విజ్ఞానం -వివేకం
“ఏ పుస్తకం నీ జీవితంలో ఏ సమయంలో నీ ప్రపంచాన్ని కుదిపివేసి నువ్వు అంతకుముందెన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో నీకు ఎన్నటికీ తెలియదు..”అన్నారు వర్క్ హెడ్జెస్.
పుస్తకం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనము చదివిన అందులోని ఒకే ఒక వాక్యం మన జీవితాన్ని మార్చగలదు. అక్షరానికి ఉన్న శక్తి అవధులు లేనిది. అనంతమైనది.
అది ఒక్కోసారి మనల్ని మన మార్గంలో ఆగేలా చేసి మన జీవిత ప్రయాణ దిశను పూర్తిగా మార్చివేయవచ్చు. మనం వెళుతున్న దారి సరైనది కాదు అని చెప్పవచ్చు. మనల్ని జీవిత పర్యంతం వేధిస్తున్న సమస్యలకు ఒక్క వాక్యం ద్వారా పరిష్కారం చూపించవచ్చు. మన రంగంలో మనం ఇంకా ఉన్నతంగా ఎదగడానికి సోపానాలను నిర్మించవచ్చు.
మనమున్న రంగంలో చేయబోయే పొరపాట్లు మన కంటే ముందే ఆ మార్గంలో నడిచినవారు చేసేసి వుంటారు. అందుకే మనం పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఇతరులు ఎలా ఎదుర్కొన్నారో వాటికి పరిష్కారాలు ఎలా కనుక్కున్నారో తెలుస్తుంది.
మన జీవితాలు రెండు విధాలుగా మారుతాయి. ఒకటి మనకు తారసపడే మనుషుల ద్వారా, రెండు మనం చదివే పుస్తకాల ద్వారా.. కేవలం పుస్తకపరిజ్ఞానమే జీవితంలో రాణించడానికి ఉపయోగపడదు.
జీవితంలోని ఎత్తుపల్లాలను, కష్టసుఖాలను స్వయంగా అనుభూతించిన అనుభవజ్ఞుల జీవిత పాఠాల ద్వారా, మనము ప్రస్తుతం జీవిస్తున్న సమాజంలో మమేకమై జీవించడం ద్వారా మనకు తారసపడ్డ వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల సంఘటనల నుంచి సంగ్రహించిన పరిజ్ఞానం కూడా జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేసి మానవ జన్మ ఫలవంతానికి దోహదపడతాయి.
పుస్తకాల ద్వారా లభించిన జ్ఞానం కొన్ని సందర్భాలలో వాస్తవ జీవిత పరిస్థితులలో అన్వయించే క్రమంలో కొన్ని సందర్భాలలో వాస్తవ విరుద్ధంగా ఉండి తడబాటుకు లోను చేయవచ్చు. తప్పుడు భాష్యం అందేలా చేయవచ్చు. పుస్తక పటనం జ్ఞానాన్ని అందిస్తుంది. జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే నేర్పు, పరిస్థితులకు అనుగుణంగా స్పందించే వివేకం మన చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా అలబడుతుంది.
పుస్తకాలే జీవితానికి మంచి మార్గంలో వెళ్లేలా చేసి ఉన్నతంగా జీవించడానికి ఉపయోగపడతాయి అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. అక్షర జ్ఞానం ఏమాత్రం లేని వ్యక్తులు సైతం ఉన్నతంగా ఎదిగి ప్రపంచాన్ని అబ్బురపరిచిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు.
ప్రపంచంలోని పుస్తకాలను మొత్తం అవపోసన పట్టి మేధావులుగా కీర్తించబడిన వ్యక్తులు సైతం వ్యవహార జ్ఞానం లోపించి విఫలమైన సందర్భాలు ఉన్నాయి.
నిజం చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో మేధావుల కంటే అక్షర జ్ఞానం లోపించిన సగటు వ్యక్తే గొప్పవాడు.
ఎందుకంటే ఈ కష్టాల వ్యవస్థలో జీవించడం ఎలాగో అతనికి బాగా తెలుసు కాబట్టి.
– మామిడాల శైలజ