పల్నాడు కథలు పుస్తక సమీక్ష
పల్నాడు పౌరుషాన్ని చూపే కథలు
కొన్ని కవర్ పేజీలే చాలా ఆకర్షిస్తాయి. అలా ఎండబెట్టిన మిరపకాయలతో కూడిన ఫోటోతో ‘పల్నాడు కథలు’ చూడగానే ఆకట్టుకుంది. ఇప్పుడంతా ఎవరి ప్రాంతం కథలు వారు చెప్పుకుంటున్న కాలంకదా.
అసలు ఏ ప్రాంతమైనా తనదైన స్టాంపు భాషతోనే వేస్తుంది.అనుబంధంగా ఆ ప్రాంత కళలు, రుచులు తనవంతు పాత్ర పోషిస్తాయి. పల్నాడు ప్రాంతానికి గేట్ వే లాంటిది నరసరావుపేట.
ఆ ప్రాంత వాసులు ‘పేట’ అని పిలుచుకునే ఊరు. నరసరావు పేట చుట్టుపక్కల ఊళ్ళలోని జీవితాలు పరిచయం కావాలంటే పల్నాడు కథలు చదవాలి.
పల్నాడు కథలు రచయిత్రి “వేల్పూరి సుజాత” ఈ కథల్లో తన ప్రాంత అస్తిత్వాన్ని పరిచయం చేస్తారు. అందుకే ఈ కథలలోని పాత్రలు నేరుగా పాఠకుడితో సంభాషిస్తాయి. తమ కష్టాలపై సాగించిన పోరాటాన్ని పంచుకుంటాయి.
అందుకే కాల్పనిక సాహిత్యం అనేకన్నా అనేక మంది స్త్రీలు తమ అనుభవాలను చెప్పుకుంటాయనటం కరెక్ట్. పల్నాటి ప్రాంత నుడికారం మిరపఘాటులా ముక్కుకు సోకుతుంది.. అక్కడి జీవద్భాషను ఈ కథల్లోని పాత్రలు మాట్లాడి ఉండకపోతే ఇవి మామూలు కథలయ్యేవి..
ఈ కథలలోని ప్రధానపాత్రలందరూ పోరాడటంతోనే జీవితాన్ని గెలుద్దామనే దృక్పథంతో ఉంటారు. పల్లెల్లో కాయకష్టం చేసే స్త్రీలలో తొణికిసలాడే ఉత్సహముంటుంది. జీవితంలో ఎదురయ్యే తొక్కిసలాటను తప్పించుకోవటం తెలిసినవారు.
గతాన్ని తలుచుకునే నాస్టాల్జియా పెద్దగా కనబడదు. ఒక్క కథ గుండెగూడురిక్షా మాత్రం దీనికి మినహాయిపు. రిక్షా లాగి జీవితాన్ని పోషించిన తిరపతి తన చివరి రోజుల్లో రిక్షా తొక్కాలని తన పాత రోజుల్లోకి వెళ్లాలని సంబరపడతాడు.
పరిస్థితులు మారాయి. వయసు సహకరించదన్న ఎరుక ఉండదు. ఇలాంటి సమయంలో కొడుకు, తండ్రి ఇతరుల మధ్య సాగే వాదోపవాదాలను రచయిత్రి చాలా రా(raw) గా చిత్రిస్తారు. నాటకీయత ఉంటుంది.
కానీ కృత్రిమంగా ఉండదు. రిక్షాలు కనుమరుగై పోయి ఆటోలు పల్లెల్లోక్కూడా వచ్చేశాక ఆ రిక్షా నడిపే మనుషులేమయిపోయారు, వారి మధన ఎలా ఉందో చెప్పే కథ. మారుతున్న వర్తమానంలో గతం తాలూకు జ్ఞాపకమొకటి నిలిపే కథ.
పల్నాడు ప్రాంతంలో బాంబుల తయారీ కొత్తేమీ కాదు. నాలుగు డబ్బులకాశపడి ఆ బాంబులను టిఫిన్ డబ్బాలో చేర్చే ఓ మహిళ నాగలక్ష్మి ఒకసారి పోలీసులకు దొరికిపోతే కేస్ బుక్ చేస్తే తన బాధను చెప్పినప్పుడు సి.ఐ.అబ్రహం లింకన్ తో పాటు మనమూ కరిగిపోతాం.
“తప్పో ఒప్పో నాకు తెలవదయ్యా! నా పిల్లలు, మాయత్త, నాలుగు ముద్దలు తినాలి, ఆళ్ళునా బుజాల మీదుండారయ్యా కేసు రాత్తావా? రాసి పార్నూకు! ఏమైతే అది అయిద్ది! అలా నాగలక్ష్మి పాత్రలోని ఈ తెగింపు చాలా సహజంగా కనిపిస్తుంది.
మరో కథ సైదమ్మ వీలునామాలో కూడా ఇలాంటి తెగింపు సైదమ్మ ప్రదర్శిస్తుంది. పిల్లలు కలగలేదని మొగుడు రెండోపెళ్ళి చేసుకుంటాడు. నేనేం దొంగతనం సెయ్యట్లా, లంజతనం అంతకంటే సెయ్యట్లా ! రెక్కలిరిచి కష్టం చేసుకుంటున్నా అన్న సైదమ్మ ముప్ఫై ఏళ్ళ కష్టంతో గుడిసె, తోట సంపాదించుకుంటుంది.
దానిమీద కన్నేసిన సవతి కొడుక్కు ఇస్తుందా, పిన్నాం అని పిలిచే సామ్రాజ్యానికిస్తుందా అన్నది క్లైమాక్స్. ఈ మధ్యలో గడచిన జీవితం.. అందులోని పోరాటం పాఠకుడికి కొత్త ప్రపంచం.
పల్నాడు ప్రాంతంలో రికార్డింగ్ డాన్సులెక్కువనుకుంటా. ఆ నేపథ్యంతో రెండు కథలున్నాయి. ఒకటి మీ సంబంధం మాకు నచ్చలేదు. ఇంకోటి సీత అలియాస్ జూనియర్ విజయశాంతి..
మొదటి కథలో ఫేమస్ రికార్డింగ్ డాన్సర్ మనవరాలిగా ఒక సంప్రదాయ అడుగుబెట్టాల్సిన సమయంలో ఆ కుటుంబం చేసిన కామెంట్స్ తో తనకీ సంబంధం కుదరదు అన్న బోల్డ్ నిర్ణయం తీసుకున్న మోహిత కథ.
రెండవది రికార్డింగ్ డాన్సర్ ల జీవితాల్లో ఉండే కుదుపుల గురించి. తండ్రితో ఆట్టే సంబంధంలేని సీత సమయం వచ్చినప్పుడు అండగా తండ్రి ఉండటం, కాంట్రాక్టర్ల వేధింపులు, ప్రేమకబుర్లు అన్నీ కలబోసిన కథ.
ఇవేకాకుండా ఇంకా చాలాకథలు మనలను పలకరిస్తాయి. స్త్రీని లైంగిక వస్తువుగా చూసే మగవారున్నట్టే సాయం చేసే వాళ్ళూ ఉన్నారని కొన్ని కథలు నిరుపిస్తాయి. మెజారిటీ కథలు ఆకట్టుకునేవే.
పేరుకు తగ్గట్టే రచయిత్రి కథాగమనానికి ఎంచుకున్న భాష కథనాన్ని పరిపుష్టం చేసింది. వస్తువు ఈ కథలకు ప్రాణం.. కథను కాంప్లికేషన్స్ లేకుండా స్ట్రెయిట్ నేరేషన్ తో నడిపించటం వలన పాఠకుడు ప్రతి కథను ఆస్వాదిస్తూ సాగుతాడు.
మంచి ప్రింట్ క్వాలిటీ పుస్తకానికి వన్నె తెచ్చింది.. రచయిత్రి “వేల్పూరి సుజాత” గారికి అభినందనలు…
– సి.యస్.రాంబాబు