స్వాతంత్ర్యమా నీవెక్కడ
నాడు ఆంగ్లేయులతో
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోరి
ఎన్నో ఏళ్లు పోరాడి
ప్రాణాలర్పించి
బానిస సంకెళ్ళు తెంపుకుని
స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం
కానీ…. ఏది…
ఎక్కడుంది
గాంధీ కలగన్న రాజ్యమేది…..
కన్న కలలు, ఊహలు, ఆశలు…
గాలికెగిరిపోయాయి
ఆడదానికి అర్థ రాత్రి కాదు…..
పగలే రక్షణ లేదు
ఎక్కడ చూసినా.
ఎటు చూసినా.
కుల చిచ్చులు, మతపు మంటలతో
శాంతి కపోతానికి గాయాలు…….
ఒకవైపు
రెక్కాడితేగాని డొక్కాడక
ఆకలితో అలమటించే
పేద వాని ఆకలి కడుపులు……
మరో వైపు
నీచ రాజకీయాలు….
హత్యలు, మానభంగాలు, దోపిడీలు,
కుంభకోణాలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు
నిరుద్యోగుల, రైతుల ఆత్మ హత్యలు…..
ఎక్కడుందీ స్వాతంత్ర్యం
నడిరోడ్డులో బేరమాడి
ఓటును అమ్ముకుని
ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేస్తుంటే
అవినీతి అందలాలెక్కి
రాజ్యమేలుతుంటే
అన్యాయాలను ప్రశ్నించక
మౌనం పాటిస్తుంటే
ఎక్కడుందీ స్వాతంత్ర్యం
నేటి స్థితిలో
స్వాతంత్ర్యం కనుమరుగై
స్వేచ్ఛ మాయమై
మళ్లీ స్వాతంత్ర్యమా నీవెక్కడ అని
వెతక వలసి వస్తుంది
మరో పోరాటానికి
సిద్ధంకావలసి వస్తుంది
– రహీం పాషా