మోసం
మోసం నీకు కొత్త కాదు నేస్తమా!
మోహంలో మోసం అని తెలిసినా,
క్షమించిన సందర్భాలెన్నో…
అదే మోసం అదే వ్యక్తితో పదేపదే జరుగుతుంటే
తెలిసి కూడా మోసపోవడం
తెలివితక్కువే కదా!
నా ప్రేమకు నీలి నీడలు క్రమ్మిన ప్రతిసారి
గుండెల్లో గూడు కట్టుకున్న మొయిలు
నీ పాదాలపైనే వేడుకోలుగా వర్షించాయి..
అప్పుడు నా ప్రేమొక గడ్డిపరక
అప్పుడు నా ప్రేమొక దూదిపింజ
అప్పుడు నా ప్రేమొక యాష్ ట్రే
అందుకే అంత చులకనైన
నా ప్రేమని నువు సమాధి చేసి
ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు
నా కన్నీటి కడలి లోతెంతో
నీ ఊహకు కూడా అందదు..
ఎడారిగా మారిన నా మనసుతో
జీవచ్ఛవంలా నేనుంటే
ఓదార్చే మనిషిలేక
అర్ధరాత్రి వెర్రి కేకలు వేస్తూ
పిచ్చిదాన్నయిన నాకు
చేయందించి చేయూతనిచ్చింది అక్షరం.
ఇప్పుడు ఆ అక్షరమే నా ప్రాణం నా ప్రణవం.
కాల గురువు నా విలువను పాఠంగా చెప్పి
నీకు కనువిప్పు కలిగించింది
ఇప్పుడు క్షమించమని వేడుకుంటూ
గుండెల్లో గుడి కట్టినా ఏం లాభం ?
ఆకాశంలో మబ్బుల మధ్యన
నేను దూదిపింజలా విహరిస్తున్నా….
దయచేసి దానిని కిందకి లాగి
మొసలి కన్నీటితో తడిపి
బరువుచేయొద్దని బ్రతిమాలుతున్నా…
అదే నువ్వు నాకిచ్చే
నిజమైన ప్రేమ నివాళి..
– సలాది భాగ్యలక్ష్మి