ఒక దివ్య కథ

ఒక దివ్య కథ

మొన్న ఒక కథ చెప్పాను గుర్తుందా సరే లేకపోతే నేనే గుర్తు చేస్తాను లెండి. కథ పేరు నిజానికి నిందలెక్కువ అని, గుర్తుందా లేకపోతే మళ్లీ లింక్ ఇస్తాను చదవండి. దానికి మరో కొనసాగింపు గా ఈ కథ ను చదవండి. అందులో ఇద్దరూ మిత్రులు మరో ఆవిడ గురించి చెప్పాను కదా ఇది ఇంకో రకమైన కథ.. మరి ఆ కథలోకి వెళ్దాము…

అందమైన కుటుంబం భార్య, భర్త తన చిన్న పిల్లలతో హాయిగా సంతోషంగా ఒక చిన్న పల్లెటూర్లో కాపురం చేస్తోంది దివ్య. తను బాగానే చదువుకుంది అయినా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తన భర్త తన ఇష్టా ఇష్టాలను గౌరవిస్తాను అని మాట ఇవ్వడంతో అలాగే తనకు పల్లెటూర్లో ఉండడం అంటే చాలా ఇష్టం అవడం వల్ల ఈ పెళ్లికి ఒప్పుకుంది.

దివ్య అత్తమామలు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళకి నలుగురు కొడుకులు తప్ప అబ్బాయి అమ్మాయిలు లేరు కాబట్టి దివ్యను కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలా వారి ప్రేమలో మునిగి తేలుతూ ఉండిపోయింది దివ్య. దివ్య భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు అందుకే అతనికి ఎప్పుడూ బిజినెస్ టూర్స్ ఉండేవి.

అయినా దివ్య అతన్ని ఏమీ అనేది కాదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం ఉంది కాబట్టి భర్త ఎన్ని రోజులు వెళ్లినా తన ఇంటిని, అత్తమామల్ని, పిల్లల్ని ఎంతో మంచిగా చూసుకుంటూ వారికి సమయానికి అన్నీ అందిస్తూ గడపసాగింది.

అయితే అది చిన్న పల్లెటూరు కాబట్టి అప్పట్లో అంటే పిల్లలు పుట్టేంతవరకు వారికి ల్యాండ్ ఫోన్ తప్ప మరే ఫోనూ ఉండేది కాదు. తర్వాత రోజులు మారాయి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. తన భర్త నరేష్ దివ్యకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు ఎప్పుడంటే అప్పుడు పిల్లలతో వీడియో కాల్స్ లో మాట్లాడుకోవచ్చు అందర్నీ చూడొచ్చు దూరంగా ఉన్నా కూడా దగ్గర అవచ్చు అనే ఉద్దేశంతో దివ్యకు ఫోన్ కొనిచ్చాడు.

ఇక దివ్య ఆ ఫోన్ వచ్చిన కొత్తలో భర్తతో మాట్లాడుతూ చాలా సంతోష పడింది. వీడియో కాల్ చేయాలంటే వాట్సప్ ఉండాల్సిందే. కాబట్టి వాట్సప్ ఇన్స్టాల్ చేస్తూ అలాగే ట్విట్టర్ కూడా ఇన్స్టాల్ చేసింది. అందులో తన పిల్లల ఫోటోలు కాకుండా తన ఇష్టమైన హీరోయిన్ ముఖచిత్రాన్ని పెట్టి తనకు నచ్చిన, అనిపించిన రాతలు రాస్తూ ఉండేది. ఎందుకంటే తను చదువుకుంది కదా అందుకని తనకి అంతో ఇంతో కవిత గుణం అలవడింది. కాబట్టి అందులో అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేది.

అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు. జీవితం ఎవరికీ పూలపం కాదు జీవితంలో ముళ్ళు, పూలు సహజంగా ఉంటాయి. అలాంటి ఒక దుర్ధినం దివ్య జీవితం లోనూ వచ్చింది. ఒకరోజు మేడ పైకి బట్టలు తీసుకురావడానికి వెళ్లిన దివ్య కాలుజారి మెట్ల పైనుంచి పడిపోయింది. విషయం తెలిసి హుటాహుటిన వచ్చిన భర్త తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు. హాస్పిటల్ వాళ్ళు చూసి తను ఇంకా నడవలేదని చక్రాల కుర్చీకే అంకితం అని తన కాళ్లు బాగా దెబ్బతిన్నాయని చెప్పడంతో భర్త అత్తమామలు పిల్లలు అందరూ దిగులు పడ్డారు.

అదేదో సామెత చెప్పినట్టు భార్య గుణం భర్త పేదరికంలోనూ భర్త గుణం భార్య అనారోగ్యంలోనూ బయటపడుతుంది అన్నట్టుగా దివ్య భర్త నరేష్ గుణం బయటపడింది. నడవలేని నువ్వు ఇక నాకెందుకు అంటూ ఆమెను వాళ్ల పుట్టింట్లో వదిలివేశాడు. ఇన్ని రోజులు సేవలు చేయించుకున్న అత్తమామలు కూడా కొడుకు నిర్ణయానికి ఏమీ అనలేకపోయారు. మరి పిల్లల సంగతి ఎలా అంటే కాలు లేని నువ్వు నిన్నే చూసుకోలేవు ఇక నువ్వు పిల్లలను ఏం చూస్తావు పిల్లలను కూడా నేనే తీసుకుంటాను నీకు నెల నెల ఎంతో కొంత పంపిస్తాను అంటూ సద్ది చెప్పి మ్యూచువల్ డైవర్స్ లాగా తీసుకున్నారు.

ఈ విషయాన్ని దివ్య జీర్ణించుకోలేకపోయింది ఎందుకంటే పెళ్లయినప్పటి నుంచి వాళ్లే లోకంగా బ్రతికింది కాబట్టి ఆమెకు వాళ్ళు తప్ప మరే లోకం తెలియదు. తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోయారు ఒక్కగానొక్క కూతురు కాళ్ళు పోగొట్టుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాధ వర్ణనాతీతం. తామే ఇలా ఉంటే తమ కూతురు ఇంకా బాధ పడుతుందని భావించిన వాళ్లు ఉత్సాహపరచడానికి రకరకాల ప్రదేశాలకు తీసుకువెళ్లి తనను ఉల్లాసంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయినా పైకి నవ్వుతూ ఉన్నది దివ్య మనసులో మాత్రం మనుషులపై ముఖ్యంగా తన అత్తింటి వారిపై కసిగా కోపంగా ఉండేది.

అలాంటి సమయంలోనే తను అంతకు ముందు వాడిన ఫోన్లో ట్విట్టర్ గుర్తుకు వచ్చింది. ఇక అప్పటినుంచి ట్విట్టర్లో మనుషులంటే ఇలా ఉంటారా మనుషులంటే అలా ఉంటారా అంటూ తన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది అందరితో…. నాకు ఇలా జరిగింది నేను ఈరోజు ఇలా చేశాను అంటూ మంచి మాటలతోనే మొదలుపెట్టిన ఆ ప్రయాణం పోను పోను ఒక రకమైన సైకో లాగా మారడం మొదలైంది. అందువల్ల తనకు కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో అనడం, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ వారితో గొడవ పడడం చేసేది.

ఇలా చాలామంది అమర్ కి కొందరు సపోర్ట్ చేస్తే మరి కొందరు ఆమెని తిట్టడం మొదలుపెట్టారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీ పర్సనల్ విషయాలన్నీ మాతో ఎందుకు షేర్ చేసుకుంటున్నారు అని అనేవారు పర్సనల్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను బాగున్నప్పుడు నా మొగుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడు అనే మాటలు మాట్లాడుతూ ఉండేది ఆమెకు తగ్గట్టుగా ఇంకొక ఆవిడ కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ తనకు తోడుగా ఉండేది. మగాళ్లు ఇలా కోరుకుంటారు అలా కోరుకుంటారు అని అడల్ట్ కంటెంట్ మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్లు.

వీళ్ళ మాటలు విన్న కొందరికి ఎంటర్టైన్మెంట్ అయ్యేది కానీ మరికొంతమందికి మాత్రం ఇది చాలా ఎబెట్టుగా అనిపించి వాళ్ళు వీళ్ళని కొంచెం మంచిగా మాట్లాడండి మర్యాదగా ఉండండి ఎంతైనా మీరు ఆడవారు కదా అని మందలించే ప్రయత్నం చేసేవారు. అలా మందలించే ప్రయత్నం చేస్తున్న కొద్ది కూడా వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ మాటలు మాట్లాడుతూ ఉండేవారు. ఇక వీళ్ళని ఆపడం ఎవరివల్లా కాదు అనుకొని వీళ్లకు బుద్ధి చెప్పాలి అనుకున్న కొందరు వాళ్ళ దారిలోనే వెళ్తూ, వారిని మార్చాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళలాగే మాట్లాడడం మొదలుపెట్టారు.

అయితే ఇక్కడ అది బెడిసి కొట్టింది మార్చాలని అనుకున్న వారు కూడా వాళ్ళ మాటల్లో పడిపోయి వాళ్లు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు కాకపోతే అందులో కొందరు మాత్రం మీరు అసలు ఆడ పుటికే పుట్టారా మీరు అసలు ఆడవాళ్లేనా ఆడవాళ్ళైతే ఇలాగే మాట్లాడతారా అని అనుకుంటూ తిట్టడం మొదలుపెట్టారు. ఇలా ఇద్దరు తిట్టుకోవడం రెండు వైపులా గొడవలు మొదలయ్యాయి. అది ఎంతవరకు వెళ్లిందంటే ఈవిడ గొడవలు పడేది వాళ్ళ ఇంట్లో తెలిసేంతలా, అయితే అప్పటివరకు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఆమె మీద జాలీ, కరుణ చూపించేవారు ఆమె ఇలా చేయడం చూసి చాలా బాధపడ్డారు.

ఆమెతో ఎంతో మంచిగా ఉండే నీ బ్రతుకు ఇలా పాడైపోయింది దానికి నువ్వు బాధపడుతున్నావని నీకు చాలా స్వేచ్చని ఇచ్చాము దాన్ని నువ్వు ఇలా దుర్వినియోగం చేశావు. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నీకు అవసరమా అంటూ వాళ్లు కూడా తలో మాట అనేసరికి దివ్యకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది..

మరోవైపు ట్విట్టర్ లో కూడా ఆమెను బూతులు తిడుతూ పోస్టులు పెట్టేవారు. నువ్వు వస్తావా నీ రేటెంత అని మాటలు ఆమెను కలిచి వేసాయి. దివ్య మనసు మళ్ళీ గతంలోకి మారింది తాను ఒకప్పుడు ఎంత బాగా ఉండేది తన అత్తమామల్ని ఎంత బాగా చూసుకునేది తన పిల్లలతో ఎంత హాయిగా గడిపేది అన్ని గుర్తుకు వచ్చాయి.

ఒకప్పుడు ఎన్నో సాంప్రదాయబద్ధంగా ఉండే నేను ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం ఇదంతా కేవలం నా ఆసక్తితో, నాకు రెండు కాళ్లు పోవడం వల్లే నాలోని అసంతృప్తిని ఇలా బయట పెట్టుకున్నాను కానీ నా గురించి ఎవరు ఆలోచించరు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం నా జీవితం నాశనం అయ్యింది అన్న సంగతి ఎవరికీ తెలియదు. అయినా నేను కావాలని చేసుకున్నది కాదు దేవుడు నాకు ఇలా నిర్ణయించాడు అందుకే నాకు ఇలా జరిగి ఉంటుంది అని ఆమె రియలైజ్ అయింది.

కానీ దివ్య రియలైజ్ అయ్యేటప్పటికీ సమయం కాస్త గడిచిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఏం మాట్లాడకూడదు అవే మాటలు మాట్లాడేసరికి అందరికీ ఆమె అంటే ఒక రకమైన ఏహ్య భావం ఏర్పడింది. అందరూ ఆమె మారిపోయి వేరే పోస్ట్లు పెట్టినా కూడా వాటికి కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.

దివ్య నేను మారినా కూడా నన్ను వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. నేను మారాను మీరు ఇలా మాట్లాడకండి అని అంటూ ఆమె ఎంత బతిలాడుతూ పోస్టులు పెట్టినా కూడా అన్ని రోజులు ఓపిక పట్టిన మిగిలిన వారు ఆ మాటలు పట్టించుకోకుండా నువ్వు నాటకాలు ఆడుతున్నావు అంటూ కామెంట్లు పెడుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టారు.

ఆరోగ్యం సరిగా లేక కొంత మరియూ మానసిక ఒత్తిడి కొంత కలగలిపిన దివ్యకు పిచ్చెక్కింది. తానేం చేస్తుందో తనకు అర్థం కాకుండా పిచ్చిపిచ్చిగా ఇంట్లో వారిపై అరవడం మొదలుపెట్టింది. అదే క్రమంలో ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చక్రాల కుర్చీని తోసూకుంటూ వంటగదిలోకి వెళ్లి సిలిండర్ ఆన్ చేసుకొని పోయి ముట్టించుకుంది. దాంట్లో ఆ మంటల్లో దివ్య కాలి చనిపోయింది.

ఒక అంకం ముగిసింది కానీ దివ్య ఇలా చేయడం సమంజసమేనా, తన భర్త అర్థం చేసుకుంటాను అని మాటిచ్చి అర్థం చేసుకోకుండా వదిలేశాడు సరే, బాగా ఆలోచించి అదే సోషల్ మీడియా ద్వారా ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ లేదా పెయింటింగ్, కవితలు, కథలు అనేవి రాస్తూ తన జీవితాన్ని ఇంకా మంచిగా మార్చుకోగలగేది.

కానీ వారిపై ఉన్న కక్షతో, తనకు అన్యాయం జరిగిందని ఒక రకమైన ఒత్తిడితో మానసికంగా కృంగిపోయి పిచ్చి రాతలు రాయడం ఆ రాతలకు కొందరు స్పందించి ఆమెని తిట్టడం అవన్నీ ఆమె కావాలనే తన చేతులారా చేసుకుంది. రెండు కాళ్లు రెండు చేతులు లేని వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్న ఈ సమయంలో ఏదో ప్రమాదవశాత్తు జరిగిన దాన్ని మళ్లీ డాక్టర్లు బాగు చేయగలిగే అవకాశం ఉండి కూడా ఆ ప్రయత్నాలు ఏవి చేయకుండా దివ్య తన జీవితాన్ని తానే అంతం చేసుకుంది.

సోషల్ మీడియాను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు తనకు రెండు కాళ్లు లేవని ముందే చెప్పి దాతల సహాయం కోరి కృతమ కాళ్లు పెట్టుకోవచ్చు. ఆ కాళ్ళతో ఉద్యోగం సంపాదించుకొని తనకాళ్లపై తాను నిలబడవచ్చు. లేదా అదే కుర్చీల చక్రాల కుర్చీలో ఉంటూ తనకు వచ్చిన ఏదో ఒక కలలో రాణించవచ్చు. కానీ దివ్య మానసిక సంఘర్షణతో ఒత్తిడితో తానేం చేస్తున్నాను తనకే తెలియకుండా తన జీవితాన్ని తన చేజేతులా నాశనం చేసుకుంది.

ఈ ఒకటనే కాదు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలా చాలా జరుగుతున్నాయి కనీసం ఈ కథ చదివాకైనా కాలు లేని వారైనా ఉన్నవారైనా మారాలని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడకుండా తమ పనేదో తాము చూసుకుంటూ అంటే తమకి ఇష్టమైన రంగంలో తమ ప్రతిభని చాటుకోవచ్చు. అలా చాటుకుంటారని ఆశిస్తూ. కొందరికైనా ఈ కథ కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను. 

చివరగా ఒక మాట

ఏది కనిపెట్టినా (యాప్ కానీ వస్తువు గానీ) మంచికి వాడుకోవడానికే కనిపెడతారు కానీ మనమే వాటిని తప్పుడు దారిలో వాడుకొని మనకి మనమే చెడిపోతున్నాం!!

ఇది నిజమైన కథ. ఇటీవల ట్విట్టర్ లో జరిగింది. కాకపోతే నా కథలో ఆ పాత్రను చంపేశాను కానీ నిజానికి ఆవిడ ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. ఉన్నారో లేరో తెలియని ఆవిడను ఎలా చంపుతారు అని అంటారా, ఇది కవి ఊహ. కవి ఊహకు అంతం లేదు. ఆ పాత్ర తన తప్పు తాను తెలుసుకుంది అయినా కూడా మూర్ఖులు ఆమెను విసిగించారు అందువల్ల తన తనువును చాలించాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ పాత చనిపోయింది. నిజంగా ఉన్న ఆవిడ మాత్రం బ్రతికి ఉండాలని తను మళ్ళీ మంచిగా మారి ఆరోగ్యంగా తిరిగి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కథను ముగిస్తున్నాను.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *