న్యాయం
న్యాయం ఈ పదం వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈరోజుల్లో న్యాయం జరిగేది ఎక్కడ? డబ్బుకు అమ్ముడుపోయిన న్యాయవాదులు, మీడియా, డాక్టర్లు, ఇతర రంగాలలోని వాళ్లు అమ్ముడుపోతే ఇక న్యాయం అనే పదానికి అర్థం లేదు.
ఏ వ్యక్తికైనా తనకు అన్యాయం జరిగిందని న్యాయం కోసం వెళ్లాడంటే అతని జీవితం అంతం అయ్యేవరకు అతనికి న్యాయం అనేది జరగదు. ఎక్కడో నోటికో కోటికో ఒక్క నిజాయితీపరుడు ఉండడమే గగనమైన ఈ రోజుల్లో ఇక న్యాయానికి విలువ ఎక్కడుంది?
ఉదాహరణకి ఒక రైతుని తీసుకుందాం. ఆ రైతు దగ్గర్లో ఉన్న ఒక ఎరువుల షాపులో విత్తనాలు కొన్నాడు అనుకుందాం ఆ విత్తనాలు నమ్మకంతో అతడు తన పొలంలో వేశాడు కానీ ఆ విత్తనాలు నకిలీవి కాబట్టి అతనికి పంట అనేది రాలేదు దాంతో అతడు పోలీస్ స్టేషన్లో నకిలీ విత్తనాల గురించి కంప్లైంట్ చేశాడు.
ఆ విత్తనాలు అమ్మే అతను పోలీసుల వద్దకు వెళ్లి ఎంతో కొంత ముట్ట చెప్పి కేసు లేకుండా చేయండి అని అడుగుతాడు అప్పుడు పోలీసులు రైతుని పిలిచి ఈ కేసు వాపస్ తీసుకో నీకు ఎంతో కొంత డబ్బు ఇప్పిస్తాము అని అంటారు. కానీ నిజాయితీపరుడైన ఆ రైతు లేదు మీరు కేసు ఫైల్ చేయండి నేను కోర్టు వరకు వెళ్లి నాకు న్యాయం జరిగేలా చూసుకుంటాను అని అంటాడు.
అయితే అవినీతిపరులైన కొందరు పోలీసులు ఆ ఎరువుల షాప్ అతనితో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని ఆ రైతు మీద నకిలీ కేసు బనాయించి లోపల వేస్తాము అని బెదిరిస్తారు. దాంతో ఆ రైతు భయపడి తాను జేనుకు వెళితే తన కుటుంబం అనాధ అవుతుంది అని ఎంతో కొంత డబ్బు తీసుకొని తన మానాన తాను బ్రతుకుతాడు.
ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఇక్కడే న్యాయానికి సమాధి కట్టారు ఇక న్యాయానికి విలువ ఎక్కడుంది? పోనీ ఆ రైతు ఎవరికి భయపడకుండా లేదంటే ఆ పోలీసులలో నిజాయితీపరుడైన ఏ పోలీసు అయినా అతన్ని ముందుకు తీసుకెళ్లి కోర్టు వరకు వెళ్లిన ఎరువుల షాపు యజమానికి డబ్బు ఉంటుంది కాబట్టి అతను తన లాయర్ ని పెట్టుకుంటాడు తాను ఇచ్చిన ఎరువులు మంచివే అని అతనే డబ్బు కోసం నన్ను నా పరువును తీస్తున్నాడని ఎదురువాదిస్తాడు.
దాంతో ఈ మాటలు నమ్మి కోర్టు కేసు కొట్టి వేస్తుంది ఎందుకంటే అవతలి వైపు ఉన్న లాయర్ ఎంతోకొంత డబ్బు తీసుకొని ఎరువుల షాపు యజమానికి తగిన ఆధారాలు సృష్టించాడు కాబట్టి అంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేశాడు ఆ రైతుకు అన్యాయం చేశాడు. అయినా ఆ రైతు ఊరుకోకుండా పైకోర్టుకు వెళ్లాడు అనుకుందాం అప్పుడు జరిగేది ఏమిటి?
అక్కడ కూడా మరొక లాయర్ డబ్బుకు కక్కుర్తి పడి ఆ ఎరువుల షాపు యజమాని కేసును తానే వాదిస్తాడు దాంతో ఈ రైతుకు న్యాయం జరగదు. అయినా ఆ రైతు పట్టు విడువదలకుండా మళ్లీ ఇంకొక పైకోర్టుకు వెళ్తాడు ఈలోపు ఇక్కడ ఊర్లో ఆ ఎరువుల షాపు యజమాని ఆ రైతు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం లేదా రౌడీల చేత రైతును కొట్టించడం లాంటివి చేయవచ్చు.
దాంతో ఆ రైతు తన వల్ల తన కుటుంబానికి అన్యాయం జరుగుతుందని భావించవచ్చు. లేదా ఇంట్లో ఉన్న భార్య పిల్లలే ఎందుకు మనకు ఇవన్నీ మన జీవితమేదో మనం బతుకుదాం ఆ ఎరువుల షాప్ కాకపోతే ఇంకొక దగ్గర నుంచి విత్తనాలు తెచ్చుకుందాం కేసు విత్ డ్రా చేసుకో అని ఆ రైతుని బలవంత పెట్టవచ్చు.
దాంతో ఆ రైతు ఇక చేసేది ఏం లేక ఏ న్యాయస్థానం ఏ న్యాయవాది తనకు న్యాయం చేయరని భావించి మనోవేదనకు గురై చనిపోవచ్చు లేదా కేసు విత్ డ్రా చేసుకొని తన బ్రతుకేదో తాను బ్రతకవచ్చు. ఇక ఇక్కడ న్యాయానికి చోటు ఎక్కడుంది? ఇది కేవలం ఒక రైతు ఉదాహరణ మాత్రమే….
అలాగే మనము ఇంకొక కేసును తీసుకుందాం. ఒక అమ్మాయిని ఆ ఊర్లో ఉన్న అబ్బాయి అత్యాచారం చేశాడు ఆ అమ్మాయి కేసు పెట్టింది అనుకుందాం. ఊరి పెద్దలకు ఈ విషయం తెలిసి పంచాయతీ పెట్టారు అతను ఆమెను అత్యాచారం చేశాడు కాబట్టి పెళ్లి చేసుకోమని ఇక్కడి పెద్దలు తీర్పు చెప్తారు.
కానీ ఆ అమ్మాయి వినకుండా నన్ను అత్యాచారం చేసిన వారిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అంటూ కేసు ఫైల్ చేయవచ్చు. ఇక పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు ఎంతోకొంత డబ్బులు ఇచ్చి వదిలించుకో అని పోలీసులు ఉచిత సలహాలు ఇస్తారు అక్కడ కూడా అమ్మాయి వినకుండా లేదు నేను కోర్టు వరకు వెళ్తాను నాకు న్యాయం జరగాలి అని అంటుంది.
అప్పుడు పోలీసులు న్యాయం అంటే ఏం కావాలి నీకు అని అడుగుతారు అప్పుడు ఆ అమ్మాయి అతనికి శిక్ష పడాలి అతను జైల్లో ఉండాలి అంటే దానికి పోలీసులు నీ జీవితం నాశనం చేసిన వాడిని జైల్లో వేస్తే ఏం జరుగుతుంది ఆ తర్వాత నీ భవిష్యత్తు ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారా అంటూ అమ్మాయిని రకరకాలుగా నచ్చచెప్పి చివరికి ఎంతో కొంత డబ్బు లేదా అతనికి ఇచ్చి అతనిని పెళ్లి చేసుకునేలా చేసి ఆ కేసును అంతటితో ఆపేస్తారు.
ఇదొక రకమైన న్యాయం అనుకుంటాం కానీ ఇది నిజానికి న్యాయం కాదు తప్పు చేసిన వాడికి నిజమైన శిక్ష పడడమే నిజమైన న్యాయం అనిపించుకుంటుంది. ఇక్కడ మనం ఇంకొక కోణంలో చూద్దాం ఆ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోకుండా కోర్టుకు వెళ్లిందని అనుకుందాం అక్కడ జరిగేది ఏమిటి?
అత్యాచారం చేసిన అబ్బాయి ఒక మంచి లాయర్ ని బాగా డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే రకరకాల ప్రశ్నలతో మనసును గాయం చేస్తాడు ఎంతలా అంటే ఈ కేసులను ఎందుకు పెట్టాను రా భగవంతుడా అని ఆ అమ్మాయి అనుకునేలా ఆ ప్రశ్నలు ఉంటాయి.
దాంతో శారీరకంగా చనిపోయిన ఆమె ఇప్పుడు కోర్టులో పదిమంది ముందు మానసికంగా కూడా చనిపోతుంది దాంతో ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు లేదా నన్ను అసలు అత్యాచారమే చెయ్యలేదు అని కూడా అనవచ్చు. మన న్యాయవ్యవస్థలో ఎన్నో రసగులు ఉన్నాయి ఆలోసుగులను అడ్డుపెట్టుకొని చాలామంది తప్పు చేసిన తప్పించుకొని దర్జాగా రోడ్లమీద తిరుగుతున్నారు.
పైకోర్టుకు వెళ్లినా కూడా ఏం న్యాయస్థానం అయినా ఆరు నెలల జైలు శిక్ష జరిమానా వేస్తారు. ఈ జైలు శిక్ష జరిమానా తో అతనిలో పరివర్తన వస్తుందా అంటే అది అనుమానమే. పోనీ ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా అంటే అది కూడా అనుమానమే ఒకసారి అత్యాచారం జరిగిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.
ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మలేని నిజం. ఇవన్నీ పక్కన పెడితే న్యాయం కోసం న్యాయం జరగడం కోసం పోరాడే వారు లేకపోలేదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవరోధాలు కలిగిన ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి జడవకుండా న్యాయం కోసం పోరాటం చేసేవారు ఎందరో…. వారి జీవితకాలం వారు చనిపోయిన తర్వాత కూడా న్యాయం కోసం పోరాడుతుంటే ఉంటారు.
ఉదాహరణ కు నంబి నారాయణ, సుగాలి ప్రీతి తల్లి గారు, అమ్మాజీ మహారాజన్, ఇలాంటి వాళ్లు తమకు అన్యాయం జరిగిందని న్యాయం జరగాలని వాళ్ళ జీవితాంతం పోరాడుతూనే ఉంటారు. నంబి నారాయణ ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతుంటే ఆయనకి మొన్న మొన్న న్యాయం జరిగింది అది కూడా నష్టపరిహారం మాత్రమే ఇచ్చారు.
అతని జీవిత చరిత్రను సినిమాగా కూడా తీశారు. అయితే ఇన్నాళ్లకు న్యాయం జరిగినా కూడా వాళ్లు వాళ్ళ జీవితాన్ని కోల్పోయి ఉంటారు కదా. దేశద్రోహి అనే ముద్ర వేసినప్పుడు ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు పొంది ఉంటారు, అనుభవించి ఉంటారు వారి అప్పటి కాలాన్ని వారి సంతోష సమయాలను న్యాయవ్యవస్థ కానీ మనం కానీ ఎవరం వెనక్కి తెచ్చి ఇవ్వలేము.
ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు అలాంటి పరిస్థితులు మనకు వచ్చాయి ఒక్కసారి కోర్టుకు వెళితే ఇక జీవితాంతం తిరగాల్సిందే అనే ముద్ర మనలో నరనరానా జీర్ణించుకుపోయింది అని చెప్పవచ్చు. న్యాయదేవత ఇవన్నీ చూడలేకే కళ్లకు గంతలు కట్టుకుందేమో అనే అనుమానం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది.
ఇప్పుడు నేను చెప్పినవన్నీ కేవలం ఒకవైపు మాత్రమే. జ్ఞానానికి మరో వైపు చూస్తే న్యాయవ్యవస్థ లో కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. వారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తమ దగ్గరికి వచ్చిన వారికి న్యాయం చేయడానికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టే వాళ్ళు అరుదుగానే ఉంటారు అని చెప్పవచ్చు.
లేదా తమ దగ్గరికి వచ్చిన వ్యక్తులలో నిజంగానే న్యాయం ఉంటే దానికోసం జీవితాంతం పోరాడే వారు కూడా ఉంటారు ఉదాహరణకి జై భీమ్ సినిమాలో చూపించినట్లు ఆ లాయర్ కూడా తన దగ్గరికి వచ్చిన వ్యక్తులకు న్యాయం కావాలి అని అనిపించింది కాబట్టి అతను చివరి వరకు పోరాడి గెలుపు సాధించాడు.
ఇంకా ఇప్పటికీ న్యాయం జరగక న్యాయం కోసం ప్రతిరోజు పోరాడుతూ మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. వారికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు ఈ న్యాయవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందో తెలియదు. మన న్యాయవ్యవస్థ న్యాయంగా ఉంటే కోర్టులలో లక్షల కొద్దీ కేసులు పెండింగ్లో ఉండవు.
కాబట్టి న్యాయవ్యవస్థ మారాలి ఎప్పటి శిక్షలు అప్పుడు వేస్తూ ఉండాలి. ఆడవారికి మగవారికి ఒకే రకమైన న్యాయం అందిస్తూ ఉండాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్పు లేదనుకున్న వారిని మందలించి వదిలేయాలి. చట్టం తన పని తాను చేసుకు పోతుంటే న్యాయం కూడా తన పని తాను సక్రమంగా నిర్వర్తించినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..
అలా కాకుండా ప్రలోభాలకు, డబ్బుకు లొంగిపోతే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. అన్యాయం రాజ్యమేలుతూ న్యాయం మరుగుదన పడిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎవరిని కించపరచడానికి లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి రాసింది కాదు. మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి నా అభిప్రాయం మాత్రమే వెలిబుచ్చాను. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నన్ను మన్నిస్తారని ఆశిస్తూ మీ భవ్య.
– భవ్య చారు