందే అంటూ హితబోధ చేయడంతో చంద్రం మాటలకు కళ్ళు తెరుచుకున్నాడు అవి సంజనను బ్రతిమాలడానికి గబా గబా మేడ దిగి వెళ్ళాడు. ఆడవాళ్లు ఎంతో ఓపికతో సహనంతో ఇంటిని పిల్లలని భర్తని చూసుకుంటారు అలాంటి వారిని ఏ కాస్త చులకన చేసినా భరించలేరు కాబట్టి మగవాళ్ళు జాగ్రత్త….!
– భవ్య చారు