పెంపకం
నాడు: తల్లిదండ్రుల పిల్లలను మూడున్నర కు నిద్రలేపి ఇంటి పనులు చేయించేవారు. అంటే గోవులకు గడ్డి వేయడం, పాలు పితకడం, గోషాలని శుభ్రం చేయడం వంటివి చేయించేవారు. ఆ తర్వాత పాలు అమ్మడానికి కూడా పిల్లలని పంపించేవారు.
పాలు అమ్మి వచ్చాక ఇంట్లో ఉన్నదేదొ తినేసి పుస్తకాలు తీసుకుని నాలుగైదు కిలోమీటరు దూరం లో ఉన్న పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను వల్లే వేస్తూ ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ వారికి సేవలు చేస్తూ చదువు నేర్చుకునేవారు.
చదువుకుంటే సంస్కారం అలవడుతుంది. గొప్ప ఉద్యోగాలు సంపాదించవచ్చు అనేది తల్లిదండ్రుల ఆలోచనతో ఎంత కష్టం అయినా పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ అన్ని పనుల్లో తల్లిదండ్రుల కి చేదోడు వాదోడుగా నిలుస్తూ తమ తెలివిని పెంచుకుంటూ ఉండేవారు. గురువులు అంటే అమితమైన భక్తి చూపేవారు.
మా రోజుల్లో అయితే మేము చదువుకునేటప్పుడు మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసేవారు. మా నాన్నగారు ప్రొద్దున మూడున్నరకే మమ్మల్ని నిద్ర లేపి పద్యాలు పాటలు భక్తి గేయాలు మాతో వల్ల వేయించేవారు. అలాగే పురాణాలు ఇతిహాసాలు లాంటివి కథల రూపంలో చెప్పేవారు.
సుందరకాండ, శ్రీ రామ చరితము, నరసింహ శతకము, లాంటివి మాతో చెప్పించేవారు అంటే తెల్లారుజామున బ్రహ్మ గడియల్లో చదవడం వల్ల జ్ఞానం అలవడుతుంది అని చదివించేవారు. ఆ రోజుల్లో గురువులంటే అంత భక్తి, శ్రద్ధ ఉండేవి. ఈ మధ్యనే అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
అప్పుడు మేము మాకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకున్నాం,సన్మానించుకున్నాం. అప్పుడు మా గురువులు ఒక మాట చెప్పారు. ఇంతవరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనం చేశారు. కానీ మీలాగా గురువులను ఎవరూ పొగడలేదు అన్నారు. మీ అందరూ బాగుండాలి అంటూ దీవించారు.
ఇంతకన్నా ఒక విద్యార్థికి ఇంకేం కావాలి. మా ప్రవర్తన అలా ఉంది కాబట్టి మా గురువులు అంత పెద్ద మాట అంటూ మమ్మల్ని ఆశీర్వదించారు. అప్పుడు గురువులకు ఉన్న విలువ, చదువుకున్న విలువను గుర్తించి మేము వారిని పూజించుకున్నాము కాబట్టి ఆ గురువులు కూడా ఎంతో అనుభవం ఉన్నవారు కాబట్టి మమ్మల్ని మెచ్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఒక విద్యార్థికి గురువు ఆశీస్సుల కన్నా మించిన సంపద ఏముంటుంది.
మరి నేడు: ప్రొద్దున ఏడవుతున్న ఇంకా బెడ్ దిగని పిల్లలను తల్లి చిరాకు పడుతూ నిద్ర లేపడం, వాళ్ళేమో బద్దకంగా ఉందంటూ నిద్రలేచి టీవీ ముందు కూర్చుంటారు. మరోవైపు పాఠశాలకు సమయం అవుతున్నా, ఇంకా బ్రష్ కూడా చేయరు. పాపం ఆ తల్లి మాత్రం బ్రష్ చేయించి ఉన్నదేదో పెట్టి ,రెడీ చేసి స్కూలుకు పంపుతుంది.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు సంపాదిస్తే కానీ పిల్లల ఫీజులు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఉద్యోగస్తులుగా మారి పిల్లలను స్కూలుకు పంపిస్తున్నారు. అయితే పిల్లలు ఈ చదువును సార్ధకం చేసుకుంటున్నారా ? నిజంగా చదువుకుంటున్నారా ? అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఐదో తరగతి వచ్చేవరకు పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లుగానే బుద్ధిగా స్కూలుకు వెళ్లి, హోంవర్కులు చేసి చదువుకుంటారు ఆ తర్వాత మొదలవుతుంది అసలు సమస్య.
ఆరో తరగతిలోకి వెళ్ళగానే అప్పటికే కాస్త జ్ఞానం తెలిసిన పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటి పని సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటుంటారు. ఎందుకు చేయలేదు అని ఉపాధ్యాయులు దండిస్తే మాస్టారు నన్ను కొట్టారు అంటూ తల్లిదండ్రులను గొడవలకు తీసుకొని వస్తారు. ఆ తల్లిదండ్రులు పిల్లాడి పైన ఉన్న ప్రేమ తో ,ఏమి ఆలోచించకుండా, ఉట్టి పుణ్యానికి మా పిల్లాడిని కొడతావా అంటూ పదిమందిని వేసుకోవచ్చి ఆ ఉపాధ్యాయుని నిలదీసి నలుగురిలో అవమానిస్తారు.
దాంతో ఆ పిల్లాడికి ఆ ఉపాధ్యాయుడు మీద కానీ మిగిలిన ఉపాధ్యాయుల మీద కానీ ఉండే గౌరవం అనేది పోతుంది. దాంతో ఉపాధ్యాయుడు అంటే చులకన భావం ఏర్పడి తానేం చేసినా తన తల్లిదండ్రులు చూసుకుంటారు అనే ఒక నమ్మకం ఏర్పడి ఉపాధ్యాయులకు విలువ ఇవ్వకుండా వారు చెప్పింది చేయకుండా తన ఇష్టారీతిన పెరుగుతారు.
వంశాన్ని పెంచే ఒకే వారసుడు కాబట్టి తల్లిదండ్రులు కూడా వాడు ఏం చేసినా కూడా అడ్డు చెప్పకుండా వాడిని వెనకేసుకొస్తూ ఉంటారు. వాడి అరాచకం పెరిగిపోయి ఎనిమిదో తరగతిలోనే సిగరెట్లు తాగడం, గంజాయికి అలవాటు పడడం, ఆ తర్వాత మందుకు అలవాటు పడడం, అమ్మాయిలపై ఆకృత్యాలు చేయడం వంటివి నేర్చుకుంటాడు.
పిల్లాడు అడగగానే వేలకు వేలు పోసి పుస్తకాలు, పెన్సిళ్లు ,రంగుల కాగితాలు, రకరకాల మెటీరియల్స్ కొన్ని ఇవ్వడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అన్నట్టు అడగగానే కొనిస్తారు , కానీ ఉద్యోగం అన్వేషణలో పడి తల్లిదండ్రులు తమ కొడుకు ఏం చదువుతున్నాడు ? ఏం చేస్తున్నాడు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం.
మేము ఈ సుఖాలన్నీ అనుభవించలేదు. కనీసం మా కొడుకు అయినా ఈ సుఖాలు అనుభవించాలి అని తల్లిదండ్రులు అనుకోవడంలో పొరపాటు లేదు. కానీ దాన్ని ఎంతవరకు తమ కొడుకు సద్వినియోగం చేసుకుంటున్నాడు అని చూడడం మాత్రం తల్లిదండ్రుల బాధ్యత. ఆ విషయంలో తల్లిదండ్రులు ఓడిపోతున్నారు అని అనుకోవచ్చు.
విపరీతమైన గారాబంతో అడిగిందల్లా కొనిపెడుతూ ఒక విధంగా ఒళ్ళు పెరగడానికి, పిల్లాడి ఆరోగ్యం పాడవడానికి., అతని ఆలోచనలు పెడదారిలో ఉండడానికి కారణం తల్లిదండ్రులే అని అనుకోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు మేము కష్టపడి పైకి వచ్చాము. అలాగే మా పిల్లలు కూడా కష్టపడాలి అనే ఆలోచన రావడం చాలా అరుదు. అలా వచ్చిన తల్లిదండ్రుల పిల్లలు కూడా వాళ్ళ బాటలో నడుస్తూ కష్టపడి చదువుకొని మంచి మంచి మార్కులు సాధిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.
అయితే కొందరు మాత్రం తాము పడ్డ కష్టాలు తమ కొడుకుల పడకూడదు అని అతి గారవం చేస్తూ అన్ని సమకూరుస్తూ అన్ని సమకూరుస్తున్నాం అనే భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప, పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్లకి స్నేహితులుగా మారి ఈరోజు నువ్వు ఏం చదువుకున్నావ్ ? నీ మార్కుల లిస్టు ఏది ? అని అడిగే సమయం వారికి లేకుండాపోతుంది.
ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్లకు ప్రెషర్ ఉండడం వల్ల దేన్నీ సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు. అందువల్ల ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు కాబట్టి మేమేం చేసినా చెల్లుతుంది అని అనుకుంటూ డబ్బు అందుబాటులో ఉండడం వల్ల వాళ్లు చెడు వ్యసనాలకు లోనై, చెడు మార్గాల్లో వెళ్తూ తమ జీవితాన్ని ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ఒకప్పుడు తండ్రి ,తల్లి కష్టంలో పాలుపంచుకొని ఉన్నదాంట్లో సర్దుకుని, గురువులను సేవిస్తూ, గురువులను పూజించి, భక్తితో చదువు నేర్చుకునే వారు ఉండేవారు. అయితే ఇప్పుడు గురువు అంటే జస్ట్ ఫ్రెండ్, చిల్ ఫ్రెండ్ అనుకుంటూ నాగరికత పేరుతో గురువులను కొట్టే స్థాయికి ఎదుగుతున్నారు. దీంట్లో సినిమాల ప్రభావం కూడా అంతో ఇంతో ఉంటుంది. లెక్చరర్స్ ని ఏడిపించడం, కామెడీగా జుట్టు పీకడం లాంటివి సినిమాల్లో చూపిస్తుండడం వల్ల అదే నిజమని చాలామంది పిల్లలు నమ్ముతున్నారు.
వందమందిలో 10 శాతం మంది మాత్రమే కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. మిగిలినవారు ఇలా అతిగారాభంతో చెడిపోతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఉపాధ్యాయుడు తమ పిల్లలను కొడితే ఎందుకు కొట్టావ్ అంటూ ఉపాధ్యాయుల మీదికి దండెత్తి రావడం తల్లిదండ్రులకు పరిపాటి అయింది. కానీ తమ కొడుకు ఏం తప్పు చేశాడో? ఎందుకు శిక్షించారో తెలుసుకునే అంత తీరిక కూడా ఎవరికి ఉండడం లేదు.
నిజంగానే తమ కొడుకు తప్పు చేస్తే ఆ ఉపాధ్యాయుడికి క్షమాపణ చెప్పి తిరిగి దండించమని కోరాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తల్లిదండ్రులు ఇంత విశాలంగా ఆలోచించడం లేదు. కారణం అతి ప్రేమ కావచ్చు, లేదంటే ఈ స్కూలు కాకపోతే ఇంకో స్కూల్లో వేస్తాం అనే డబ్బు మదం కావచ్చు, ఏది ఏమైనా మొక్కై వంగనిది మానై వంగదు. కాబట్టి మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి.
ఆ విషయాన్ని విస్మరించి తల్లిదండ్రులు అతి గారాబం వల్ల తమ పిల్లల్ని చెడగొడుతున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది ఇదే. ఏ ఉపాధ్యాయుడైన తిరిగి ప్రశ్నిస్తే డబ్బులు కట్టడం లేదా జీతాలు తీసుకోవడం లేదా అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు.
కానీ ఆ తర్వాత విద్యార్థి జీవితం ఎలా మారిపోతుందో అనేది వాళ్లు తెలుసుకోలేకపోతున్నారు. చెడు ఎదురైనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఆ చెడును ప్రోత్సహించింది వాళ్లే కాబట్టి ఆ తర్వాత వాళ్లే బాధపడడం కూడా కద్దు. అదే ఈ రోజుల్లో అయితే చదువు చెప్పిన గురువులు కనిపిస్తే కాలర్ ఎగిరేయడం, ఉమ్మడం వంటివి చేస్తూ అదే హీరోయిజం లా ఫీల్ అవుతూ ఉంటారు.
కానీ వినాశకాలే విపరీత బుద్ధి అని గురువులు అనుకుంటూ వెళ్లిపోతారు. గురువుల శాపానికి గురైన వారు ఎప్పటికీ బాగుపడలేరు అని తెలుసుకుంటే మంచిది. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది కాబట్టి మనం గురువులను పూజించుకోవాలి అనేది ఈ తరం విద్యార్థులకు తెలియని విషయం. ఎందుకంటే వారి పెంపక లోపం అలా ఉంటుంది కాబట్టి దీని అంతటికి కారణం తల్లిదండ్రులే.
డబ్బు సంపాదనలో పడి తమ ఒక్కగానొక్క కొడుకు కూతురు విషయంలో అతిగారాభం చేసి చివరికి తలలు పట్టుకోవడం ఏం లాభం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కాబట్టి తల్లిదండ్రులు ఇకనైనా మేల్కోండి మీ పిల్లలకు చదువు విలువను, గురువుల విలువను నేర్పించండి.
– భవ్యచారు