తరాల అంతరాలు
కాలం మారుతుంది అంటాం… కాలంతోపాటు మారాలని వింటుంటాం.. అయితే ఈ మార్పు ఎలాంటిదై ఉండాలి? ఎంతవరకు మారాలి? అనేది ఎవరి స్థాయినిబట్టి వారు, ఎవరి ఇష్టాలని బట్టి వారు నిర్ణయించుకుంటున్నాం. మరీ ముఖ్యంగా నేటి తల్లిదండ్రులు ఆనాడు వారికి దొరకని వాటిని నేడు వారి పిల్లలకి అందివ్వాలనే ఆకాంక్షలో హద్దులు మీరి అందిస్తూ… యాతన పడుతూనే చివరకు చింతిస్తూనే ఉన్నారు. ఐనా మార్పు రావట్లేదు.
ఒకప్పుడు పెంపకంలో అమ్మమ్మా తాతయ్య, నాన్నమ్మ తాతయ్య, అత్తలు, మామయ్యలు, బావామరదళ్ళు కలిసి పంచే ప్రేమాప్యాయతలుండేవి. ఉమ్మడి కుటుంబాలుగా ఉండడం వలన బంధుత్వాల విలువ తెలిసేది. ఒక్కో తల్లికి పది మంది వరకు సంతానం ఉండడం వలన, అన్నీ చిన్నస్థాయీ, మధ్యతరగతి కుటుంబాలు కనుక ఆనాటి పెంపకాలలో మితిమీరిన ముద్దుచేయడాలు ఉండేవి కావు.
రెక్కలొచ్చాక పక్షికి ఎగరడం నేర్పి తన ఆహారం తనే సంపాదించుకోవాలని నేర్పే పక్షుల్లా చిన్నతనం నుండీ ఆటపాటలతోపాటు ఆలనాపాలనాలో కష్టాలు కన్నీళ్ళు కూడా కలబోసి పెంచేవారు. పెద్దలపట్ల ఎలా ప్రవర్తించాలో… గురువులను ఎలా గౌరవించాలో… చిన్నంతరం పెద్దంతరం తెలిసేలా సరైనా సంస్కారమబ్బేలా పెంచేవారు. గంజి నీళ్ళు తాగినా ఆనాటి పెంపకమే బాగుంది.
నేడు మనం చాలా అభివృద్ధి చెందాం. ఎంతో విజ్ఞానం నేర్చుకున్నాం. విదేశాలకి సైతం ఎగిరిపోతున్నాం. పచ్చడిమెతుకులంటే తెలియక నిత్యం పాయసాన్నాలు భోంచేస్తున్నాం. ప్రపంచాన్ని గుప్పిట బంధించాం. కానీ భవిష్యత్తరాలకి సంస్కారాన్ని అలవర్చడంలో ఓడిపోయాం.
ఒకరిద్దరు సంతానమే ఉండడం, ఇంటి పెద్దలందరూ డస్ట్ బిన్లయ్యి వృద్ధాశ్రమాలకి పంపబడడం లేక రోడ్డున యాచకులు కావడం వలన, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులవడం వలన, డేకేర్ల పెంపకాల కారణంగానూ… విచ్చిన్నమైన కుటుంబాల వలన పిల్లల్ని పెంచడంలో విఫలమైనామనే చెప్పాలి.
ఒకవేళ పైన పేర్కున్న కారణాలేవీ లేకపోయినా ర్యాంకుల పరుగులో.. ఫాల్స్ ప్రెస్టేజిలో బ్రతికేయడంవలన పిల్లల మనసుకి కళ్ళెం వేస్తూ… మన గొప్పలు వారి నెత్తిన రుద్దుతున్నామనాలి. మరోవైపు మనకేం తక్కువన్న భావనలో అడిగినదల్లా చేతికిస్తూ తల్లిదండ్రులంటే కేవలం ఏటీఎమ్ మెషీన్లు అయిపోయిన పెంపకాలు ఉన్నాయి.
వస్తువు విలువ కానీ బాంధవ్యం విలువ కానీ తెలియనీయక స్థాయి, హోదా అంటూ పెంచుతున్న పెంపకంలో స్వార్ధం గూడుకట్టుకుని లేని అహం మనసంతా ఆక్రమించి చిన్నవయసులోనే పెద్ద పెద్ద ఆశలు, తీరకుంటే అర్ధంతరపు చావులు, అడిగాడని వయసులేకున్నా కొనిచ్చే బైకులు, కార్లు అతివేగం సరదాలో కోల్పోయే ప్రాణాలు, ఇలా ఉన్న ఒక్క సంతానం ఎటూకాకుంటా సహనం , కష్టం అనే పదాలకి అర్దాలు కూడా తెలియకుండా పెంచుతున్నాం.
ఫలితంగా అత్యాచారాల అఘాయిత్యాలు నిత్యం మన ముందు వికటాట్టహాసం చేస్తున్నాయి. వావి వరుసలెరుగక, మితిమీరిన అరువుతెచ్చుకున్న నాగరికతలో కొట్టుకుపోతూ భావితరాలకి మన సంప్రదాయ విలువలను అందించలేని కనీసం గౌరవమైనా తెలియని విధంగా నేటి పెంపకం ఉందంటే అతిశయోక్తి కాదు.
అధ్యాపకురాలుగా తరాల మధ్య వస్తున్న వ్యత్యాసాలను దగ్గరగా చూస్తున్న అవగాహనతో వ్రాస్తున్న వ్యాసం ఇది. కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలకి దూరమై కనీసం మనమెక్కడ ఉన్నాము, మన చుట్టూ ఎవరున్నారు, మనమెలాంటి భాష మాట్లాడుతున్నామన్నది కూడా తెలియకుండా నోరు తెరిస్తే బూతు పురాణమే దర్శనమిస్తున్న నేటి తరం భవిష్యత్తరాలకి ఎలాంటి విలువలను నేర్పుతుందో… తానే మార్గాన పయనించబోతుందో వేచి చూడాలి.
మారిన కాలంలో ఫలితాలన్నీ వెంటవెంటనే కావాలి. అలానే ధనసంపాదన కూడా కొద్ది సంపాదనతోనే అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నది నేటి తరాల ఆలోచన ఈ ఆలోచన కారణంగా ఎంత దూరం ఎగిరి అలసి తిరిగి ఈ నేలకి చేరతారో వేచి చూడాలి. అప్పటికైనా ఎంత ఎత్తుకు ఎదిగినా తిరిగి ఈ నేలని తాకాల్సిందేనని గుర్తించగలిగితే అంతే చాలు..
(అందరూ ఇలానే ఉన్నారన్నది నా అభిప్రాయం కాదు. అక్కడక్కడా మేలిమి బంగారంలా తళుకులీనితూ ఆనాటికీ నేటికీ రాబోవు తరాలకీ వారధులుగా నిలబడేవారు ఉన్నారు. కాకపోతే అది కొద్ది శాతం మాత్రమే. అత్యధికులు మాత్రం ఇలా తప్పు త్రోవన నడుస్తున్నవారే ఉన్నరన్నది నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవరినీ కించపపరచాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఎవరైనా నా వ్యాసం మూలంగా బాధపడి ఉంటే క్షమింప ప్రార్ధన)
– ఉమామహేశ్వరి యాళ్ళ