సగం కూలీనే..

సగం కూలీనే..

అరే మల్లిగా పనికి వేళ అయ్యింది రా.. తొందరగా రా పోదాము.. అందరూ పోయినారు మనదే లేట్…
బయట రోడ్ మీద నుంచి అరుపు మా చిన్నాన్న (తిరుపతి బాబు) నాకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు..
ఇంతకీ ఎక్కడికి పోతున్నాము చెప్పనే లేదు కదా… సెలవుల కోసం ఇంటికి వచ్చిన నేను అమ్మ కి కాస్త సాయం గా ఉంటుంది.  నా టూషన్ కి డబ్బులు, పరీక్ష ఫీజు లు కట్టాలి అంటే కావాలి గదా..
అందుకే మా ఊరి అడవిలో సర్కారు వాళ్ళు వేసిన జామ ఆయిల్ చెట్లు కొట్టడానికి ఊరిలో అందరూ పోతూ ఉంటే నాకు పోవాలి అని అనిపించింది.. వాళ్ళతో పాటు నేను కూడా కత్తి చేత బట్టి నెత్తికి కండువా చుట్టి ఇంకో చేతిలో చద్ది అన్నం టిఫిన్ లో పెట్టుకొని వాళ్ల అడుగుల్లో అడుగులు వేయడం మొదలు పెట్టాను… 
దాదాపు రెండు మైళ్ల దూరం నడవాలి. నడిచే దారిలో ఒక్కొక్కరూ ఒక్కో మాట, అరే నీకు అలవాటు లేని పని చెయ్యగలవా… చేతులు బొబ్బలు పోతాయ్ రా… మేస్త్రి నిన్ను చూసి పనిలో పెట్టుకోడు రా, వెనక్కి పోరా.. అందరూ నాలో ఉన్న ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే పనిలో ఉన్నారు…  
అవేమీ పట్టించుకోకుండా నాలో నేను ఆలోచించుకుంటూ ఉన్నాను… డబ్బులు రాగానే మొదట ఒక జత చెప్పులు కొనుక్కోవాలి. నా సైకిల్ కి కొత్త టైర్ వేపించాలి.. టిఫిన్ సెంటర్ లో బాకీ తీర్చాలి… ఇలా నాలో నేను లెక్కలు వేసుకొంటూ ఉన్నాను…  
అంతలో అమ్మా అంటూ నా నోటిలో నుంచి అరుపు.. కాలిలో తుమ్మ ముళ్ళు గుచ్చు కొంది.. తుమ్మ ముళ్ళు చర్మంలోకి దిగితే కళ్ళల్లో నీళ్ళు పట పట మని రాలిపోతున్నాయి. పక్కనే నడుస్తున్న మా రవణ బాబు ఆగి కాల్లో ఉన్న ముళ్ళు తీసి. చిన్న పేలిక తో కట్టు కట్టాడు రక్తం రాకుండా..
“మల్లీ నా మాట విను రా నీకు అలవాటు లేని పని ఇది నా మాట విని ఇప్పటికీ అయినా వెనక్కి పో రా”… అన్నాడు.. లేదు బాబా నేను వస్తాను.. అని మొండికి వేశా.. చేసేది ఏమీ లేక తన కాళ్ళ కి ఉన్న చెప్పులు తీసి నాకు ఇచ్చాడు.. నా అడుగులు ముందుకు పడ్డాయి మా బాబు వెనకాల… 
ఇంతలో మేము కొట్టాల్సిన అడవి మమ్మల్ని పలకరించింది… మేస్త్రీ వచ్చి, ఒక్కొక్కరికి ఒక్కో మునం ఇస్తారు. ఆ వరుసలో చెట్లన్నీ వాళ్ళే కొట్టాల. అట్ల ఒక్క మునం అయిపోతే మళ్ళ ఇంగో మునం.
అట్లే ఇంగ తోట అయిపోయేవరకు కొట్టాలి, అని అందర్నీ పనిలో పెట్టి ఆ మేస్త్రి నా వంక పైనుంచి కిందికి అదోలా ఒక చూపు చూసి పోయిండు.. 
అట్ల రోజంతా చేస్తే రెండు వందలు, బాగా అలవాటున్న పని కావటంతో నా తోటి వాళ్ళు అందరూ తన మునంలో బిరబిరా కొట్టు కొంటూ పోతున్నారు.. పని అంతగ అలవాటు లేదు గదా.. కొంచెం నిదానంగా వెళ్తున్నా… 
చెట్టును కొడుతున్న చప్పుడు నా గుండెకు వినిపిస్తుంది.. అందులో అన్ని నాకు వచ్చే డబ్బులతో ఏమి ఏమి చేయాలి అని ఆలోచననే ఆయుధంగా మలచి ముందుకు పోతా ఉన్నా.. 
ఆలోచనల లోనుంచి బయటికి వచ్చి చూస్తే అందరూ ఆమడ దూరం లో ఉన్నారు.. నేను బాగా వెనక పడి పోయాను… 
మునంలో చాలా ముందుకు వెళ్ళిపోయినారు అందరూ.. కొందరు ఎమో రెండో మునుం కూడా పట్టుకొన్నారు..  అప్పుడు మా రవణ బాబు వెనక్కి వచ్చి నా మునం లో రెండు చెట్లు నరికి ఎలాగో అలాగా కిందా మీదా పడి ముందుకు సాగుతూ ఉన్నాను.. అంతలో నేను మా బాబుతో నీ మునుంకి పోలే బాబా అని మొహమాటంగా చెప్పాను.. 
