పీక కూతతో తప్పిన పీక కోత
కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తున్నాడు రాజు.. వేగంగా వెళ్తున్న ఒక ఇసుక లారీ అతని సైకిల్ ని గుద్దేసి ఆపకుండానే ముందుకు దూసుకొని వెళ్ళిపోయింది. అతని తలకు బలమైన గాయం అవ్వడంతో విపరీతంగా రక్తస్రావం అవుతోంది. ఇంతలో ఎవరో ఒక దయగల మహానుభావుడు ఈ విషయాన్ని ఆంబులెన్స్ నిర్వాహకులకు తెలియజేశాడు.
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి రాజుకి మాట్లాడడానికి శక్తి చాలటం లేదు. అక్కడ గుమిగూడిన వాళ్ళలో ఒకరికి చేతివేళ్ళు చూపుతూ దగ్గరికి పిలిచాడు. ఆ మనిషి లో ఎక్కడో మానవత్వం ఉంది.. దగ్గరికి వెళ్లి ‘చెప్పండి’ అన్నాడు..
రాజు తన షర్ట్ జేబులో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని బయటికి తీయ వలసినదిగా అతనిని కోరాడు. రాజు కోరిన విధంగా ఆ పుస్తకాన్ని తీసి తెరిచాడు ఆ మానవతావాది. అందులో అన్నీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి.
” చెప్పండి సార్ ఇందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఏమి చేయమంటారు?” అని అడిగాడు.
ఓపిక తెచ్చుకొని, “అందులో వర్మ అనే పేరు ఉంటుంది. అతడు నా ప్రాణ స్నేహితుడు. అతనికి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేయండి” అన్నాడు రాజు.
*********
రాజు మరియు వర్మలు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వర్మ అందరికీ దూరంగా ముంబైలో స్థిరపడ్డాడు. రాజు చదువులో పెద్దగా రాణించలేక పోవడంతో, ఒక చిన్న కిళ్ళీ షాపు నడుపుతున్నాడు.
వర్మకి చిన్నప్పటి నుంచి డబ్బు బాగా సంపాదించాలి అనే కాంక్ష విపరీతంగా ఉండేది. అలానే ఆయన ప్రయత్నాలు కూడా ఉండేవి. అతని వయసు 20 ఏళ్ళు నిండకముందే డబ్బులు బాగా సంపాదించి సమవయస్కులు ఎవరూ అనుభవించని భోగాలను ఆయన అనుభవించాడు.
కానీ వర్మ రాజు కి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చాడు తన మనసులో. రాజుని కూడా తనలాగా మార్చడానికి విశ్వప్రయత్నాలు చేశాడు వర్మ. తర్వాత వివాహాలు. దిశలలో మార్పులు.
**********
ఆ రోజు సంత. వాస్తవానికి రాత్రి 9 గంటల వరకు రద్దీగా ఉంటుంది కానీ చలికాలం కావడంతో మందితో పాటు వ్యాపార స్థావరాలు పలుచ పడ్డాయి.
” బాబు మీ దగ్గర బాలు బ్యాటు ఉన్నాయా? ” అని అడిగాడు రాజు వెళ్తున్న చక్రాల బండి వాడిని ఆపి.
” ఉన్నాయండి”, అని సమాధానం చెప్పాడు ఆ వ్యాపారి.
” కాస్త అవి రెండూ ప్యాక్ చేసి ఇవ్వు. అలానే ఒక విజిల్ (పీక) కూడా ఇవ్వు. మా అబ్బాయి చాలా రోజుల నుండి గగ్గోలు పెడుతున్నాడు” అన్నాడు రాజు.
ఆ వ్యాపారి బ్యాటు బాలు ప్యాక్ చేస్తుండగా, వర్మ తన బండిని ఒక పాన్ షాప్ ముందు ఆపాడు. అతడు ఒక సిగరెట్ తీసుకుని రెండు దమ్ములు గట్టిగా లాగాడు. అప్పుడు సమయం తొమ్మిది కావస్తోంది. చిన్న గ్రామం కావడంతో దాదాపుగా రోడ్డు నిర్మానుష్యంగా మారింది.
“అరే, ఆ వెధవ జూడు ఒక్కడే సిగరెట్ పీల్చేస్తున్నాడు! ఎలాగో నేను అటే కదా వెళ్లి కలుస్తాను” మనసులో అనుకున్నాడు రాజు.
ఇంతలో ఒక ఐదుగురు వర్మని ఎటాక్ చేశారు. అంటే ఏదో హెచ్చరిస్తూ కొంచెం దూరంలో ఉన్న పూర్తి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారు.
వర్మ మొహంలో ఆందోళన విపరీతంగా కనిపిస్తోంది. ఆ గుంపులో ఒకడు దురుసుగా వర్మ ని ముందుకు తోస్తూ ఉండడం కనిపించింది రాజుకి.
“బాబు, ప్యాకింగ్ రెడీ” అన్నాడు, వ్యాపారి. అలా రెండు మూడు సార్లు ‘ బాబు, బాబు’ అని పిలిచాడు. ఏదో ఒకటి చేయాలి అని అనుకునే లోపు ఆ గుంపు వర్మ ని తీసుకొని చీకట్లో కలిసిపోయింది. ఆ ప్రదేశమంతా దట్టంగా పెరిగిన తుమ్మ చెట్లు వ్యాపించి ఉంటాయి.
“నేను ఒక్కడిని మాత్రం ఏమి చేయగలను? కానీ ఏదో ఒకటి మాత్రం చేయాలి. నా మనసు కీడు శంకిస్తోంది. వాడు నా ప్రాణం. వాడిని నేను కాపాడుకోవాలి” ఆవేదనతో రాజు తనలో తను మాట్లాడుతున్నాడు.
“బాబు, ఇదిగోండి మీ ప్యాకెట్. డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. మీరు అడిగిన పీక ను కూడా ఇందులో వేసి ప్యాక్ చేశాను” అన్నాడు వ్యాపారి.
ఒక్క ఉదుటన ఆ ప్యాక్ లాక్కున్నాడు రాజు. ఆ వ్యాపారికి డబ్బులు ఇచ్చేసి పొమ్మని, వాడు ఇంకా వెళ్లకముందే ప్యాకెట్ అంతా చింపేసి విజిల్ (పీక) ను మాత్రం షర్ట్ జేబులో పెట్టుకున్నాడు.
మిగిలిన ప్యాకింగ్ వస్తువులతో అక్కడే వదిలేసి ఆ చీకటి వైపు వేగంగా సైకిల్ తొక్కుతూ నోట్లో పీక పెట్టుకుని ఊపిరంత గట్టిగా బయటికి వదులుతూ చీకట్లో కి దూసుకెళ్ళాడు రాజు.
బిత్తరపోయి చెమటలు కక్కుతూ వర్మ ఒక్కడే ఒక శిలావిగ్రహం లాగా నిల్చొని ఉన్నాడు అక్కడ.
“ఒరేయ్ వర్మ ఎవరు వాళ్ళు? నిన్ను లాక్కొని ఈ చీకట్లోకి వాళ్లు నిన్న తేవడం చూశాను”.
“నీ విజిల్ విని పోలీసులు అనుకొని తుమ్మల లోకి పారిపోయారు” అని చెప్పాడు వర్మ.
“ఎందుకు తెచ్చారు నిన్ను వాళ్ళు ఇక్కడికి? ” అని అడిగాడు రాజు.
” పీక కోయడానికి” అని చెప్పాడు వర్మ.
“వాళ్ళ చావు వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఈ తుమ్మల లో ఎండిపోయి పడి ఉన్న ముళ్ళు వాళ్ళ శరీరాలని రక్తసిక్తం చేసి ఉంటాయి ఈపాటికి. ఇంతకీ, ఎవరు వారు? ” అని అడిగాడు రాజు.
పాను డబ్బా దగ్గర ఇద్దరు సిగరెట్ల ముట్టించి గట్టిగా ఒక దమ్ము లాగారు. అప్పుడు చెప్పాడు వర్మ….
“వాళ్లు ఎవరో, నాకు తెలియదు..” అని.
***********
రాజు షర్టు జేబులో నుంచి ఆ బుక్కు తీసిన వ్యక్తి, వర్మకి ఏం జరిగిన విషయమంతా విపులీకరించాడు.
రెండు రోజుల తర్వాత గానీ వర్మ ఆ గ్రామానికి చేరుకోలేక పోయాడు. గ్రామం చేరిన వెంటనే వర్మ రాజు ఇంటికి వెళ్ళాడు. రాజు ఫోటోకి వేలాడుతున్న పూలదండను చూసి వర్మ బిగ్గరగా ఏడ్చేశాడు.
“ఇక మాటలు మాట్లాడి ప్రయోజనం లేదు” అనుకున్నాడు మనసులో.
“వదినమ్మా… రాజు ఇద్దరు బిడ్డల చదువుల పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను” అని భరోసా ఇచ్చాడు ఆమెకి.
రాజు నడుపుతున్న ఆ కిళ్ళీ షాపుని అన్ని హంగులతో తీర్చిదిద్ది దాన్ని రాజు బావమరిది కి అప్ప చెప్పాడు.
ఇలా స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పాడు వర్మ. చివరికి మిగిలేది స్నేహం ఒక్కటే!!
– వాసు