నీటిబొట్టు
ఆటవెలదులు
1) పట్టు నీటి బొట్టు ప్రాణాలు నిలబెట్టు
ఇంకుగుంట ఉంటె జంకులేదు
ఊరికొక్క చెరువు ఊరంతకందము
నీరు లేక ఎవరు నీల్గవలదు
2) నాగరికతలన్ని నగరాలలో వెలిగె
నాటి వైభవమ్ము నేడు కరువు
వేల యేళ్ళనుండి వెలిగిన నరుడిలా
నీరు లేక నేడు నీల్గుచుండె
3) వాననీరు మిగుల వరదలై పోకుండ
ఇంకుగుంటయందు యిమడ జేయి
పుచ్చకాయ రీతి పుడమిలో జలమున్న
నీల్గు ప్రాణి జీవి నిలుచు నిజము
4) పుడమి గర్భమందు బుడగ నీరుండిన
హరితదనము అవని నావహించు
నింగి నేల వాలి నీరంత మడుగులై
పాడి. పంట తోడ పల్లవించు
5) వేదకాలమందు విలసిల్లు జలముల
పరిమితముగ వాడి ఫలితమంది
పంచభూతములను ప్రార్థించి కొలిచిరి
కాలమంత సుఖము గడిపినారు
6) నిండు చెరువు మాకు మెండు హర్షము నిచ్చు
ఈదులాడ మనసు వాదులాడు
అలసిపోవు వరకు అందాల చెరువులో
ఈతకొట్టి చివరకిల్లు చేరు
– కోట