మా బాబు “నాది అయిపోతాదిలే, ఇంకా రెండు చెట్లుండాయి అంతే “అయినా ఈ పనులన్ని నీకు ఎక్కడ అలవాటురా… ఏందో టయం బాలేక ఇట్లా వస్తాన్నావ్ గానీ నాకే ప్రాణమంతా ఎట్లో అవుతుంది. నిన్నిట్ల చూస్తోంటే” స్వచ్ఛమైన అభిమానాన్ని సానుభూతితో కలిపి చెప్పాడు మా రవణ బాబు.. 
ఆయన అన్న ఆ మాట కి కొండంత బలం కూడా గట్టుకొని దెబ్బ గట్టిగా పడుతుంది చెట్టు మీద… ఎందోలే అట్లయిపోయినాయి మా బతుకులు” అని నాలో నేనే ఎవ్వరికీ కనపడని కన్నీరు… 
ఆ కన్నీరు గమనించి బయటికి తెలియచెప్పకుండా “మాల్లిగాడు బాగా చదువుకుంటాడులే.. వానికి మంచి బుద్ధి ఉంది. చదువు గూడ బాగా అబ్బుతాందిలే. ఉద్యోగం వస్తాది. అప్పుడు బావుంటారులే ” అని పక్కన ఉన్న వేరే అతనికి చెపుతున్నాడు మా బాబు.
అంతలో చద్దన్నం తిందాం రా అని దూరం నుంచి పిలుపు.. అందరం పక్కన ఉన్న కాలవలో చేతులు కడుక్కొని టవల్ కింద పరిచి తినడానికి కూర్చున్నాం.. చేతులు మంటలు పుడుతున్నాయి.. అప్పటికే ఎర్రగా బొబ్బలు వచ్చేశాయి.. 
రాత్రి వండిన అన్నం అందులో గంజి ఒక ఉల్లిపాయ వేసుకొని వచ్చాను.. టిఫిన్ తెరిచి చూస్తే మొత్తం ఎర్ర చీమలు పడి ఉన్నాయి అందులో.. వాటిని అన్ని తీసి బయట వేసి, చేతికి రాని వాటిని నోటిలో వేసి ఎలాగో అలాగా తినేశాను… 
“మాటలు కాదు త్వరగా లేవండి” అని మేస్త్రి అరుపు.. లారీ వచ్చింది లోడెత్తాల” తొందరగా అందరూ కానియ్యండి… 
కింద పరిచిన తువ్వాల తలకి బిగిస్తూ నా మునం వైపు నడిచాను.. తడి చేతులు అవడం వలన కత్తి పట్టుకొన్న చెయ్యి బొబ్బలు టపీ మని పగిలిపోయాయి… కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.. ఒక్క చెట్టు కూడా కొట్టలేను అని నా మనసులో అనుకుంటున్నా…
పక్కన ఉన్న వాళ్ల వెకిలి నవ్వులు నన్ను ఇంకా రెచ్చగొడుతున్నాయి.. ఎలాగైనా సరే పట్టు వదల కూడదు అని నెత్తికున్న తువ్వాలు చేతికి చుట్టుకొని కత్తి చుట్టూ చుట్టి ఒడిసి పట్టుకుని కొట్టడం మొదలు పెట్టాను…
అందరూ దాదాపుగా 40-45 చెట్లు కొడితే నేను 30 -35 మధ్యలో ఉన్నాను.. ఇంతలో కొందరు లారీ లోడ్ చేయడానికి అవసరమై నన్ను పొమ్మన్నారు.. 
మనసులో హమ్మయ్య అనుకొని లోడింగ్ కోసం కొట్టిన కర్రలను లారీ దగ్గరకు మోసుకొని పోతున్నా… లారీ లోడ్ అయ్యింది..
మేస్త్రి వచ్చి అందరికీ కూలీ డబ్బులు ఇస్తున్నాడు.. నా వంతు రాగానే 100 రూపాయలు నా చేతిలో పెట్టి నీకు “సగం కూలి నే” అన్నాడు.. మనసు చివుక్కుమంది.. అడిగే ధైర్యం లేక ఇచ్చింది తీసుకొని జేబులో పెట్టుకొన్నాను.. 
“ఏరా.? డబ్బులు తీసుకొన్నావా? చెప్పు
“ఏరా?” మా రవణ బాబు పిలుస్తున్నాడు… 
ఏమీ మాట్లాడకుండా దూరంగా నడిచాను. మౌనంగా నడుస్తున్న నన్ను గమనించాడు…. 
నా నడకలోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి.. అడిగినంత ఇవ్వనందుకు బాధ పడాలో, నేను పని పూర్తి చేయలేక పోయాను అని అధైర్య పడాలో తెలియక కంట్లోని నీటిని బయటికి రాకుండా నడుస్తూ ఉన్నా.  వాళ్ళంతా నా వెనకాల వస్తున్నారు అప్పటికే నేను చాలా దూరం నడిసిపోయిన ఊరి వైపు……
సరిగ్గా పాతిక సంవత్సరాల తరువాత నేను పదిమందికి కూలీ ఇస్తున్నా… కానీ ఒక్కరికి కూడా “సగం కూలీ నే” అని నేను ఎప్పుడూ చెప్పలేదు… 
– మల్లి ఎస్ చౌదరి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *