పుష్కలంగా పుష్కరం

పుష్కలంగా పుష్కరం

అవి 2003 గోదావరి పుష్కరాలు జరుగుతున్న రోజులు. మేము హైదరాబాదు నుంచి రాజమండ్రి పుష్కర స్నానాలు చేయాలని బయల్దేరాము. హైదరాబాదు నుంచి మా కుటుంబం, అన్నయ్య, స్నేహితులు ఇద్దరు మాతోపాటు బయల్దేరారు.
మధ్యలో గుంటూరులో మరి కొందరు స్నేహితులు కూడా మాతో పాటు పుష్కర స్నానానికి రావాలనుకున్నారు. వారికోసం హైదరాబాదు నుంచి గుంటూరుకు ఉదయం రైలు ఎక్కాము. గుంటూరు చేరేసరికి మధ్యహ్నం అయ్యింది, తెలిసిన వాళ్ళ ఇంటిలో భోజనాలు చేశాం.
సాయంత్రం నాలుగు, అయిదు గంటలకు వచ్చే వాళ్ళు అందరూ గుంటూరు బస్టాండ్ లో కలుద్దామని ముందే అనుకున్నాం. నా డిగ్రీ అక్కడే పూర్తి చెయ్యటం, స్నేహితులు అందరూ గుంటూరు వారే అవ్వడం, నేను వాళ్ళని కలిసి నేరుగా బస్టాండ్ కి వస్తానని నన్ను కలవటానికి వచ్చిన ఇద్దరి స్నేహితురాళ్ళతో వెళ్తానని అమ్మకు చెప్పి బయటపడ్డాం.
గుంటూరులో ఉన్న ఇంకో ముగ్గురిని కలిసి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయ్యింది. బస్టాండ్ లో అన్నయ్య, అన్నయ్య వాళ్ల స్నేహితులు (వాళ్ళు అన్నయ్యలే) నన్ను తినేసేలా చూపులు విసిరారు.
అమ్మ మామూలుగానే నిప్పులు చిమ్ముతుంది. ఇప్పుడు మన తప్పు వుంది కాబట్టి, ఇంకొంచెం ఎక్కువ. నన్ను ఏదైనా అన్నా, నేను బాధ పడకుండా వుండటానికి, నా స్నేహితులు నావెంట వచ్చారు (sweethearts).
అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని అనుకుంటూ అందరం (మాతో కలిపి పదమూడు మంది) రాజమండ్రి బస్సు ఎక్కాము. రాజమండ్రి దగ్గర మా అమ్మమ్మ ఊరు. రాత్రి తొమ్మిది అయ్యింది ఇంటికి చేరేసరికి, అందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు.
అందరం తినేసి, కబుర్లు చెప్పుకునే వాళ్ళు చెప్పుకున్నారు. అలిసిపోయిన వాళ్ళు నిదర్లు పోయారు. నా స్నేహితుడు (తమ్ముడు) వాడు వైజాగ్ లో P.G చేస్తున్నాడు. వాడు అక్కడ నుంచి రాత్రి రెండింటికి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.
వాళ్ళ అమ్మగారు గుంటూరు నుంచి మాతో వచ్చారు. పొద్దున్నే అయిదు గంటలకు అందరం దులుపుకుంటూ లేచి, రాజమండ్రి పుష్కర స్నానానికి వెళ్ళాం. చాలా ప్రశాంతంగా దర్శనం అంతా బాగా జరిగింది.
తిరిగి ఇంటికి వచ్చేసాము. నా స్నేహితుడు మాత్రం స్నానం, దర్శనం అయ్యాక వైజాగ్ వెళ్ళిపోయాడు. వచ్చాక అందరం విశ్రాంతి తీసుకున్నాం. తరవాత రోజు నేను అప్లై చేసిన ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి రమ్మని కాల్ వచ్చింది.
రాత్రికి  బస్సు బుక్ చేసి, నన్ను మా అన్నయ్యను పంపించేశారు. వెళ్ళినవారు అందరూ చుట్టు పక్కల కొన్ని ప్రదేశాలు చూసి రెండు రోజులు తరవాత వచ్చారు. అయితే, వచ్చేటప్పుడు గుంటూరు వెళ్ళే వాళ్ళని బస్సులో పంపించారు.
హైదరాబాదు వచ్చే  మిగిలిన నలుగురు రైల్లో వద్దామని నిర్ణయించుకుని, రైలు బయలుదేరే సమయం కన్నా రెండు గంటల ముందే వెళ్ళారు. రైలు ప్లాట్ఫారం మీదే వుంది. భోగిలు నిండా జనం, చివరి భోగికి వెళ్తే కాస్త రద్దీ వుండదు అనుకుని, చివరకి నడిచారు.చివర భోగి లో కూడా జనం కిక్కిరిసిపోయారు.
అమ్మా,చెల్లి ఆడవాళ్ళు కాబట్టి పోలీసువాళ్ళ అరుపులకి  లోపల జనం చోటు ఇచ్చారు (నుంచోడానికి) అంతకుముందే మేము ఇటు వైపు ఎక్కాము అని అన్నయ్య స్నేహితులు చెప్పారు. తీరా చూస్తే, అమ్మ వాళ్ళు ఇటు ఎక్కగానే, వాళ్ళు అటు నుంచి బయటకు వాళ్ళ ప్రమేయం లేకుండానే వచ్చేశారు. (ఆ సన్నివేశం వాళ్ళు చెప్తుంటే నవ్వులే నవ్వులు).
అంత రద్దీగా ఉందన్నమాట. ఇంక చేసేది లేక, ఇటు వైపు అమ్మ వాళ్ళు కాస్త వెనక్కి జరిగి, వాళ్ళ ఇద్దరినీ ఎక్కించుకున్నారు. అలాంటి ప్రయాణం నేను అన్నయ్య చెయ్యలేదు కానీ, ఇంటికి వచ్చాక వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
అదే నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒక పుష్కరం అంతమంది స్నేహితులతో కలిసి, ఒకే రోజు అందరినీ కలిసి, అందరితో ప్రయాణం చేసిన అరుదైన ప్రయాణం. నేను చేసిన ప్రయాణాలలో అద్భుతమైన ప్రయాణం ఇది. 
ఆనందాలు పుష్కలంగా ఆస్వాదించిన పుష్కరం.
– రాధికా.బడేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *