సాక్షిగా….

సాక్షిగా….

హాయ్ వినూత ఎం చేస్తున్నావు అంటూ వచ్చాడు అభి. హా మా ముద్దుల ఆయనగారికి పకోడీలు వేస్తున్నా అంది వినూత. అబ్బా ఏం పకోడీలు… తర్వాత వేసుకుందాం గానీ పద పద తొందరగా తయారవ్వు సినిమాకు సమయం అవుతుంది అంటూ తొందర చేశాడు అభి. ఏంటండీ అంత తొందరా… అయినా ముందుగా చెప్పొచ్చు కదా నేను రెడీగా ఉండేదాన్ని ఇప్పుడు వచ్చి కంగారు పెడతారేంటి అంది కినుకగా వినూత.

నేను ముందే చెప్పేవాడిని కానీ టికెట్లు దొరుకుతాయో లేదో అనే సందేహంతో ముందు చెప్పలేకపోయాను లక్కీగా దొరికాయి అందుకే ఇంకా పది నిమిషాల సమయం ఉంది ఈ పది నిమిషాల్లో దేవి గారు తొందరగా రెడీ అయితే అదే పది వేలు అంటూ స్టవ్ ఆర్పేసి తనని తోసుకుంటూ బెడ్రూంలోని బాత్రూంలోకి పంపించాడు అభి.

మీకు అన్నిటికీ తొందర ఎక్కువే అంటూ విసుక్కుంది లోపల ఫ్రెష్ అవుతూ వినూత. అవునవును అలా తొందర ఎక్కువ కాబట్టే నిన్ను తొందర తొందరగా ప్రేమించి తొందరగా ఐ లవ్ యు చెప్పు తొందరగా పెళ్లి చేసుకున్నాను. లేదంటే నువ్వు నాకు దక్కేదానివా అన్నాడు అభి బయటనుంచి. అవును నాకు కనీసం ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తొందర చేసి నన్ను బంధీని చేసావు అంది వినుత.

నిన్ను బంధీని చేయకపోతే నాకు కోరుకున్న దానివి ఇంకెవరికో దక్కేదానివి అయినా మన వార్డెన్ కి బుద్ధి లేదు అప్పుడే ఏం తొందర వచ్చిందని నీకు ఆ సంబంధం చూడాలి…? నేను తొందరపడకపోతే వాళ్లనే చేసుకుని వెళ్ళిపోయే దానివి కదా అన్నాడు అభి. ఆ అవును మరి ఎన్నాళ్ళని వాళ్ళు మనల్ని చూసుకుంటారు చెప్పు కాళ్లు చేతులు అన్నీ బాగానే ఉంటూ ఉద్యోగం చేసుకునే సమయం వరకు వాళ్లు మనల్ని పోషించారు ఇంకెన్నాళ్లు చూసుకుంటారు….

అందుకే ఏదో ఒకటి చూసి చేయాలని అనుకున్నారు అయినా తప్పేముంది ఇన్నాళ్లు మనల్ని పెంచి పోషించి మనకు అండగా ఉన్నారు సరిపోలేదా? అయినా నాకు ఇంతగా ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టంలే…. మనం వాళ్ళకి ఏదైనా చేయాలి అభి అంటూ రెడీ అయి బయటకు వచ్చింది వినూత.

బయటకు వచ్చిన వినూతను చూసి ఆశ్చర్యపోయాడు అభి. తెల్లని మేనిఛాయలో, గులాబీ రంగు చీరలో అప్పుడే విచ్చుకున్న గులాబీ పువ్వుల అతని కళ్ళకు కనువిందు చేసింది వినూత. విన్నూ సినిమా క్యాన్సిల్ చేద్దామా… అన్నాడు చిలిపిగా అభి. చురుకు… చాల్ చాల్లెండి… ఇప్పటివరకు నన్ను తొందర చేసి ఇప్పుడు క్యాన్సల్ చేద్దామంటే ఏమిటర్ధం… అవేం కుదరదు పదండి సినిమాకి అంటూ అతని భుజాల మీద చేతులు వేసి ముందుకు నడిపించింది.

వారిద్దరూ చిన్నప్పటినుంచి అనాధ శరణాలయంలో పెరిగారు. ఇద్దరూ బాగా చదువుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారు అదే సమయంలో ఆ అనాధ శరణాలయం నిర్వాహకురాలు వినూతకి ఒక సంబంధం తీసుకొచ్చింది అప్పటివరకు తనని మౌనంగా ప్రేమిస్తున్న అభి ఆ సంబంధం విషయం తెలిసి నిర్వాహకుల దగ్గరికి వెళ్లి తాను వినూతను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకుంటానన్నట్టుగా చెప్పాడు.

దాంతో సంతోషించిన వాళ్లు వారిద్దరికీ పెళ్లి అదే అనాధ శరణాలయంలో చేశారు. అప్పటివరకు ఒంటరిగా బ్రతికిన ఇద్దరికీ తామిద్దరం ఒక కుటుంబంలా మారడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పటికీ పెళ్లి జరిగి ఆరు నెలలు అవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రాణి తమ మధ్యకు రాబోతుందని తెలిశాక వినూతను ఉద్యోగం మానిపించి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అభి.

చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది వారి జీవితం. ఒకరోజు ఎప్పట్లా అభికి లంచ్ బాక్స్ సర్దేసి ఆఫీస్కు పంపించిన వినూత. ఇంట్లో పని చేసుకుంటున్న సందర్భంలో సడన్గా కడుపులో నొప్పిగా అనిపించింది. అదేంటి డాక్టర్ గారు ఇంకా సమయం ఉందని చెప్పారు డెలివరీకి ఇప్పుడు ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తూనే ఆఫీస్ కి ఫోన్ చేయాలనుకుంది.

కానీ ఈరోజు ఏదో మీటింగ్ ఉందని అభి చెప్పింది గుర్తుకు వచ్చి మళ్లీ తనను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకుంటూ అదే తగ్గుతుంది అని బెడ్ పైన పడుకుంది. కాసేపటికి కడుపునొప్పి తగ్గింది మళ్లీ వినూత లేచి ఎప్పటిలా మిగిలిన పనులు చేసుకోసాగింది. ఒక గంట తర్వాత మళ్లీ కడుపులో నొప్పిగా అనిపించింది ఈ సారి నొప్పి ఎక్కువగా అనిపించి ఇక తప్పదని అభికి ఫోన్ చేసింది.

కానీ అభి మీటింగ్ లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రెండు మూడు సార్లు చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఏం చేయలేక తానే నొప్పిని పంటి బిగువున భరిస్తూ  ఒక చిన్న స్లిప్ మీద హాస్పిటల్ కి వెళ్తున్న అని రాసిపెట్టి, ఇంటికి తాళం వేసి పక్కింటి వారికి ఆ తాళం చేయి ఇస్తూ నాకు కడుపు నొప్పిగా ఉంది కాస్త తోడుగా వస్తారా అంటూ అడిగింది.

అయ్యో అవునా తల్లి ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా అనుకుంటూ పక్కింటి ఆవిడ గబగబా తన ఇంటికి కూడా తాళం వేసి వినూతని తీసుకొని డబ్బులు ఉన్నాయా అంటూ అడిగింది పర్సులో ఉన్నాయండి అని చెప్పింది వినూత. సరే అయితే అంటూ కాస్త ముందుకు వెళ్లి ఆటోని పిలుచుకు వచ్చింది.

ఈలోపు వినూతకి ఇంకా నొప్పి ఎక్కువగా అవుతూ చిన్నగా బ్లీడింగ్ అవసాగింది. అది చూసి పక్కింటావిడ మళ్ళీ తన ఇంటి తాళం తీసి తన ఇంట్లో ఉన్న నాలుగు ఐదు పాత చీరలు ఒక సంచిలో పెట్టుకొని ఆటో అతనితో హాస్పిటల్లో తీసుకెళ్ళు తొందరగా అని అంది.

ఆటో అతను కూడా పరిస్థితి గమనించి వారిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళసాగాడు. కానీ మధ్యలోకి వెళ్లేసరికి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటో మధ్యలో ఆగిపోయింది. మరోవైపు వినూతకి నొప్పులు ఎక్కువ కాసాగాయి పక్కింటి ఆవిడకి ఏం చేయాలో తోచలేదు తొందరగా వెళ్లి బాబు అమ్మాయికి నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి ఇంకాసేపు ఇక్కడే ఉంటే డెలివరీ అయ్యేలా ఉంది అంది.

నేనేం చేయాలి అమ్మా ట్రాఫిక్ ముందు కలవడం లేదు అయినా చూస్తాను ఆగండి అంటూ ఆటోలో నుంచి దిగి ఏం జరిగిందో కనుక్కుందామని వెళ్ళాడు. ఈలోపు వినూతకి ఇంకా నొప్పులు ఎక్కువ అయ్యాయి. నేను ఈ బాధ భరించలేనండి తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లండి అంటూ వినుత పక్కింటి ఆవిడ చెయ్యి గట్టిగా పట్టుకుంది.

అయ్యో తల్లి నేనేం చేయాలో నాకు తోచడం లేదు ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కున్నాం చుట్టుపక్కల కూడా ఏలాంటి ఆసుపత్రికి లేదు. కాసేపు ఓర్చుకో తల్లి ట్రాఫిక్ క్లియర్ అవ్వగానే వెళ్ళిపోదాం అంది చేతిలో చేయి వేసి ఓదారుస్తూ..

