ఓటమి అంటే నాకిష్టం
ఎవరైనా గెలుపునే కదా ఇష్టపడతారు..కానీ వీడేంటి ‘ఓటమి అంటే నాకిష్టం’ అంటున్నాడని మీకు సందేహం కలగొచ్చు.. నేనలా ఎందుకన్నానో తెలియాలంటే.. ఓటమితో నా ప్రయాణంలో ఓ సంఘటన గురించి మీకు చెప్పాలి.
ఒక రోజు మా పాఠశాలలో ఒకమ్మాయి తోటి విద్యార్థిని చెంపమీద కొట్టింది.. ఏమైందని అడిగితే వాడు ఏడిపిస్తున్నాడని చెప్పింది. నిజమేనేమో అనుకున్నామంతా.. విషయం ప్రధానోపాధ్యాయులవారికి తెలిసింది.. ఇద్దరినీ పిలిచి మాట్లాడి, ఆ అబ్బాయిని వారం రోజుల పాటు పాఠశాలకు రావద్దన్నారు.
ఆ తరువాత ఆరా తీస్తే, వాడు ఆ అమ్మాయిని పాఠశాల ఆవరణలో ఏడిపించలేదు. బయట ఎక్కడో ఏదో అన్నాడని అభియోగం. కానీ దానికి కూడా ఎలాంటి సాక్ష్యం లేదు. అలాంటప్పుడు వాడినే శిక్షించడమేంటనే వాదన మొదలైంది. అప్పటికి నేను స్కూల్ పీపుల్ లీడర్ (ఎస్పీఎల్) గా ఉన్నాను.. లీడర్ ఎలా అయ్యానో మరో సందర్భంలో చెబుతాలేండి.. అదో పెద్ద కథ.
మా సోషల్ టీచర్ ఇంటిలోనే నేనూ కొంతమంది సమావేశం అయ్యాం.. ఆమె మాలో చైతన్యాన్ని తెచ్చి విప్లవాన్ని రగిల్చారు. ఇంకేముంది ఉదయం పాఠశాల గేట్లకు తాళాలు వేసి సమ్మె ప్రకటించాం. పదోతరగతి విద్యార్థులు సమ్మె చేపట్టడం జిల్లాలో పెద్ద సంచలనమైంది.
తరగతులు జరగడం లేదు. ప్రతీ విద్యార్థి గేటు ముందే కూర్చుని.. సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేస్తున్నారు. వారిలో తెలిసీ తెలియని మాటలతో గర్జిస్తున్న నా ప్రసంగాలు మరింత స్ఫూర్తి నింపుతున్నాయి.
విషయం చాలా పెద్దదైంది జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. మాతో మొదటిరోజు చర్చలు విఫలమయ్యాయి. మూడు రోజులకు మరోసారి చర్చలు జరిగాయి. ఆ అబ్బాయిని తరగతులకు అనుమతించారు.. మేం విజయం సాధించాం. చివరికి సమ్మె విరమించాం. మా అందరిలో అప్పుడొచ్చిందొక విజయగర్వం.
సరిగ్గా రెండు రోజులకు పరీక్షలు.. ఈ సమ్మెలో పడి పుస్తకం తెరవలేదు.. పరీక్ష ఉందనే గుర్తే లేదు. పరీక్షలు రాసేశాం.. పేపర్లు వచ్చాయి.. మా తెలుగు మాస్టారు మార్కులు చెబుతూ..
“ఏ సెక్షన్ వాళ్లు చాలా పెద్దవాళ్లు.. మార్కులు ఎంత బాగా వచ్చాయో.. అందరికీ ఒకట్లు, రెండ్లు.. ఇదిగో ఈ ఎస్పీఎల్ గారికైతే గుండు సున్నా.. అయినా మిమ్మల్ని ఏమీ అనకూడదు.. ఎందుకంటే మీరంతా లీడర్లుమరి.” అంటూ మామూలుగా దెప్పిపొడవలేదు.
ఆ అవమానానికి గర్వం మాయమైంది. ఆ క్షణం సిగ్గుతో తలదించుకున్నామంతా.. కానీ ఆ సమ్మె సంఘటన మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. చిన్నతనంలోనే నన్ను నాయకుడిగా తయారు చేసింది. ఆ రోజు ఆ సంఘటనతో నేర్చుకున్న గుణపాఠాలతో ఈరోజు వరకూ బతుకు నిత్య పరీక్షల్లో విజయం సాధిస్తూనే ఉన్నాను..
సున్నా నుంచి తేరుకుని విశ్వవిద్యాలయం ర్యాంకు వరకూ వెళ్లి విద్యలో అనుకున్నది సాధించడంతో పాటు వృత్తిలో ఉన్నతంగా నిలబడ్డాను.. అందుకే నాకు ఓటమి అంటే ఇష్టం.. అది లేకపోతే ఈ రోజు నా గెలుపు లేదు. నా ఈ రచన లేదు.
– ది పెన్