స్వేచ్ఛ
భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం – ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది.
స్వాతంత్య్రానంతరం మన దేశ పాలనకు దిక్సూచిగా రూపొందించబడిన భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడుతోంది. ఆనాడు డా. బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, అనేక చర్చలు, మేధోమధనం జరిపి రాజ్యాంగాన్ని రూపొందించింది.
రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే వివిధ పార్టీలు అభిప్రాయాలు చెప్పే సందర్భంలో ఆనాటి కొత్తగా రాజ్యాంగ రచన అవసరం లేదనీ, మనుధర్మాన్నే మన రాజ్యాంగంగా ప్రకటించాలని… చెప్పిన విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఆనాటి నుండి కూడా ఆ పార్టీ రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువలను, దాని లౌకిక స్వభావాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది.
రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్‌లో నిర్ణయాలు జరుగుతున్నాయి. వాటిని సవాల్ చేస్తే కోర్టులు విచారించే పరిస్థితి లేదు. మన రాజ్యాంగం బూర్జువా-భూస్వామ్య పాలనకు అనువైన రాజ్యాంగమే. అందులో సందేహం లేదు. రాజ్యాంగ లక్ష్యంగా ఉన్న సోషలిస్టు సమాజాన్ని ఆవిష్కరించాలంటే ఈ రాజ్యాంగం స్థానంలో మరింత పురోగామి భావాలతో నూతన రాజ్యాంగాన్ని అభివృద్ధిపర్చుకోవాల్సి ఉంటుంది.
కానీ ఇప్పుడున్న రాజ్యాంగమే ప్రమాదంలో పడుతున్న సందర్భం ఇది. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస బూర్జువా ప్రజాస్వామ్య విలువలు కూడా నాశనమైతే మన ప్రజలు మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రస్తుత రాజ్యాంగాన్ని, దాని మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన దేశభక్తియుత కర్తవ్యం మనందరిపైన ఉంది. మన దేశ ఆధునికతకు పునాదిగా మన రాజ్యాంగం ఉంది. అనేక అభ్యుదయ, పురోగామి లక్ష్యాలు, విధులు, బాధ్యతలు అందులో చెప్పబడ్డాయి.
– మాధవి కాళ్ల