సమాజం గుర్తించని మనిషి

సమాజం గుర్తించని మనిషి

ఇంకెవరూ నేనే. నేను సమాజం గుర్తించని మనిషిని, నేను ఆకాశంలో సగం కానీ నన్ను మనిషిగా కూడా గుర్తించరు, అన్నిట్లో నాకు సగ భాగం ఉందంటారు కానీ సమాజంలో నేను లేను, రిజర్వేషన్ పేరుతో అధికారాన్ని అంటగడతారు కానీ పాలించేది వాళ్ళే…. నేను కేవలం సంతకానికే పరిమితం.

ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఎదురుగా కనిపిస్తున్నా నేను మాట్లాడే మాటలు వాళ్ళవే, నేను చేసే పనులు వాళ్ళవే. ఎన్ని రంగాల్లో ఉన్నా, ఎంత ప్రగతి సాధించినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్నో పతకాలు తెచ్చినా, అంతరిక్షం లోకి వెళ్ళినా, చదువులు నేర్పుతూ దేశానికి వీరులను, ధీరులను అందిస్తున్నా, నేను సమాజం గుర్తించని దాన్నే, కనీస మనిషిగా కూడా గుర్తించని నన్ను ఎన్నో మాటలంటారు, మరెన్నో ఆంక్షలు విధిస్తారు.

కట్టెల పొయ్యి కాలం నుండి గ్యాస్ పొయ్యిల కాలం వరకు నన్ను ఇంకా ఎవరూ గుర్తించనే లేదు, పేరుకే అన్ని చేస్తారు కాని లోపల జరిగేవి మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో నేను ఎప్పటికి బానిసనే, బట్టలు ఉతికినా, అంట్లు తోమినా, మంచి వంట చేసినా, ఎన్ని పదార్ధాలు, ఎంత సేవ చేసినా నాకు వంకలు, తిట్లు తప్పవు.

చిన్నప్పటి నుండి అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడికి వెళ్లొద్దు, అన్నీ ఓర్చుకోవాలి, తల దించుకుని ఉండాలి, సర్దుకుని పోవాలి అని చెప్తూ పెంచి, ఎంత ఒళ్ళు వంచి పని చేసినా, ఇల్లు, ఉద్యోగం పిల్లలను చూస్తూ అన్ని సగ పెడుతున్నా, జీతం అంతా తెచ్చి చేతిలో పోస్తున్నా, ఎవరూ నన్ను గుర్తించరు, కన్నవారికి బరువు, కట్టుకున్న వాడికి బానిస, కడుపునా పుట్టిన వారికి జీతం లేని పనిమనిషిగా బతుకుతున్న నాకు సమాజంలో చోటెక్కడ?

మగాడికి విలాస వస్తువును నేను, వయసు, సమయం చూడకుండా ఏ వయసులో ఉన్నా అత్యాచారాలు చేస్తూ, చంపుతూ, నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నా, మళ్ళి అక్కడ కూడా వాడే ముందు, వాడి పేరే ముందు, అక్కడా కూడా గుర్తించని సమాజం, ఇక ఇంట్లో మగాడు అయినా మొగుడు ఎన్ని వింత పోకడలకు నేను బలి అవుతూనే ఉంటాను.

పచ్చిగా చెప్పాలని ఉన్నా, చెప్పలేని నిస్సహాయత నాది, నాకు మాటలు వస్తాయి, నెనూ మాట్లాడగలను అని ఎదిరిస్తే చంపుతూ, పైగా లేని పోనీ నిందలు వేస్తూ వేలివేస్తుంది సమాజం. అందుకే నేను సమాజం గుర్తించని మనిషిని, కేవలం ఓటుకు, పనికి తప్ప ఇంకా దేనికి పనికిరాని పనిమనిషిని. నాకొక పేరున్నా ఆ పేరులో ఉన్న ఆశ నాకు లేదు, అందుకే సమాజం నన్ను గుర్తించలేదు. సమాజాన్ని నేను గుర్తించలేదు.

గుర్తిస్తే నా హక్కుల గురించి పోరాదేదాన్ని, అరిచి గీ పెట్టేదాన్ని, ఎన్నో చేసేదాన్ని, కానీ అలా అరవకుండా నా గొంతు నోక్కేసారు బంధం, బాధ్యతల పేరుతో నన్ను అణిచివేసినారు. సమాజం గుర్తించని మనిషిని నేనే.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *