సంక్రాంతి కానుక

సంక్రాంతి కానుక

అతగాడి నులివెచ్చని కౌగిలి లోంచి ఆ తలుపుల కమ్మని నిదురలోంచి గభాల్న మెలకువ వచ్చి చూద్దునా!!!
“మన ఇనపకొట్టు రమేష్ కి సంక్రాంతి పండక్కి వాళ్ళ మామగారు  బైకు కొనిచ్చారట” అత్తగారి కంఠం వినబడుతోంది..
మామగారు కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఇంకో రెండు అలాంటి కుటుంబాల సంగతే మాట్లాడుకుంటున్నారు. అక్కడే కూర్చుని మొబైల్ చూస్తూ టీ తాగుతున్న తనకి వినబడేలా.
గుండె గుభేలుమంది. నాన్నకి ఇంకా పెళ్ళికి చేసిన అప్పులే తీరి ఉండవు. తమ్ముడు కాలేజీ కి ఫీజు సమకూరిందో లేదో!!!
మొన్న దసరాకి కూడా ఇలాగే ఆ పక్క వాళ్ళవి ఈ పక్క వాళ్ళవి చెబుతూ 40,000 ఇప్పించుకున్నారు అత్తగారు.
ఏదోలా సర్ది నాన్నకు డబ్బులు చేరవేద్దాం అన్నా కూతురు సొమ్ము తినకూడదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తారు నాన్న మరి ఎలా?
స్కూలు ముగించుకుని వడివడిగా అడుగులు వేస్తున్న నా మనసు నిండా ఒకటే ఆలోచనలు, ఈ సంక్రాంతి కానుక భారం నాన్నకి ఎలా అంటూ!
పోనీ ఈయనతో ఒక మాట చెబుదామా అంటే దసరాకి చూసాను కదా వచ్చిందల్లా వెనకేసుకునే రకం లాగే ఉన్నాడు. కిమ్మనకుండా దసరా బహుమతి తీసుకున్నాడు. ఫోను రింగవుతోంది!! అటునుంచి నాన్న,
“ఏమ్మా!!! అందరూ కులాసానా అత్తగారు మామగారు ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ..
“అంతా బాగున్నాం నాన్నా”…. అప్రయత్నంగా నా గొంతు మూగపోయింది.
మమగారికి ఫోను ఇచ్చి వంటింట్లోకి వెళ్ళాను.
ఆ..ఆ…ఆ…ఈ పండగలు పిలుపులు ఏం వద్దులెండి బావగారూ మీ అమ్మాయి అల్లుడు వస్తారు లెండి
అంటూనే మామగారు అత్తగారికి ఫోను ఇవ్వడం…
అటు నుంచి అమ్మ చెప్పడం అయ్యాక వాళ్ళ బలవంతం మీద వీళ్ళు ఒప్పుకుంటున్నట్లు ఓ నవ్వు నవ్వి
“సర్లెండి వదిన గారూ… మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు పెద్ద పండక్కి మేమంతా మీ ఇంటికి వస్తాం అంటూ ఫోన్ పెట్టేసారు అత్తగారు.
నేను రెండు రోజులు ముందుగానే వెళ్ళాను. చాలా ఇబ్బందిగా ఉంది నేను పుట్టి పెరిగిన ఇంట్లో, అమ్మ చేసిన అరిసెలు, జంతికలు, మినప్పిండి ఉండలు సయించడం లేదు.
పెద్ద పండగ కు అన్నట్లుగానే అంతా వచ్చారు. కుశల ప్రశ్నలు అయ్యాక మర్యాదలు అవీ జరిగాక భోజనాల వేళయ్యి అంతా తిని లేచారు. అత్తగారు అమ్మతో అంటున్నారు ఆరోజు అరుగు మీద కూర్చుని వాళ్ళు మాట్లాడిన, నేను విన్న అవే మాటలు, అమ్మ నవ్వులో ఇబ్బంది!!
బయలుదేరతామని లేవగానే బొట్టు ఉంచుతానని అమ్మ లోపలికి వెళ్ళి పళ్ళెంలో అత్తగారికి మామగారికి బట్టలు తాంబూలం సర్ది తెచ్చింది. ఇంకో పళ్ళెం లో బట్టలు ఈయనకు అనుకుంటా!!
వియ్యంకురాలికి వియ్యపురాలికి బట్టలు పెట్టి నమస్కారం చేసాక నాన్న అమ్మ వైపు చూసారు. అమ్మ వెళ్ళి చిన్న చేతిసంచి తెచ్చింది చూస్తే లక్ష రూపాయలు.
పళ్ళెం లో బట్టలతో పాటు పెట్టి తాంబూలం పెట్టి ఈయనగారికి ఇచ్చారు నాన్న”సంక్రాంతి కానుక బాబూ” అంటూ
“మా వాడు ఒక్కడే తిరుగుతాడా ఏంటి… మీ అమ్మాయితో కదూ షికార్లకు  వెళ్ళేదీ.. అంటూ అత్తగారి  పళ్ళికిలింపు..
అంతా వెళ్ళాక నాన్నతో అమ్మతో కల్సి పెరట్లో  కూర్చున్నాను. ఎందుకో నాన్న కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను.
స్కూల్ లోనూ కాలేజీ లోనూ ఫస్ట్ వచ్చేది నాకు, స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గా పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు నాకు.
నా పెళ్ళి నాన్నకు చాలా పెద్ద బాధ్యతే.. అయినా చేశారు, వేలల్లో జీతం వస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది.
సంవత్సరాలు గడిచాయి. ఈ నాలుగేళ్ళలో చాలా జరిగాయి. తమ్ముడికి పెళ్ళి అయ్యింది. ఇది మొదటి సంక్రాంతి. వాళ్ళు నన్ను కూడా పిలిచారు పతీ సమేతంగా…
భోగి రోజు సాయంత్రానికే చేరుకున్నాం నేను ఈయనా.. పెద్ద పండగ రోజు పొద్దున్నే మరదలి ఇంటికి ప్రయాణం. 9 గంటలకల్లా వాళ్ళ ఇంటికి చేరుకున్నామందరం.
కుశల ప్రశ్నలు మర్యాదలు అయ్యాక టిఫిన్లు కానిచ్చి కొంచెం పిచ్చాపాటీ మాట్లాడుకుని భోజనాలవేళ కావడంతో అంతా ఒకే పంక్తిలో కూర్చున్నాం. మరదలు నాతో చాలా స్నేహంగా ఉంటుంది.
బయలుదేరతామని అమ్మ అనగానే మరదలు వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళి పళ్ళెంలో బట్టలు తాంబూలం సర్ది తెచ్చారు.
నాన్న తాంబూలం, అమ్మ రవికెల గుడ్డ తీసుకుని వాళ్ళిద్దరినీ ఆలింగనం చేసుకున్నారు. మీరింకేమి మాట్లాడొద్దు బావగారు అంటూ నాన్న మరదలు వాళ్ళ నాన్నగారిని ఆపేశారు.
తమ్ముడికి కూడా సంక్రాంతి కానుక ని ఇవ్వనివ్వలేదు నాన్న వాళ్ళ మామ గారితో. పైపెచ్చు చేతి సంచీ లోంచి అమ్మ చీర రవికెలగుడ్డ ఒక లక్ష్మీ రూపు తీసి మరదలికి బొట్టు పెట్టి ఒడి లో పెట్టింది, మా సంక్రాంతి లక్ష్మివి నువ్వు తల్లీ అంటూ…
మరదలి కళ్ళల్లో నీళ్ళు… మా వారి మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు…
నాన్న !!!ఆ క్షణంలో ‘సంక్రాంతి’ లా కనిపించారు నాకు 😇
కొత్త ఆలోచనల సంక్రాంతి ప్రతి ఇంటా జరగాలని ఆశిస్తూ మీ
-భాను

0 Replies to “సంక్రాంతి కానుక”

  1. చాలా బాగుంది.. కనీస మార్పు వస్తె బాగుంటుంది.. మీకు అభినందనలు..💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *