సంక్షిప్త సందేశం
ద్వేషించే హృదయాలు కూడా
ఉదయాలను ప్రేమిస్తాయి
పరిశుద్ధులను చేస్తాయేమోనని
ఎదురుచూస్తుంటాయి
మనుషులంతా ఒకలా ఉండనట్టు
ఉదయాలన్నీ ఒకేలా ఉండవు
లాలించేవి విసిగించేవి చురుక్కుమనిపించేవి,చెక్కిలి నిమిరేవి..ఎన్నని..
ఏ ఉదయం వెనక ఏ దుఃఖముందో
ఎవరికి ఎరుక
మనలా రాగద్వేషాల మూటలా మబ్బులని సందేహపడుతుంటాను
అరుణకిరణాలతో అలంకరించుకొని
జగతిని లేపే విధినిర్వహణలో ఉంటాయి కదా
ఎండాకాలం చిటపటలాడి
వానాకాలం లో చినుకు నిచ్చెనలేసి
చలికాలపు బద్దకాన్ని కప్పుకుని
ఋతువుల మేడలో దర్శనమిస్తుంటాయి
ఋతువేదయినా
ఆశల్ని పెంచుతూ
ఆకలిని దాచుతూ
బాధను మింగుతూ
ద్వేషాన్ని తుంచుతూ
సాగమని
ద్వేషించే హృదయాలకు
గాలితో సంక్షిప్త సందేశాలు పంపుతాయి
– సి. యస్. రాంబాబు