నీ నవ్వుకి సరితూగదు
నల్లని దుప్పటి పరచుకుని
అనంతమైన తారల తళుకుల్తో
కాంతులు చిందించే
నీలాకాశం ఎంత
నీ వర్చస్సు ముందు!
భయంకరంగా
మెరుపులు మెరుస్తున్నా
ఉరుములు ఉరుముతున్నా
వెరవక సాగే నీ జీవనం ముందు
చిన్నబోదా ఆ తారాలోకం!
ఎగసి ఎగసి పడుతున్న అలలకి
తడిసి తమకమున మునిగిన
శిలలైనా కరగవా
నవ్వే మోము వెనుక దాగిన కష్టాల కడలి ఆటుపోట్లకి!
నిత్యవసరాలు లేకనే
పూట గడవడం కష్టమైనా
నిన్ను నీవు నమ్ముకున్న ధైర్యంచూసి
నమ్మకమే నిశ్చేష్టితవక మానదుగా!
వినీలాకాసపు పందిరి కింద
లక్షల తారల తళుకుల వెలుగులో
ధరిత్రి పీఠంమీద ఉనగనంతలో రాజసంగా బ్రతికేస్తున్న
నీముందు ధనమే తలవంచదా!
లేదని చింతిస్తూ దుఃఖించకనే..
అత్యాసల కలలతో సతమతమవకనే
దినము గడిచిన చాలు తృప్తి పడు నీ ముందు
ఏదేమైనా పూట గడిచినది చాలను నీ ఆత్మస్థైర్యం ముందు
చెదరక విడువక నీ అధరాలకిచ్చిన నవ్వను కానుక ముందు
వీధి బాలకా నీ మెడలో నక్షత్రమాలలెన్ని వేసినా చిన్నబోవునుగా…!
– ఉమామహేశ్వరి యాళ్ళ