వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం-4)
“ఉప్మా అందరం తిన్నాము అని చెప్పావట. నీకు ఆమెతో మాట్లాడడానికి టైం ఎప్పుడు దొరికింది అది చెప్పు ముందు?” అన్నాడు వాసు
********
వాసు బండి స్టార్ట్ చేసాడు. ఆనంద్ వెనుక కూర్చున్నాడు. ఇంతలో, ఎవరో, ఒక నల్లని శాల్తీ ‘ఆగుండ్రి’ అంటూ వీరిని సమీపించాడు. గేరు వేసిన వాసు మళ్లీ న్యూట్రల్ లో పెట్టి బండిని ఆపాడు.
“ఎవరు భయ్యా నువ్వు?” అని అడిగాడు వాసు.
“ఈ ఏరియా నాది. అప్పటి సంది మిమ్ములను సూతాన్న, ఈసార్, ఏమో……..ఈ గద్దె మీద కూర్చున్నాడు. నువ్వేమో ఆ అమ్మాయిని ఇంటికాడ దిగబెట్టి వొచ్చినవ్. అసలేంటి సంగతి? నాకు చెప్పాలి.” అన్నాడు వాడు.
“నీకు అక్కరలేని ముచ్చట ఇది. ఒరేయ్, వాసు, పోనివ్వు బండి.” అన్నాడు ఆనంద్.
వాసు గేర్ వేసి ముందుకు వెళ్ళిపోయాడు. కానీ, ఆ శాల్తీ, బండి సీటు వెనుక రాడ్ ని పట్టుకొని గట్టిగా లాగాడు.
ఇక, లాభం లేదు అనుకున్నాడో ఏమో, ఆనంద్ బండి దిగి, వాడి తో ఏమీ మాట్లాడకుండా, తన రెండు పిడికిళ్లలో, ఒక దానిని గ్రేస్ బాల్, ఇంకో దాన్ని కార్క్ బాల్ గా భావించి వాడి ఫేస్ మీద పేస్ బౌలింగ్ మొదలుపెట్టాడు ఆనంద్.
పంచ్ వెనక పంచ్ వర్షంలా కురిపిస్తున్నాడు వాడి మొహం మీద. ఇంతలో సైడ్ స్టాండ్ వేసి, వాసు కూడా బండి దిగి దొరికిన చోట దొరికినట్టు పిడిగుద్దులను వడగళ్ల లా కురిపించాడు. అదే సమయంలో, దూరం నుంచి ఏదో జీపు వస్తున్న విషయం గమనించాడు ఆనంద్. బహుశా, పోలీస్ జీప్ కావచ్చు.
ఆనంద్ బండి స్టార్ట్ చేసి, ‘కూర్చోరా వాసు’ అన్నాడు. వెనక సీటు పై ఎగిరి కూర్చున్నాడు.
“మా ఏరియా డిగ్రీ కాలేజీ. రేపు రా అక్కడికి. చర్చించుకుందాం. సీ యూ” అంటూ అరిచాడు వాసు. బండి శరవేగంగా ముందుకు దూసుకు వెళ్ళిపోయింది.
కొంత దూరం వెళ్ళాక ఒక గుడిసె హోటల్ ముందు బండి ఆపాడు ఆనంద్. చక్కటి చెట్టునీడన, చల్లటి వాతావరణంలో, కాలుష్య రహిత ప్రదేశంలో ఉంది ఆ గుడిశ.
ఇద్దరూ బండి దిగి లోపలికి వెళ్లి కూర్చున్నారు. అక్కడ ఎన్ని గంటలైనా తీరుబడిగా సమయం తెలియకుండా గడిపేయొచ్చు. అంత చక్కటి స్థలం అది.
“అవ్వా, రెండు స్పెషల్ చాయ్. అల్లం దంచి కొట్టు.” చెప్పాడు ఆనంద్.
“ఆడ కూసోండి, అయ్యలు.” అంటూ కుండలో నుంచి చల్లటి నీళ్లు తెచ్చి ఇచ్చింది అవ్వ.
ఇద్దరికీ ప్రాణాలు లేచి వచ్చినట్లుగా అనిపించింది. వెంటనే కుదుట పడ్డారు ఆ నీళ్లు తాగి.
“ఏంది, అయ్యలు, గట్ల రొప్పుతుండ్రు… ఏడ ఎండకి ఆడిన్రు?” అడిగింది అవ్వ.
“ఇప్పుడే అవ్వ. గీడనే. జరంత దూరంగా. క్రికెట్ ఆడిన.” చెప్పాడు ఆనంద్.
పుసుక్కున నవ్వాడు వాసు.
“అవును అవ్వా మేము అనుకోలే గిట్ల క్రికెట్ ఆడవలసి వస్తుందని. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక?” అన్నాడు కారడ్డంగా వాసు.
ఈసారి పుసుక్కున నవ్వాడు ఆనంద్. వాడి రెండు పిడికిళ్ల పై సన్నగా రక్తం కారుతోంది.. వీడి పిడి గుద్దులకి ఆ శాల్తీ వి పళ్ళు గుచ్చుకున్నాయి పాపం.
“ఒరేయ్, ఆనంద్, చిన్నగా రక్తం వస్తోంది. నీ ఫెస్ బౌలింగ్….. కాదులే….. పేస్ బౌలింగ్ బాగా వర్క్ అవుట్ అయింది.” ఇకిలిస్తూ అన్నాడు వాసు.
“మా ఇంటి ముందే కదరా రీజినల్ హాస్పిటల్. రేపు వెళ్లి టీటీ వేయించుకుంటా లే !” అన్నాడు ఆనంద్.
“బిడ్డలు, చాయ్ గిలాసల్ల పోసిన ఇగోండ్రి” అంటూ తెచ్చి ఇచ్చింది అవ్వ.
“ఆ, ఇప్పుడు చెప్పు నువ్వు సీతతో ఎప్పుడు మాట్లాడావు?” అడిగాడు వాసు.
“మొన్న, నాకు జూనియర్ కాలేజ్ లో పని ఉంటే వెళ్లాను. అప్పుడు సుమారుగా ఉదయం 8:30 కావస్తోంది. సరే ఎలాగూ ఒకేదారి కదా అని మన కాలేజీ వరండాలో నుంచి జూనియర్ కాలేజ్ కి వెళ్దామని మెట్లెక్కి, అటు నుంచి ఇటు వచ్చేసరికి, సీత ఏదో చదువుకుంటూ మెట్లపై ఒక్కతే కూర్చుంది. ఇక నా పని పక్కకు పెట్టి ఆమె తో మాట్లాడాను” చెప్పాడు ఆనంద్.
ఇంతలో, వీరు ఆ శాల్తీ తో క్రికెట్ ఆడుతున్నప్పుడు అగుపించిన పోలీసు జీపు నేరుగా వచ్చి అదే గుడిసె ముందు ఆగింది.
ఆ పొలిసు జీపు వీరికోసమే వచ్చిందా? ఆ శాల్తీనే వారిని పంపాడా? అసలు ఎం జరగబోతుంది?
– వాసు