నీరాజనం

నీరాజనం

సుదీర్ఘకాల అన్వేషణ అనంతరం….
నీ జాడ లభించిందన్న ఆనందంతో…
మదిలో సందడి చేస్తున్న మన గతకాలపు స్నేహ పరిమళాల
గుబాళింపును ఆస్వాదిస్తూ…
చిరకాల నేస్తాన్ని దర్శించబోతున్నానన్న…
ఉత్సుకతతో హృదయం పల్లవిస్తుండగా..
మనో వాల్మీకంలో పదిలంగా ఉన్న
నీ సజీవ జ్ఞాపకాలను..
పునర్దర్శించుకుంటూ…
పట్టరాని ఆనందంతో..
పరుగుపరుగున నేనొస్తే….
పుష్పమాలాలంకృతమైన…
నీ నిర్జీవ పార్థివదేహం
నివ్వెరపరుస్తూ నన్ను స్వాగతించింది..!
కళ్ళల్లో చిప్పిల్లుతున్న…
ఆనంద భాష్పాలు …
అశ్రుపుష్పాలుగా రూపాంతరం చెంది..
నన్ను నిలువెల్లా తడిపేస్తుంటే…
నా ఉనికే ప్రశ్నార్థకం అయిన దుస్థితిలో..
నిశ్చేష్టనై నిలుచుండిపోయాను.!
నీకు అంత మరుపేల నేస్తం…?
మన దారులు వేరైనా…
తీరులు వేరైనా…
మన మిత్రుత్వం శాశ్వతం అన్నావు..!
కడవరకు కలిసి ప్రయాణిద్దాం అన్నావు..!
మరి ఇలా ఎలా అర్ధాంతరంగా ..
నా చెయ్యి వదిలేసి..
ఒంటరి ప్రస్థానం సాగించావు..?
నీ నిష్క్రమణం మిగిల్చిన వేదన…
నన్ను దావానలంలా దహించివేస్తోంటే..
నేను మాత్రం
ఏం చేయగలను నేస్తమా?
నీ పవిత్ర ఆత్మకు నీరాజనాలు నివేదించడం తప్ప…!
నువ్వు వేగిరపడి వెళ్ళిపోయినా..
ఈ ఒంటరి జీవిత నౌకను..
నడిపిస్తూనే ఉన్నాను..
ఎందుకంటే…
కదలిక లేకపోతే…
మన స్నేహం బతికేదెట్లా ?

ఇటీవల మరణించిన నా స్నేహితురాలి పవిత్ర ఆత్మకు నివాళులర్పిస్తూ తన జ్ఞాపకార్ధం రాసిన కవిత…

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *