వర్తమానపు చూపు
ఠీవిగా నిల్చున్న ఆ జ్ఞానదీపం
అజ్ఞానతిమిరంతో సమరం చేస్తూ
ధిక్కార స్వరమై దారి చూపుతుంది
సాధికారత వరమై శ్వాసనిస్తుంది
అధికారాపు నిషాకు ఆనకట్ట వేస్తుంది
కలలను కాలంతో ముడేసే
చుక్కాని అవుతుంది
అవసరమైతే నిలదీసే వజ్రసంకల్పమూ కాగలదు
అది మనకాలపు కోహినూర్
పాలకులు మారినా తను సత్యమై
మెరుస్తుంటుంది
మేలైన మనుషులకై నీడను పరుస్తుంది
కళల సమాహారాన్ని కరవాలం చేస్తుంది
తరానికో జ్ఞాపకం తను
యువతరానికో తారాతీరం తను
పారవశ్యమై తనువు బరువు కోల్పోతుంటుంది
తను మాత్రం బరువైన తన చరిత్రను చేతిలో పెడుతుంది
అక్కడ ఏ రాయిను మీటినా
అక్కడి రహస్య మీటింగ్ లను రాయమంటుంది
నిర్మోహత్వాన్ని నిస్తంత్రి వీణ చేస్తుంది
అందుకే నిన్న,రేపుల మధ్య
వర్తమానపు చూపైన ఉస్మానియా
నను విడవని మేనియా
– సి.యస్.రాంబాబు