కలలు కనకు
కులాల గోడల్ని దూకావో
జీవితాల్ని కూల్చేస్తారు
మతాల సరిహద్దుల్ని దాటావో
మాడిపోతావు!
ఇది ఆధునిక భారతం
సౌశీల్యం సౌహార్ద్రతలు
ఇంకిపోతున్న ఎడారిలో
మానవతా ఒయాసిస్సులకు దిక్కెక్కడ!
మనుషులు ద్వీపాలై
మనసులు కొడిగట్టిన దీపాలవుతుంటే
ప్రేమానురాగాలన్ని ఘనీభవిస్తున్నాయి
భక్తి పన్ను కట్టేశామా పాపాల భయముండదు
కోరికలు,కాంక్షల కళ్ళకు
కన్నీటి కరుణ తెలియదు
అక్షరాలు దిద్దిన చేతులకు
ఆత్మీయ స్పర్శ తెలియదు
ప్రవహించే కాలం
ప్రవక్తలా మారి బోధిస్తే బావుండు
బండబారిన సమాజానికి
బాధ్యత తెలుస్తుందని కలలు కనటమే మిగిలిందిక
– సి.యస్.రాంబాబు