నీ జతగా..
అల్లంత దూరాన ఆ నీలి నింగిని
వెలిగే తారకల కాంతుల తళుకులు
సముఖాన నీ దరహాసపు వెలుతురులు
జంటగా సాగే పడవ పయనాన చల్లని మారుతాలు
వీచేగాలులు మోసుకొచ్చే నీ మేని పరిమళాలు
తళతళలాడే నీటి అలల సుస్వరాలు
చేతి గాజులు చేసే గలగల సవ్వడులు
నా చెంతన నిలిపి నా భవితంతా నీవైన క్షణం
లోకాలు మరచిపోయి నిలవాలనిపిస్తుంది
నీ కనుకొలనులోకి చూస్తూండిపోవాలని
నుదుటి సింధూరమై కలకాలం నిలవాలని
మెడలో తాళినై హత్తుకుపోవాలని
దూరమంటే ఎరుగని నది దరిలా కలిసుండాలని
అల్లంత దూరాల కలిసిన భూమ్యాకాశాల మాదిరి
తొలిసంధ్యలో వెలుగులీనే సూర్యుని ఉత్తేజంలా
అల్లరి చేసే నీ మాటలకి తాళం వేసే నీ ముంగురుల్లా
కలకాలం నిలిచిపోనా నీ జతగా….
– ఉమామహేశ్వరి యాళ్ళ