ప్రేమాంక్షలు

ప్రేమాంక్షలు

 

ప్రియా నిన్ను చూడాలని, నీతో ఎన్నో పంచుకోవాలని, నీతో కలిసి నడవాలని, నీలో సగమవ్వాలని అనుకున్నా, కానీ ఇవేవీ సాధ్యంకాదని అర్థమైంది.

కలవాలంటే కులాలను దాటలని, ఆచారాలను, సంప్రదాయాన్ని దూరం చెయ్యాలని, మతాల అడ్డుగోడలు తెంచాలని, కన్నవారిని వదిలేయాలని, మనది కాని ప్రపంచంలో మనం కలిసి బతకడం సాధ్యం కాదని, ఈ సమాజం లో మనలాంటి వారిని చులకన గా చూస్తారని…

సూటి పోటి మాటలతో గుండెలు ఛీలుస్తారని, కఠినమైన చూపులతో హత్య చేస్తారని, బతికి వుండగానే నడి బజారులో నిలబెడతారని, కష్టాల కడలిలో బ్రతుకులు భారం అవుతాయని, మనలాగే అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు పడుతున్న బాధలు చూసి, మనమూ అలాంటి బాధలు పడొద్దని…

సుఖంగా, సంతోషంగా, అందరిలో ఒకరిగా బతకాలని, మన ప్రేమను మర్చిపోయి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని, సంఘం లో చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని అనుకున్నా, అందుకే నిన్ను వదిలి దూరంగా వెళ్తున్నా..

ఇలా ఆలోచిస్తే నీ ప్రేమ ఇదేనా అని నీకు అనిపించవచ్చు, ఇంతేనా నన్ను అర్దం చేసుకుందని అనుకోవచ్చు, ఇన్నాళ్ళ మన ప్రేమకు నువ్వు చెప్పిన అర్దం ఇదేనా అనుకుంటే, ఇన్నాళ్లు తిరిగిన తిరుగుళ్ళు ఏమయ్యాయి, అప్పుడేవరూ అడగలేదా అంటే…

చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా అనుకుంటే, నీ సుఖం కోసం నన్ను వదిలేసావని నింద వేస్తే, అందరిలో మంచి అనిపించుకోవడానికి ఇలా చేశావు అని నువ్వు అనుకుంటే, అది ఖచ్చితంగా నీ తప్పే అంటాను నేను.

ఎందుకంటే …

ప్రియా… ప్రేమ అనంతం, అంతు లేనిది. అంతం లేనిది, కాల్చినా కాలిపోనిది. విసిరేసినా వాడిపోనిది ప్రేమ. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ బాగనే అనిపిస్తాయి. ప్రేమలో ఎలాంటి హద్దులు, అనుమానాలు ఉండవు. ఆంక్షలు ఉండవు, ఎంత ప్రేమించినా చివరికి పెళ్లే దీనికి పరమావధి.

కానీ ప్రియా ప్రేమ మైకంలో పెళ్లి వరకు వెళ్ళినా ఆ ప్రేమ మైకం తగ్గిన తర్వాత అన్ని తప్పులుగా, అనుమానాలు గా కనిపిస్తాయి. అప్పుడు లోకం, సంఘం, తల్లిదండ్రులు, తోబుట్టువులు అనే మాటలు నిజమే అనిపిస్తాయి. అప్పుడు మొదలవుతుంది నీలో నాలో అంతర్మధనం.

నేను చేసింది తప్పేమో అందుకే వీళ్ళు అంతా ఇలా అంటున్నరేమో అని, కులాన్ని, మతాన్ని, సంప్రదాయాన్ని తెంచుకుని నీ ఒక్కరి కోసం అన్ని వదిలేసి వచ్చాను అంటూ ఒకర్ని ఒకరం దూషించుకునే మాటలు…

నీ మతం తక్కువ, నా మతం ఎక్కువ అంటూ జీవితాన్ని గొడవలతో గందరగోళం చేసుకుంటూ, కలిసి ఉండలేక, విడిపోయి వెళ్ళలేక మధన పడుతూ, ఒత్తిడి తట్టుకోలేక అత్మహత్య లో, హత్యలో చేసే వరకు వెళ్లి జీవితాన్ని నరకం చేసుకోవడం అవసరమా అనిపించింది.

నువ్వు కూడా ఒక్కసారి ప్రేమలో నుండి బయటకు వచ్చి చూస్తే నా ఆలోచన సమంజసమే అంటావు. ఇది ముమ్మాటికీ నిజమే ప్రియా, ప్రేమలు అన్నం పెట్టవు, ఆస్తులు ఇవ్వవు. అందుకే చాలా మంది ప్రేమలు అంతం అవుతున్నాయి.

ఇప్పుడే కాదు గత కొన్నేళ్లుగా ప్రేమ కథలన్నీ విషాదాలు అవుతున్నాయి. కానీ నువ్వు మాత్రం దేవదాసు, షాజహాన్ లాగా మారకూడదు. నిజాన్ని గ్రహించు, నిమ్మళంగా ఉండు. ఉంటావని ఆశిస్తూ

– నీ, నా సుఖం కోరుకునే ఎప్పటికీ నీది కానీ నీ మాజీ ప్రేయసి..

– అంజలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *