నీలి నీడలు కమ్ముకున్న వేళ
“వెంటనే ఆపరేషన్ చేయాలి.. లేదంటే చాలా కష్టం.. ప్రాణానికే ప్రమాదం.” డాక్టర్ చెప్పిన మాటలు విని సంతోష్ ఉలిక్కిపడ్డాడు.. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయినట్టు కనిపించిందతనికి..
ఉన్నత చదువులు చదవాలని అతను కన్న కలలు.. విశ్వవిద్యాలయంలో చదవడం కోసం ర్యాంకు సంపాదించడానికి రేయింబవళ్లు పడిన కష్టం అంతా మర్చిపోవాల్సిందేనా.. అనారోగ్యానికి ఆశలను బలిచేయాల్సిందేనా..
“మనసుని అనేక ప్రశ్నలు దొలిచేస్తుంటే డాక్టర్ తో..”సర్, చాలా కష్టపడి చదివాను.. నాకంటూ ఓ లక్ష్యం పెట్టుకున్నాను.. ర్యాంకు కూడా వచ్చింది.. ఇప్పుడేమో ఏడాది పాటు చదువు మానేయాలంటున్నారు, అది నా వల్ల కాదు.” అనగానే డాక్టర్ కి కోపమొచ్చింది..
నీకేమైనా అర్ధమవుతోందా.. వెళ్తే పోతావ్”.. గట్టిగా మందలించారు.. అయినా సరే.. సంతోష్ మనసు మారలేదు. “యూనివర్శిటీలో జాయిన్ అయి, సెలవుపెట్టి వస్తాను.. అలాగైతేనే ఆపరేషన్ చేయించుకుంటా.. లేదంటే లేదు..
చదువు కంటే నాకు ప్రాణం ఎక్కువేం కాదు.. యూనివర్సిటీలో చేరకపోతే నేను బతికుండి ప్రయోజనం లేదు” అని భీష్మించుకుని కూర్చున్నాడు.. చేసేది లేక సంతోష్ అనుకున్నట్టే చేద్దామని డాక్టర్ కి సర్థిచెప్పుకున్నారు అతని తల్లిదండ్రులు.
“రెండేళ్ల పాటు ఇంటర్ చదవు కోసం రానూపోనూ 20 కిలోమీటర్లు.. డిగ్రీ కోసం మరో మూడేళ్లు రోజూ 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూనే కాలేజీకి వెళ్లాడు సంతోష్. దానివల్ల అతనికి ఆరోగ్యం దెబ్బతింది.
సైకిల్ గతుకుల రోడ్లమీద వెళ్లడం వల్ల సీటుపై కూర్చునే చోట కమిలిపోయింది. అది ఒకరకమైన సెగ్గడ్డలా మారి అనారోగ్యానికి దారితీసింది. లోపలివరకూ ఇన్ ఫెక్షన్ వెళ్లిపోయింది. అందుకే ఆపరేషన్ తప్పనిసరైంది”..
సంతోష్ వాళ్లమ్మ ఆపరేషన్ తరువాత పలకరించడానికి వచ్చినవారికి జరిగిందాని గురించి ఇలా చెబుతుంటే సంతోష్ మంచంపై ఒకవైపు తిరిగి పడుతున్నాడు. యూనివర్శిటీలో చేరి, ఒక నెల రోజులు సెలవుపెట్టి వచ్చి ఆపరేషన్ చేయించుకుని అప్పటికే మూడు వారాలైంది.
కానీ ఏమాత్రం మార్పులేదు. కోత పెట్టిన ప్రదేశం ఇంకా పచ్చిగానే ఉంది. ఇదేమిటని డాక్టర్ ని మరోసారి గట్టిగా అడిగితే ఆపరేషన్ ఫెయిలయ్యిందని మరోసారి చేయాలని బదులిచ్చాడు.. ఇంకోసారి సంతోష్ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కొడుకు అనుభవిస్తున్న నరకం చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. సంతోష్ కి సెలవులు అయిపోతున్నాయనే బెంగ పెరిగిపోతోంది..” అమ్మా.. ఏదైతే అది అయ్యింది వైజాగ్ వెళ్లిపోదాం.. అక్కడే మరో డాక్టర్ కి చూపిద్దాం.. నేనైతే ఇంక క్లాసులకు వెళ్లాల్సిందే.. ప్లీజ్ అమ్మా.” అంటూ సంతోష్ బతిమలాడుతుంటే ఆ తల్లి కాదనలేకపోయింది.
నడిచే ఓపిక లేదు.. సరిగ్గా కూర్చునే అవకాశం లేదు. అయినా తరగతి గదిలో కాళ్లను మాత్రమే బెంచీకి అదిమిపట్టి కూర్చోకుండా పాఠాలు వింటున్నాడు సంతోష్.. అలా ఎంతసేపని ఉండగలడు..
కాసేపటికి కూర్చుంటే, ఒత్తిడికి గురై, రెండవసారి ఆపరేషన్ జరిగిన చోట నుంచి రక్తం ధారలుగా కారుతోంది. మరుసటి రోజు నుంచీ లో దుస్తుల్లో దూది ఎక్కువగా పెట్టుకుని బాధను భరిస్తూనే చదువుకుంటున్నాడు సంతోష్.
యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటే అమ్మ తనను చూసుకోవడం కుదరదని, బయట ఓ గది అద్దెకు తీకున్నాడు. వాళ్ల ఊరాయన ఒకరు విశాఖలోనే ఉంటున్నారు. ఆయనే గ్యాస్ బండ సమకూర్చారు.
ఆ చిన్న గదిలోనే తల్లితో పాటు అమ్మమ్మ ఉండి సంతోష్ ను కంటికి రెప్పలా చూసుకున్నారు. రెండు బస్సులు మారి యూనివర్సిటీకి వెళుతూ, దాదాపు ఆరు నెలల పాటు నరకాన్ని అనుభవిస్తూ సెమిస్టర్ పరీక్షలు రాశాడు సంతోష్..
అనారోగ్యం కుంగదీసింది. జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.. కానీ సంతోష్ సంకల్పం చాలా గట్టిది. అతని ఆత్మస్థైర్యం ముందు అనారోగ్యం తలవంచక తప్పలేదు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. అతనిలో ఏమాత్రం ఆందోళన లేదు..
తనకు తెలుసు తాను పరీక్ష బాగా రాశానని. చదువుపై అతనికున్న ఇష్టం, తనపై తనకున్న నమ్మకం, ఎలాగైనా చదవాలనే దృఢ నిశ్చయం అతనిని ఫస్ట్ క్లాస్ లో నిలబెట్టాయి..
నీలి నీడలను చీల్చుకుంటూ గెలుపు కిరణాలు సంతోష్ జీవితంలోకి ప్రవేశించాయి. ఇప్పుడతను తన కుటుంబాన్నే కాదు.. ఎన్నో కుటుంబాలను నిలబెట్టే గొప్ప స్థాయికి చేరుకున్నాడు. తనలాంటి వారెందరికో ఆదర్శమై చేయూతనందిస్తున్నాడు.
– ది పెన్