పగబూనకే….!
ఎంతజాణవే నెరజాణవే…
ఎంతని చెప్పను ఆగడాలను…
ఎవరికి చెప్పను నీ బండారాన్ని…
మనుషుల్లో మృగాలైన మగాళ్ళైతే….
ఆడా పెచ్చుమీరిపోతున్నారు హవ్వ…
ఎంత శుభ్రం చేసినా ఏమూలన దాగుంటావే వగలాడి…
కంటికి కానక ఒళ్ళంతా తూట్లు పొడుస్తావు…
కుట్టికుట్టి కందిపోయేలా వేసి దురదపుట్టిస్తావు…
నీవొకచోటుంటూ దురదింకోచోట పుట్టిస్తూ…
దోబూచులాటలేమిటే నంగనాచీ…
కమ్మని కలలో నేనుంటే గుయ్యని నీ సంగీతాలేమిటే…
చెవిలో నసపెట్టి కలలన్నీ కల్లలు చేస్తావు…
నీకోసమని కాయిల్ వెలిగిస్తే అత్తరువాసనలా ఎంజాయ్ చేస్తావు…
మాకేమో దగ్గులని బహుమానాలిస్తావా….
బుద్ధిలేదటే నీకు కుయుక్తుల కుంకా…
ఎంతని వేచి చూడను నీ ఆగడాలను…
ఆకతాయిగా అల్లరులు చేస్తుంటే…
నావల్లకాక టప్పున కొట్టానంతేనే…
చటుక్కునచచ్చావు నాపై పగతీర్చుకోబోకు….
నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తానే….
– ఉమామహేశ్వరి యాళ్ళ