ఇంతలో ఆటో అతను వచ్చి అమ్మ అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది అందుకే ట్రాఫిక్ జామ్ అయింది ఇక మనం ముందుకు వెళ్లే సమయం లేదు వెనక్కి వెళ్లాలన్నా కూడా దారి లేదు ఏం చేయాలో నాకు కూడా తోచడం లేదు అన్నాడు డ్రైవర్.

అయ్యో అక్కడ ట్రాఫిక్ వాళ్ళకి చెప్పలేకపోయావా? ఆటోలో డెలివరీ అమ్మాయి ఉందని అంది పక్కింటి ఆవిడ. నేను చెప్తే వింటారా అమ్మ అన్నాడు ఆటో అతను దాంతో సరే నేను వెళ్లి పోలీసులకి చెప్పి వస్తాను నువ్వు కాసేపు ఓర్చుకో వినూత అంటూ ఆవిడ ఆటో దిగి గబగబా యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్ళింది.

అక్కడికెళ్లి అయ్యా ఆటోలో డెలివరీ జరిగే అమ్మాయి ఉంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కాస్త క్లియర్ చేయండి అంటూ అడుగుతూ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసింది పక్కింటి ఆవిడ.

కాస్త ఆగమ్మా అతను ఎవరో తెలియదు బైక్ ఫాస్ట్ గా నడుపుతూ వచ్చి లారీని గుద్దేశాడు అంటూ ట్రాఫిక్ పోలీస్ చెప్పడంతో అయ్యో అతను అభిలా ఉన్నాడు అని అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్లి చూసేసరికి అది అభినయ్. అతను స్పృహలో లేడు. సార్ ఇతను మాకు తెలిసిన వ్యక్తి వీళ్ళ ఆవిడ డెలివరీ కి ఉంది.

ఇప్పుడు ఆటోలో ఉన్నావిడా ఇతని భార్యనే సార్ కాస్త ఎలాగైనా తొందరగా తీసుకువెళ్లండి అంటూ ప్రాధెయపడింది. అవునా అంటూ గబగబా ట్రాఫిక్ క్లియర్ చేశాడు కానిస్టేబుల్.

అదే అంబులెన్స్ లో ఇద్దర్నీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఓ పక్క అభికి ట్రీట్మెంట్ జరుగుతుంటే, మరోపక్క వినూతకి నొప్పులు ఎక్కువ అవుతూ, అరుపుల కేకలతో ఆసుపత్రి మొత్తం దద్దరిల్లిపోతుంది. ఒక్క పది నిమిషాల తర్వాత కెవ్వుమని ఏడుపుతో వినూతకి అబ్బాయి పుట్టాడు. మరోవైపు అభికి ట్రీట్మెంట్ తొందరగా అందించడం వల్ల అభి సృహ లోకి వచ్చాడు.

తాను ఎక్కడ ఉన్నది చూసి వినూత, వినూత అంటూ లేవబోయే సరికి అక్కడే ఉన్న డాక్టర్ లేవద్దు పడుకోండి మీకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి అంతే ఎక్కువ శ్రమ తీసుకోకండి అంటూ చెప్పడంతో సార్ నా భార్య అంటూ అభి ఏదో చెప్పబోయాడు. ఆ పక్కనే ఉన్న కానిస్టేబుల్ సార్ మీరేం టెన్షన్ పడొద్దు మీ భార్య గారు కూడా ఇదే ఆసుపత్రిలో ఉన్నారు. ఆవిడకి నొప్పులు ఎక్కువై తీసుకొచ్చారు ఈపాటికి మీకు అమ్మాయో అబ్బాయో పుట్టే ఉంటారు అన్నాడు నవ్వుతూ….

దానికి అభి చాలా థ్యాంక్స్ సర్, తను నాకు ఫోన్ చేసింది నేను చూసుకోలేదు చూసుకొని వెంటనే తిరిగి వస్తున్న సందర్భంలోనే ఎదురుగా వస్తున్న లారీకి ఢీకొట్టాను. ఇప్పుడు ఎలా ఉంది నా వినూత అంటూ అడిగాడు. ఏమోనయ్యా లేబర్ రూమ్ లోకి అయితే తీసుకువెళ్లారు నాకు అక్కడ విషయం తెలియదు అని అనగానే….

అభి డాక్టర్ వైపు తిరిగి సార్ నేను ఒకసారి నా భార్య ని చూడొచ్చా అంటూ అడిగేసరికి డాక్టర్ గారు అతనికి భార్య పై ఉన్న ప్రేమకి కరిగిపోయి, సిస్టర్ తో, సిస్టర్ అతన్ని వీచేర్లో వాళ్ళ ఆవిడ దగ్గరికి తీసుకు వెళ్ళండి అంటూ చెప్పాడు. కానిస్టేబుల్, సిస్టర్ ఇద్దరూ అతన్ని జాగ్రత్తగా పట్టుకొని వీల్ చైర్ లో కూర్చోబెట్టి లేబర్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళారు.

వీళ్ళు వెళ్లేసరికి లేబర్ రూమ్ లోంచి చిన్నపిల్లలు ఏడుపు వినిపిస్తుంది ఎదురుగా పక్కింటి ఆవిడ అతనికి కనిపించి ఏమయ్యా అభి ఎలా జరిగింది నీకు యాక్సిడెంట్ అంటూ అడిగింది. వినూత నాకు ఫోన్ చేసింది ఆంటీ… అయితే నేను అది చూసుకోలేదు మీటింగ్ లో ఉన్నాను. మీటింగ్ నుంచి బయటకు వచ్చి చూసుకునే సరికి ఫోన్లో నాలుగు మిస్ కాల్స్ చూసి ఏమైందో అనే కంగారులో వస్తుంటే లారీకి గుద్దేశాను అయినా నాకేం అవలేదు నేను బాగానే ఉన్నాను ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ వినూతను సమయానికి ఆసుపత్రికి తీసుకువచ్చారు అంటూ కృతజ్ఞతలు చెప్పాడు అభి.

దాందేముందయ్యా పక్కింటి వాళ్ళం ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా, వెళ్ళు వినూత సృహా లోకి వచ్చింది నీకు అబ్బాయి పుట్టాడు అంటూ నవ్వుతూ చెప్పింది పక్కింటి ఆంటీ. అవునా అంటూ వీల్ చైర్ ని తానే ముందుకు తోసుకుంటూ లోపలికి తలుపులు తీసుకొని వెళ్ళాడు అభి.

బెడ్ పైన ఉన్న వినూత దగ్గరికి వెళ్లి వినూత వినూత అంటూ చిన్నగా పిలిచాడు అతని పిలుపుల కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఆవిడ మెల్లగా కళ్ళు విప్పింది. అది చూడగానే ఆమె కళ్ళు తళుక్కున మెరిసాయి పెదవులపై చిరునవ్వు మెరిసింది.

తన చేతిని మెల్లిగా వినూత చేయి పై వేసాడు అభి. థాంక్స్ వినూత నాకు అబ్బాయిని అందించావు మనం ఇప్పుడు అనాధలం కాదు మనం ఒక కుటుంబం మనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది ఇకనుంచి మనం చాలా సంతోషంగా ఉందాం అన్నాడు అభి కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండగా….

వినూత కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండగా పక్కన ఉన్న బాబు చేతిని వాళ్ళ చేతుల్లో వేసి, అభి, వీడిని అనాధ చేయకు నీకు వీడున్నాడు మనం పెరిగిన అనాధ శరణాలయానికి ఏదో ఒక సాయం చెయ్ చేస్తావు కదూ అంటూ చిరునవ్వు పెదాల మీద విరియగా కళ్ళు మూసింది వినూత.

విన్నూ అంటూ గట్టిగా అరుస్తూ ఏడవసాగాడు అభి. సారీ అభి గారు ఆలస్యమైంది బాబును మాత్రమే కాపాడగలిగాం ఇప్పటివరకు తాను బ్రతికి ఉందంటే కేవలం మిమ్మల్ని చూడాలని ఆశతోనే అయి ఉంటుంది. మీరు గుండె రాయి చేసుకోవాలి మీ బాబు కోసమైనా మీరు ఏడవకుండా దృఢంగా ఉండాలి అంది డాక్టర్ అభి భుజం మీద చేతులు వేసి ఓదారుస్తూ….

**********

రెండేళ్ల తర్వాత అభి తన బాబు చిన్నుతో కలిసి తాము పెరిగిన అనాధ శరణాలయానికి వెళ్ళాడు. అంతా రెడీయేనా అంటూ అక్కడి తాత ను అడిగాడు. అంతా తయారుగా ఉంది సార్ మీరు రావడమే ఆలస్యం అన్నాడు అతను.

సార్ ఏంటి తాతా… నన్ను ఎప్పటిలాగే అభి అని పిలువు అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని, ఆ పక్కనే తాను కట్టించిన వినూత అనాధ శరణాలయాన్ని చిన్నూ చేత రిబ్బన్ కటింగ్ చేయించాడు అభి. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన వారు ఆ ఎదురుగా గుడ్డతో కప్పిన విగ్రహాన్ని చిన్నూ చేత తీయించాడు. అక్కడ చిరునవ్వు నవ్వుతున్న వినూత శిలా విగ్రహం నవ్వుతూ వాళ్ళిద్దర్నీ చూస్తోంది. వినూత చిరునవ్వు సాక్షిగా అభి చిన్నూ లు ఆ అనాధ శరణాలయాన్ని అనాధల కోసం అంకితం చేశారు.

 

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *