ఒక చీకటి రాత్రి
నాన్నగారి సంవత్సరికం వస్తూ ఉండటం వలన ఊర్లో ఉన్న ఇంటికి వెళ్లి బాగు చేయించాలని రెండు నెలల ముందే అన్ని సర్దుకుని వెళ్ళాం అమ్మ, నేను, బాబు, అటు నుండి అమ్మమ్మ కూడా వచ్చింది. ఇద్దరు తమ్ముళ్ళు వారి ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది.
పొద్దున్నే లేవడం, వంట చేయడం పక్కకు పెట్టుకోవడం ఆ తర్వాత వచ్చిన కూలీలతో పని చేయించడం వాళ్లకి మధ్య మధ్యలో టీ పెట్టి ఇస్తూ ఉంటే వాళ్లు బాగా పని చేస్తారని అనుకుంటూ అది పెంకుటిల్లే కాబట్టి గుణపింకలు కొనుక్కు రావడం అవి పగలకుండా జాగ్రత్తగా ఓ పక్కకు పెట్టడం ఓ పక్కకు బాగు చేయిస్తూ మరో పక్కన మేము ఉండడం జరిగింది.
ఇల్లంతా బాగా అయిపోయింది. ఇంకా సంవత్సరికానికి 15 రోజులు ఏమో ఉంది రావలసిన వాళ్ళందరికీ ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్లు చేసి చెప్పాము ఉత్తరాలు రాశాము. నాన్న ఉద్యోగిగా మరణించాడు కాబట్టి చిన్న తమ్ముడు ఉద్యోగం కోసం తిరుగుతూ వాడు ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ ఆ సమయానికి వస్తాను అని చెప్పడంతో మేము మరేమీ అనలేకపోయాం.
ఇంకా పెద్ద తమ్ముడు టాటా స్కైలో ఉద్యోగం చేస్తున్నాడు మూడు రోజులు సెలవు ఇవ్వమని అంటే మేము ఇవ్వము నువ్వు వరుసగా వారం రోజులు రెండు షిఫ్టులు చేస్తేనే నీకు సెలవు ఇస్తాం లేదంటే జాబ్ వదిలేసి వెళ్ళిపో అని అన్నారట దాంతో పెద్ద తమ్ముడు కూడా రాలేకపోతున్నా అంటూ ఫోన్ చేశాడు. ప్రస్తుతం రాకపోయినా ఆ సమయానికి వస్తే చాలు అనుకుని మేము ఇంకేమీ అనలేకపోయాం. మధ్య మధ్యలో మామయ్య వచ్చి అమ్మమ్మను చూసి వెళ్తున్నాడు.
పనులన్నీ అంటే పెంక కప్పించడం అయిపోయింది బాగు చేయించడం అంతా అయిపోయింది వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ అవి కట్టించడం చేశాము ఇక సున్నం వేయాలి. పనులన్నీ అయిపోయాయి కాబట్టి సున్నం గురించి ఊర్లో చాకలి వాళ్లకు చెప్పి ఉంచాం. వాళ్ళు రెండు రోజుల ముందు వచ్చి వేస్తాము అని అన్నారు దాంతో సరే అనుకున్నాం.
పనులు అయితే అయిపోయాయి కానీ ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం కూలీలకు ఇవ్వలేదు. అమ్మకు అప్పటికి ఇంకా పెన్షన్ మొదలవ్వలేదు. కానీ నాన్నకు వచ్చిన గ్రాట్యూటీ డబ్బులు ఉండడంతో అప్పటివరకు పనులు చేయించాము. ఇంకా కొన్ని డబ్బులు మేము హైదరాబాద్ కి వచ్చి ఉన్న అపార్ట్మెంట్లోని మా బీరువాలో దాచింది అమ్మ. కానీ పిల్లలకి చెప్తే ఖర్చు చేస్తారని భయపడి ఎవరికీ చెప్పలేదు.
ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి ఎలా అని ఆలోచిస్తుంటే అమ్మమ్మ నీ చెవుల కమ్మలు ఉన్నాయి కదా అవి పెట్టి డబ్బులు తీసుకురా అంటూ అమ్మకు సలహా చెప్పింది. కానీ వాటితో కూలి డబ్బులు సరిపోవు పైగా చేతిలో కూడా ఉండాలి కాబట్టి నన్ను డబ్బులు తెమ్మని పంపిస్తాను అనుకుంది. అమ్మ ఈ విషయం నాకు చెప్పి డబ్బులు తీసుకొని రా అంటూ పంపింది. అయితే ఇలా తర్జనభర్జనతోనే మధ్యాహ్నం అవడంతో నేను మధ్యాహ్నం రెండు గంటలకి బాబుని తీసుకొని బయలుదేరాను. మా ఊరి నుండి ఇంకో ఊరికి వచ్చి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.
అప్పటివరకు తమ్ముళ్లు లేదా మామయ్య తోడుగా వచ్చేవారు కాబట్టి నాకు దారి అంతగా తెలిసేది కాదు ఇప్పుడు ఒక్కదాన్ని అది బాబుతో ప్రయాణం కాబట్టి కొంచెం కొత్త కొత్తగా అనిపించింది. హైదరాబాద్ బస్సు ఎక్కిన తర్వాత సికింద్రాబాద్లో దిగాలి అని అంటూ తమ్ముడు చెప్పిన విషయం సరిగా గుర్తులేదు. ఎందుకంటే అప్పుడు ఫోన్లు లేవు అమ్మ దగ్గర రిలయన్స్ ఫోన్ మాత్రమే ఉండేది దానికి ఊర్లో సరిగ్గా సిగ్నల్స్ ఉండేవి కావు కాబట్టి వాడు చెప్పింది ఏదో నాకు అర్థం కాలేదు.
అలా నేను దారిలోనే ఉన్న మా స్టాపు మా అపార్ట్మెంట్ ఉన్న కాలనీ దాటి సికింద్రాబాద్ వరకు వెళ్లిపోయాను. సికింద్రాబాద్ లో దిగేసరికి సాయంత్రం 4:00 అయింది. ఆ కాలనీ పేరు గుర్తు పెట్టుకొని ఆ బస్సు వచ్చే వరకు ఎదురు చూసి డ్రైవర్ని ఆ బస్సు ఆ కాలనీకి వెళ్తుందా లేదా అని అడిగి ఎక్కేసరికి 5:30 అయింది. ఇక కాలనీలోకి బస్సు వెళుతుంటే నేను ఇదే రూట్ లో కదా వచ్చింది అన్నట్టు చూసారుగా గుర్తొచ్చి నా పిచ్చితనానికి నేనే నవ్వుకున్నాను. అప్పటికి ఇంకా నాకు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు ఇప్పటికీ కూడా ఏమీ తెలియదు. ఇక మా అపార్ట్మెంట్ దగ్గర బస్సు దిగేసరికి సమయం 7 గంటలు అయింది.
చంకలో బాబు చేతిలో సంచితో నేను బస్సు దిగాను. రెండు నెలల తర్వాత కాబట్టి నాకు మళ్ళీ అంత కొత్త కొత్తగా అనిపించసాగింది. ఈలోపు అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ తాళం సంచిలో వెతికేసరికి దొరకలేదు. అయ్యో ఉన్న ఒక తాళపు చెయ్యి పోయింది ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటూ పక్కనే ఉన్న ఎస్టిడి బూతులోకి వెళ్లి అమ్మ ఫోన్ కి ఫోన్ చేశాను. అమ్మ తాళం చెయ్యి పోయింది ఇప్పుడు ఏం చేయాలి టైం ఎంత అయింది మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలా అంటూ అడిగాను.
అయ్యో ఇప్పుడు ఎలా వస్తావు వద్దు. వేరే తాళం కొని ఆ తాళం పగలగొట్టు కొత్త తాళం వెయ్యి అంటూ అమ్మ చెప్పడంతో సరే అని ఫోన్ పెట్టేసి అపార్ట్మెంట్లో నాలుగో ఫ్లోర్ కి వెళ్లాను. మా ఫ్లాట్ ముందుకు వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఎంత చదువుకున్నా కొత్తగా ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే కాస్త ఆందోళనగానే ఉంటుంది కదా…..
ఇక బాబుని కిందకు దించి పక్కన కూర్చొని తాపీగా బ్యాగ్ అంతా వెతకడం మొదలుపెట్టాను. కొత్త తాళం పక్కన పెట్టుకుని మెల్లిగా వెతికేసరికి తాళం చెయ్యి దొరికింది. పోయిన డబ్బు దొరికినంత సంతోషంగా అనిపించింది వెంటనే తెచ్చిన రాయిని పక్కన పడేసాను. మరి కింది నుంచి వచ్చేటప్పుడే ఒక పెద్ద రాయిని పట్టుకొచ్చాను తాళం పగలగొట్టాలని, తాళం చెవి దొరికేసరికి సంతోషంగా తలుపులు తాళం తీశాను.
అన్ని రోజులుగా మేమెవరం లేకపోవడంతో ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంది. పైగా కరెంటు లేదు. అప్పటికి రెండు నెలలుగా కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టి కరెంటు కట్ చేసి ఉంటారు అని అనుకుంటూ, ముందు తలపు వెనకదలకు బార్ల తెరిచి ఆ వెలుతురులో ఇంట్లో ఉన్న క్యాండిల్ వెలిగించాను. ఎందుకంటే వెళ్లేటప్పుడు ముందు గదిలో ఒక డబ్బాలో క్యాండీల్ అగ్గిపెట్టె ఉంచి వెళ్ళడం గుర్తుంది కాబట్టి ఆమాత్రమైనా వెలిగించగలిగాను.
ఆ తర్వాత రెండు తలుపులు పెట్టేసి, బీరువా తాళం తీసి డబ్బులు తీసి జాగ్రత్తగా ఒక దస్తీలో కట్టుకొని, మళ్లీ ఒక కవర్లో పెట్టి జాగ్రత్తగా మరో బట్టలో కట్టుకొని సంచిలో పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్లీ బీరువాకు తాళం వేసి బయటకు వచ్చేసరికి చిన్నగా ఉన్న క్యాండిల్ ఆరిపోయింది. బాబేమో దోమలు కుట్టడంతో ఏడవడం మొదలుపెట్టాడు. కరెంటు ఉంటే ఫ్యాన్ వేస్తే అయినా దోమలు కుట్టడం ఆగేవేమో కానీ అసలు కరెంటు లేదు. పైగా మధ్యాహ్నం తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది నాకు ఆకలిగా ఉంది. చేతికి వాచి కూడా లేకపోవడంతో సమయం ఎంతో కూడా తెలియలేదు.
మళ్లీ తలుపులు తెరిచాను ఈసారి బయట ఉన్న వెలుగులో అంతా వెతికేసరికి క్యాండిల్ ఏమీ కనిపించలేదు. ఆకలి కూడా అవుతుంది ఉన్న డబ్బులతో ఏమైనా తెచ్చుకుందాం అలాగే క్యాండిల్ కొనుక్కొద్దామని మళ్లీ బాబుని చంకలో వేసుకొని సంచి తీసుకొని నాలుగు ఫ్లోర్లు దిగాను. అప్పటికే ఆ కాలనీ అంతా కొంచెం కొంచెం సద్దుమనగా సాగింది. పక్కనే ఉన్న కిరాణా షాపులో ఒక నాలుగు కొవ్వొత్తులు అలాగే రెండు అగ్గిపెట్టెలు తీసుకున్నాను. ఇంట్లో కిరోసిన్ ఆయిల్, స్టౌ ఉందని గుర్తుకు వచ్చి, ఒక అద్దకిలో బియ్యం కొనుక్కున్నాను. అలాగే ఒక పెరుగు కూడా తీసుకున్నాను.
మళ్లీ బాబునే ఎత్తుకొని ఆ రెండు పట్టుకొని సంచితో నాలుగు ఫ్లోర్లు ఎక్కాను. అప్పటికి లిఫ్ట్ ఉంది కానీ వాడాలంటే నాకు భయం. కొత్త కాబట్టి చాలా భయంగా అనిపించింది అది మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ఎలా నొక్కాలో తెలియదు ఎలా ఎక్కాలో కూడా తెలియదు కాబట్టి నాలుగు ఫ్లోర్లు ఎక్కి మళ్ళీ వచ్చాను. మళ్లీ తలుపు తాళం తీసి లోపలికి వచ్చాక క్యాండిల్ వెలిగించిన తర్వాత గది తలుపులు మూసాను. ఆ తర్వాత స్టౌ పై బియ్యం కడిగి పెట్టాను. పిచ్చిదాన్ని పెట్టేముందు కిరోసిన్ ఉందా లేదా చూసుకోవాలి కదా, అన్నం సగం ఉడికేసరికి కిరోసిన్ అయిపోయింది. దాంతో భత్తులు కొట్టుకొని కొట్టుకొని ఆరిపోయాయి.
అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఎలా అనుకుంటూ, ఆ గిన్నె తీసి మళ్లీ భత్తులు పెద్దగా చేసి మళ్లీ ముట్టించాను. భత్తులు వెలిగినంతసేపు అన్నం ఉడికింది. అవి ఆరిపోయేసరికి అన్నం పలుకు పలుకుకుగా ఉండిపోయింది. పోనీ ఎదిరింటావిడని కొంచెం సేపు స్టవ్ పై పెట్టి ఇస్తారా అని అడుగుదాం అనుకున్నా కానీ ఇంకా ఎవరితో మాటలు కలపలేదు ఎవరెవరో తెలియదు కాబట్టి సాయం చేస్తారో లేదో తెలియదు అని అనుకుంటూ అదే ఉడికి ఉడకని అన్నాన్ని మెత్తగా చేతులతో పిసికాను.
ఎంత పిసికినా ఉడికి ఉడకని అన్నం మెత్తగా అవుతుందా…! అవ్వదు కాబట్టి మెత్తగైన అన్నంలో కొంచెం పెరుగు వేసి పిల్లాడికి పెట్టాను. ఏం చేయను మరి వాడు అప్పుడప్పుడే అన్నం తినడం అలవాటు చేసుకుంటున్నాడు. ఒక ముద్ద తిన్న తర్వాత వాడికి కూడా అర్థమైంది అది బాగా లేదని, దాంతో వూసేసాడు. ఎందుకిలా చేస్తున్నాడని ఒక ముద్ద నేను పెట్టుకొని చూసాను నేను కూడా ఊసేసాను ఎందుకంటే కిరోసిన్ వాసన అన్నానికి బాగా పట్టింది. అందువల్ల వండిన అన్నామంతా వృధా అయిపోయింది.
నేను కిరాణా షాప్ లోకి వెళ్లేటప్పుడు సమయం 8:30-9 అవుతుంది. ఇప్పుడు పది కూడా దాటిపోయి ఉండవచ్చు పిచ్చిదాన్ని ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకోలేదు అనుకుంటూ నేనైతే కొన్ని నీళ్లు పట్టుకుని తాగాను. అలాగే కిరోసిన్ పట్టుకున్న చేతులు కాబట్టి సబ్బు ఉండడంతో కడుక్కున్నాను. నేను నీళ్లు తాగాను కాబట్టి కడుపు నిండిపోయింది ఆకలికి తట్టుకోగలను.
కానీ బాబుకు ఏం పెట్టాలి వాడు ఆకలితో ఎలా ఉండగలడు అని అనుకుంటూ వాడికి నా పాలు ఇవ్వక తప్పలేదు. వాడు నాతో పాటే బాగా అలసిపోయాడు కాబట్టి తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు కానీ దోమలు మాత్రం విపరీతంగా కుట్టసాగాయి. అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు పేపరు వేసుకునే వాళ్ళు తమ్ముళ్లు ఆ పేపర్ తో వాడికి ఊపుతూ అమ్మమ్మ కోసం తాను తెచ్చుకున్న చిన్న మంచంపై ఉన్న బట్టలను అన్నిటిని గట్టిగా దులిపివేసి బాబుని అందులో పడుకోబెట్టి నేను కూడా సంచి పక్కన పెట్టుకొని పడుకున్నాను.
కానీ ఎంతసేపైనా నిద్ర రాదు. ఎంతో అలసిపోయాను కానీ నిద్ర రావడం లేదు ఓవైపు భయం, ఓవైపు ఆకలి, ఇంతకుముందు ఉన్న ఇల్లే అయినా ఒక్కదాన్నే ఉండేసరికి చాలా భయంగా అనిపించింది. పైగా కరెంటు లేకపోవడంతో ఇంకా భయంలోకి జారిపోయాను ఆ భయం వల్లనే నిద్రపోకుండా నిమిషాలు లెక్కిస్తూ బాబుకి చేతులు నొప్పి పెడుతున్నా వాడు నిద్రలేచి ఎక్కడ ఏడుస్తాడో అనే భయంతో రాత్రంతా పేపరు పట్టుకొని ఊపుతూ ఆ రాత్రంతా నిద్రలేకుండానే గడిపాను.
అలా నిద్రలేకుండానే గడిపాను తెల్లవారేది కూడా నాకు ఏర్పడింది. ఒక్క క్షణం ఇలా నిద్రపోయానో లేదో విజిల్ సౌండ్ వినిపించింది. పక్కింట్లోనూ ఎదురింటిలోనూ ఎవరో కుక్కర్ విజిల్ అనుకుంటా ఆ శబ్దానికి చేటుక్కున లేచి కూర్చొని నేను ఎక్కడున్నా అనుకుంటూ ఒకసారి చూసుకున్నాను. అప్పటికి సమయం అయిదు అవుతుంది కాబోలు పక్కనే ఫ్యాక్టరీలు ఉండడంతో మిగిలిన వాళ్లు డ్యూటీలకు వెళ్తారు అందువల్లే ఈ విజిల్స్ సౌండ్ లు వస్తాయి. ఇదివరకు ఉన్నప్పుడు చూసాం కాబట్టి నాకు సమయం తెలిసింది.
వెంటనే లేచి బాత్రూంకి వెళ్లి వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని, తలుపులన్నీ వేసి అన్నం ఒక కవర్లో వేసుకొని ఆ గిన్నె కడిగి పెట్టి, వచ్చేసరికి బాబు లేచాడు. వాడికి చెడ్డీ మార్చి వాడి కాలకృత్యాలు తీర్చి, అప్పట్లో డైపర్లు వాడాలని నాకు తెలియదు కాబట్టి బట్టలు కట్టే దాన్ని. ఆ బట్టలు రెండు మూడు గట్టిగా కట్టాను ఎందుకంటే మూత్రం పోసిన పచ్చిగా అవకుండా ఉండడానికి.
ఆ తర్వాత సంచి, బ్యాగు రెండు తీసుకొని వేసిన లైట్లు అన్నీ బంద్ చేసి కిరోసిన్ స్టవ్ పక్కన పెట్టి తలుపులు తీసుకొని బయటకు వచ్చాను. ఐదు గంటలకు రోడ్డు దగ్గరికి వెళ్తే మా వైపు వెళ్లే బస్సులు ఉంటాయని అప్పుడెప్పుడో మామయ్య చెప్పింది గుర్తుంది కాబట్టి గబగబా తాళం వేసి తాళం చేయి మళ్లీ బ్యాగులో వేసుకొని బాబుని ఎత్తుకొని నాలుగు ఫ్లోర్లు దిగాను.
బయట రోడ్డు మీదకి వచ్చేసరికి కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి దానికి ఇంకా భయం అయింది కానీ అక్కడక్కడ అప్పుడే వస్తున్న పాల, పేపర్ల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటిని వెళ్లగొట్టి వాళ్లు వెళ్లిపోయారు ఈలోపు నేను అక్కడి నుంచి కాస్త దూరంలో ఉన్న రోడ్డు దగ్గరికి బాబుతో సహా నడుస్తూ వెళ్లాను. ఆ కాస్త దూరం అంటే ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది.
బాబునెత్తుకొని నాలుగు ఫ్లోర్లు దిగి కిలోమీటర్ నడిచి రోడ్డుపైకి వచ్చాను. అప్పుడప్పుడే స్కూటర్లు బండ్లు శబ్దాల వినిపిస్తున్నాయి. జనాల అలికెడు మొదలైంది కాబట్టి కాస్త భయం తగ్గింది. అలా ఎదురు చూస్తూ ఉండగా మా ఊరికి వెళ్లే బస్సు రావడం కనిపించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను చేయి ఊపేసరికి బస్సు ఆపాడు. అంతవరకు అక్కడ స్టాప్ అనేది లేదు. ఎవరో ఒకరో ఇద్దరో ఉంటే ఆపుతారట అనేది కూడా మామయ్య చెప్పింది గుర్తొచ్చి చేయువి ఊపాను.
బస్సు ఎక్కి టికెట్ తీసుకొని కూర్చున్నాను అప్పటికి కొంచెం నిదానంచింది నా మనసు. ఇక మళ్లీ మా ఊరికి వెళ్లడానికి ఇంకొక బస్సు ఎక్కి ఇంటికి వెళ్లాను. అప్పటికి సమయం ఉదయం పది అయ్యింది. ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకొని తలుపు కొట్టాను. ఎవరు అంటూ అమ్మ లోపల్నుంచి అడిగేసరికి నేనే అన్నాను. వస్తున్నా అంటూ వచ్చి అమ్మ తలుపు తీసింది. తలుపు తీసిన అమ్మ నన్ను చూడగానే ఏంటి అవతారం ఏమైంది ఎక్కడైనా అడ్డం పడ్డావా ఏమైనా జరిగిందా అంటూ అడిగింది.
అలా ఉంది మరి నా అవతారం రేగిపోయిన జుట్టు వాలి పోతున్న నా కళ్ళు, ఇలా ఉన్ననా శరీరాన్ని చూస్తూ అమ్మ భయపడింది. ఏం కాలేదు అంటూ లోపలికి వచ్చి, సంచినీ, బాబునీ అమ్మచేతికిచ్చి చాపలో వాలిపోయాను. ఆ వాలిపోవడంతో దాదాపు రెండు గంటల వరకు నిద్రపోయాను. నేను నిద్ర లేచే వరకు అమ్మ భయపడుతూనే ఉంది. బాబుకి మాత్రం స్నానం చేయించి, అన్నం పెట్టి , పడుకోబెట్టి నేను ఎప్పుడు లేస్తానా అని ఎదురుచూస్తుంది.
రెండు గంటలకు మెలికొచ్చిన నేను అమ్మ ఆకలయితుంది అన్నం పెట్టు అన్నాను. అమ్మ ఏమీ మాట్లాడకుండా అన్నం తీసుకొచ్చి ఇచ్చింది చేతికి, గబగబా నాలుగు ముద్దలు నోట్లో కలిపి పెట్టుకున్నాను. అప్పుడే తెలిసింది అన్నం విలువ, ఆకలి విలువ. ఇక అమ్మకు తర్వాత జరిగిన సంఘటనతా చెప్పడంతో ముందే ఏమైనా కొనుక్కుంటే అయిపోయేది కదా అంటూ తను నన్నే తిట్టింది. అది వేరే సంగతి…
కానీ ఆ రాత్రి మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. దారి తెలియకుండా భాగ్యనగరంలోకి అడుగుపెట్టడం అక్కడ బస్సులు మారుతూ ప్రయాణం చేయడం చంటి పిల్లాడితో నడవడం, నాలుగు ఫ్లోర్లు రెండు మూడు సార్లు ఎక్కి దిగడం, ఆ అన్నం వండుకోవడం ఇప్పటికి తలుచుకుంటే ఆ చీకటి రాత్రిని మర్చిపోలేను. ఇది జరిగి దాదాపు 15 ఏళ్లు అవుతున్నా ఇంకా నా మదిలో ఒక మూలన అలాగే ఉంది. ఇప్పుడు మాత్రం ఒక్కదాన్ని ఎక్కడికైనా తిరగగలను.
అలాగే ఎవరైనా తిని వెళ్ళమంటే ఖచ్చితంగా తినే వెళ్తాను. ఎందుకంటే ఆ రాత్రి నా జీవితంలో అన్నీ నేర్పించింది. అన్నీ అనుభవించేలా చేసింది. కానీ సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి తప్ప మరెక్కడికి వెళ్లలేను. ఎవరి ఇంట్లోనూ ఉండలేను. ఇంట్లో మాత్రం భయపడకుండా ఒక్కదాన్నే ఉండగలను. అది చీకటి రాత్రి అయినా ఏ రాత్రైనా. జీవితంలో కొందరికి కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుంటాయి అనడానికి నిదర్శనం ఈ ఘటనే.
– భవ్య చారు